Iran attacks : చమురు ట్యాంకర్‌పై ఇరాన్‌ దాడి.. నలుగురు భారతీయులకు గాయాలు

by Ramesh Naini |   (  Updated:2026-03-01 11:55:11  IST  )

ఇజ్రాయెల్‌-ఇరాన్‌ మధ్య ఉద్రిక్తతలు తీవ్రస్థాయికి చేరిన వేళ, ఒమన్‌ తీరంలో ప్రయాణిస్తున్న భారతీయ సిబ్బందితో కూడిన చమురు ట్యాంకర్‌పై ఇరాన్‌ దాడి చేసింది.

Iran attacks : చమురు ట్యాంకర్‌పై ఇరాన్‌ దాడి.. నలుగురు భారతీయులకు గాయాలు
X

దిశ, డైనమిక్ బ్యూరో: ఇజ్రాయెల్‌-ఇరాన్‌ మధ్య ఉద్రిక్తతలు తీవ్రస్థాయికి చేరిన వేళ, ఒమన్‌ తీరంలో ప్రయాణిస్తున్న భారతీయ సిబ్బందితో కూడిన చమురు ట్యాంకర్‌పై ఇరాన్‌ దాడి చేసింది. ఈ ఘటనలో నలుగురు భారతీయులకు గాయాలయ్యాయి. ట్యాంకర్‌లో మొత్తం 15 మంది భారతీయులు, ఐదుగురు ఇరానీయులు సహా 20 మంది సిబ్బంది ఉన్నట్లు ఒమన్‌ సముద్ర భద్రతా కేంద్రం వెల్లడించింది. పాలౌ జెండాతో ప్రయాణిస్తున్న ‘స్కైలైట్’ అనే చమురు ట్యాంకర్‌ను ముసందమ్‌ ద్వీపకల్పంలోని ఖసాబ్‌ పోర్టుకు ఉత్తరంగా సుమారు ఐదు నాటికల్‌ మైళ్ల దూరంలో లక్ష్యంగా చేసుకొని దాడి చేసినట్లు అధికారులు తెలిపినట్లు అంతర్జాతీయ మీడియా తెలిపింది. దాడికి ఏ ఆయుధాన్ని వినియోగించారన్న విషయాన్ని అధికారులు వెల్లడించలేదు. ఘటన అనంతరం సిబ్బందిని సురక్షితంగా తరలించినట్లు పేర్కొన్నారు. దాడిలో గాయపడిన నలుగురికి గాయాలైనట్లు ప్రాథమిక సమాచారం. వారిని సమీప ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. మిగిలిన సిబ్బంది సురక్షితంగా ఉన్నారని అధికారులు తెలిపారు.

గల్ఫ్‌ ప్రాంతంలో ఆందోళన..

ఇజ్రాయెల్‌-ఇరాన్‌ మధ్య జరుగుతున్న తాజా సైనిక ఉద్రిక్తతల నేపథ్యంలో గల్ఫ్‌ ప్రాంతంలో భద్రతా పరిస్థితి తీవ్రంగా క్షీణిస్తోంది. అమెరికా-ఇజ్రాయెల్‌ సంయుక్త దాడుల్లో ఇరాన్‌ సుప్రీం లీడర్‌ అయతుల్లా అలీ ఖమేనీ హతమవ్వడంతో ప్రతీకార చర్యలుగా ఇరాన్‌ దాడులు చేపట్టినట్లు సమాచారం. దీంతో మిడిల్ ఈస్ట్ ఉద్రిక్తత వాతావరణం చోటు చేసుకుంది. కాగా, స్ట్రెయిట్‌ ఆఫ్‌ హార్ముజ్‌కు సమీపంలోని ముసందమ్‌ ప్రాంతం కీలకం అని, ప్రపంచ చమురు సరఫరాలో సుమారు ఐదో వంతు ఈ మార్గం గుండా ప్రయాణిస్తుంది. ఈ నేపథ్యంలో ఇక్కడ జరిగిన దాడి అంతర్జాతీయ స్థాయిలో ఆందోళన కలిగిస్తోంది. ఇదే రోజు ఒమన్‌లోని డుక్మ్‌ వాణిజ్య నౌకాశ్రయంపై రెండు డ్రోన్లు దాడి చేసిన ఘటనలో ఒక విదేశీ కార్మికుడు గాయపడినట్లు ఒమన్‌ ప్రభుత్వ మీడియా తెలిపింది. మరో డ్రోన్‌ శకలాలు ఇంధన నిల్వల సమీపంలో పడినప్పటికీ ప్రాణ నష్టం లేదా భారీ ఆస్తి నష్టం జరగలేదని అధికారులు వెల్లడించారు.

టెహ్రాన్‌ గుండెకాయపై ఇజ్రాయెల్ గురి.. రాజధానిలో వరుస పేలుళ్లు!

Next Story