పల్లెలకు మహర్దశ..!

by Jakkula.Mamatha |

గ్రామీణ రవాణా వ్యవస్థను బలోపేతం చేయాలనే లక్ష్యంతో కొడంగల్ నియోజకవర్గం లో రోడ్ల విస్తరణ పనులు వేగంగా కొనసాగుతున్నాయి.

పల్లెలకు మహర్దశ..!
X

దిశ,కొడంగల్: గ్రామీణ రవాణా వ్యవస్థను బలోపేతం చేయాలనే లక్ష్యంతో కొడంగల్ నియోజకవర్గంలో రోడ్ల విస్తరణ పనులు వేగంగా కొనసాగుతున్నాయి. సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేక చొరవతో రోడ్లు, భవనాల శాఖ ఆధ్వర్యంలో రూ.365 కోట్ల వ్యయంతో 148.5 కిలోమీటర్ల మేర సింగిల్ లైన్ రోడ్ల ను డబుల్ లైన్లుగా, డబుల్ లైన్లను మూడు లైన్ల రహదారులుగా విస్తరిస్తున్నారు. 15 నెలల్లోనే 80 శాతం పనులు పూర్తికాగా, 2027, డిసెంబర్ 31 నాటికి అన్ని పనులు పూర్తి చేయాలని లక్ష్యం పెట్టుకున్నారు.

ప్రధాన రహదారుల విస్తరణ..

జాతీయ రహదారి నుంచి అంగడిరైచూర్–అన్నారం–టేకుల్‌కోడ్ మీదుగా రుద్రారం వరకు రూ.33 కోట్లతో డబుల్ రోడ్డు విస్తరణ పనులు కొనసాగుతున్నాయి. పర్సా పూర్ నుంచి పాత కొడంగల్ వరకు నాలుగు కిలోమీటర్ల రహదారిని రూ.11 కోట్లతో డబుల్ లైన్‌గా అభి వృద్ధి చేస్తున్నారు. దౌల్తాబాద్ మండలం కుదురుమల్ల నుంచి దోమ మండలం దాదాపూర్ వరకు 17 కిలోమీటర్ల రహదారిని రూ.50 కోట్లతో విస్తరిస్తున్నారు. కోస్గి–దౌల్తాబాద్, రావల్‌పల్లి–మద్దూర్ మా ర్గాలను కూడా వెడల్పు చేసి రవాణా సౌకర్యాలను మెరుగుపరుస్తున్నా రు. హస్నాబాద్ నుంచి పెద్ద నందిగామ మీదుగా నీటూర్ సరిహద్దులోని హైదరాబాద్–బీజాపూర్ జాతీయ రహదారిని కలిపే 10.3 కిలోమీటర్ల రహదారికి రూ.26 కోట్లు కేటాయించగా, 80 శాతం పనులు పూర్తయ్యాయి. లింగన్‌పల్లి–దుద్యా ల మధ్య 11 కిలోమీటర్ల రహదారిని రూ.28 కోట్లతో విస్తరిస్తున్నారు. బొంరాస్‌పేట్, నందారం ప్రాంతా ల్లో రూ.10 కోట్లతో హై లెవెల్ వం తెనల నిర్మాణం కొనసాగుతోంది. ప్రత్యేక అభివృద్ధి నిధులతో ఊరకుంటతండా, సంగాయిపల్లి, పలుగురాళ్ల తండా, జీడిగడ్డ తండాలకు బీటీ రోడ్లు నిర్మించారు.

పల్లెలకు కొత్త ఊపిరి..

రోడ్ల విస్తరణతో రైతులు తమ పంటలను మార్కెట్లకు సులభంగా తరలించే అవకాశం ఏర్పడగా, అత్యవసర వైద్య సేవలు కూడా గ్రామాలకు వేగంగా చేరుతున్నాయి. పల్లెలను మెరుగైన రహదారులతో అనుసంధానించటం ద్వారా కొడంగల్ నియోజకవర్గంలో గ్రామీణాభివృద్ధికి కొత్త ఊపు లభిస్తోందని అధికారులు పేర్కొంటున్నారు.

గడువులోగా పూర్తి చేస్తాం:ఆర్‌అండ్‌బీ ఈఈ శ్రీధర్ రెడ్డి

వికారాబాద్ జిల్లా ఆర్‌అండ్‌బీ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ శ్రీధర్ రెడ్డి మాట్లాడుతూ.. సీఎం నిర్దేశించిన గడువులోగా అన్ని పనులు పూర్తి చేయడమే లక్ష్యమన్నారు. నాణ్యత విషయంలో ఎక్కడా రాజీ పడకుండా క్షేత్రస్థాయిలో నిరంతర పర్యవేక్షణ చేస్తున్నామని తెలిపారు. ఇప్పటికే 80 శాతం పనులు పూర్తయ్యాయని, మిగిలిన పనులను కూడా నిర్ణీత గడువులో 2027 నాటికి పూర్తి చేసేందుకు వారాంత సమీక్షలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. రావల్‌ పల్లి–దౌల్తాబాద్, కుదురుమల్ల–దాదాపూర్ రహదారులు తుది దశకు చేరుకున్నాయని వెల్లడించారు. రోడ్ల విస్తరణ పనుల సమయంలో రైతులు, వాహనదారులకు ఇబ్బందులు కలగకుండా డైవర్షన్లు ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. వర్షాకాలాన్ని దృష్టిలో ఉంచుకుని వంతెనల నిర్మాణ ప్రాంతాల్లో ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటున్నామని, క్వాలిటీ కంట్రోల్ విభాగం ద్వారా నిరంతరం తనిఖీలు నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు.

Next Story