మైనింగ్ డిపార్ట్మెంట్‌లో నేనే రాజు.. నేనే మంత్రి..!

by Malleboina Mahesh |

కరీంనగర్‌లో పనిని బట్టి రేట్లు నిర్ణయిస్తున్న గనులు, భూగర్భ శాఖ అధికారులు అందుకు ప్రత్యేక కోడ్ భాషను అమలు చేస్తూ ఫైళ్లను కదిలిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.

మైనింగ్ డిపార్ట్మెంట్‌లో నేనే రాజు.. నేనే మంత్రి..!
X

దిశ, కరీంనగర్ బ్యూరో: అక్కడ ప్రతి పనికీ ఓ ప్రత్యేక రేటు ఉంటుంది. డబ్బులు ముట్టనిదే ఫైల్ ముందుకు కదలదు. పనిని బట్టి రేట్లు నిర్ణయిస్తున్న గనులు, భూగర్భ శాఖ అధికారులు అందుకు ప్రత్యేక కోడ్ భాషను అమలు చేస్తూ ఫైళ్లను కదిలిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ప్రభుత్వ జీతాలు తీసుకుంటూనే బడా వ్యాపారుల కనుసన్నల్లో పాలనాపరమైన వ్యవహారాలు సాగిస్తున్నారని విమర్శలు వ్యక్తమవుతున్నాయి. వారికి లాభం జరిగితే పని వెంటనే పూర్తవుతుండగా లేదంటే పని ఒత్తిడి ఉందంటూ ఫైళ్లను పక్కన పెడుతున్నారనే ఆరోపణలు ఉన్నాయి. చిన్నచితకా వ్యాపారులకు చెక్ పెట్టేందుకు ప్రత్యేక అస్త్రాలను ప్రయోగిస్తూ కోర్టు ఆదేశాలు, ప్రభుత్వ సిఫార్సులను సైతం పక్కన పెడుతున్నారని, ‘ఇక్కడ నేనే రాజు.. నేనే మంత్రి’ అన్నట్టుగా వ్యవహరిస్తూ ప్రభుత్వాన్నే పక్కదారి పట్టిస్తున్నారని రాజన్న సిరిసిల్లా మైనింగ్ శాఖ అధికారులపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

కోర్టు ఆదేశాలు, మంత్రి సిఫార్సు బేఖాతర్

రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలం ఓబులాపురం రెవెన్యూ గ్రామ శివారులో ఉన్న చేమంతి స్టోన్ క్రషర్ యజమాని ఆరోగ్య, ఆర్థిక పరిస్థితుల నేపథ్యంలో కొంతకాలంగా క్రషర్‌ను మూసివేశారు. ఈ క్రమంలో ఆ క్రషర్‌ను సందర్శించిన మైనింగ్ అధికారులు ఎంత మేర మైనింగ్ జరిగిందో నిర్ధారించేందుకు కొలతలు చేపట్టారు. అయితే ఆ కొలతల్లో తేడాలు ఉన్నాయని పేర్కొంటూ క్రషర్ యజమాని పలుమార్లు తిరిగి కొలతలు చేపట్టాలని అధికారులను కోరారు. అయినప్పటికీ అధికారులు ఆయన విన్నపాన్ని పట్టించుకోకుండా క్రషర్ ఐడీలను బ్లాక్ చేశారు. దీంతో బాధితుడు గౌరవ హైకోర్టును ఆశ్రయించగా, కోర్టు కేసు వివరాలను పరిశీలించి క్రషర్ ఐడీలను తిరిగి యాక్టివ్ చేయాలని ఆదేశించింది.

కోర్టు ఉత్తర్వులను అధికారులకు అందజేసినప్పటికీ వాటిని అమలు చేయకుండా, "ఇది మా చేతుల్లో లేదు.. ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలి" అంటూ చేతులెత్తేశారని బాధితుడు ఆరోపిస్తున్నారు.ఈ విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడంతో స్పందించిన గనులు, భూగర్భ శాఖ మంత్రి బాధితుడి వాదనలు విని కోర్టు ఆదేశాలను అమలు చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేసినట్లు తెలుస్తోంది. అయితే ఆ ఆదేశాలు అందుకున్న అధికారులు వాటిని అమలు చేయడంలో మీనమేషాలు లెక్కిస్తున్నారని, ఇక ఎవరికి మొరం పెట్టుకోవాలి అర్థం కావడం లేదని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

బడా సంస్థలకు కొమ్ము కాస్తూ.. చిన్న పరిశ్రమలకు చెక్

ప్రభుత్వ ఆదేశాలను అమలు చేయాల్సిన రాజన్న సిరిసిల్లా జిల్లా మైనింగ్ శాఖ అధికారులు బడా వ్యాపారుల కనుసన్నల్లో పాలనాపరమైన వ్యవహారాలు సాగిస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. చిన్న పరిశ్రమలు, వ్యాపారులను దెబ్బతీసి వారిని స్వాధీనం చేసుకునేందుకు బడా వ్యాపారులు చేస్తున్న ప్రయత్నాలకు అధికారులు సహకరిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఇందుకోసం ప్రత్యేక నిబంధనలను అమలు చేస్తూ సంవత్సరాల తరబడి ఐడీలను బ్లాక్ చేసి చిన్న పరిశ్రమలను ఆర్థికంగా దెబ్బతీస్తున్నారని ఆరోపిస్తున్నారు. దీంతో చిన్న వ్యాపారులు వ్యాపారం కొనసాగించలేక, పరిశ్రమలను మూసివేయలేక కార్యాలయాల చుట్టూ తిరుగుతున్న పరిస్థితి నెలకొంది.

మామూళ్ల కోసం మైనింగ్ అధికారుల మాయాజాలం

లక్షల రూపాయల ప్రభుత్వ జీతాలు తీసుకుంటున్న మైనింగ్ అధికారులు ప్రభుత్వ సేవలను అందించడానికి ప్రత్యేక పద్ధతులు అమలు చేస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. పనిని బట్టి రేట్లు నిర్ణయించి, అందుకు ప్రత్యేక కోడ్ భాషను ఉపయోగిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఆ కోడ్ ప్రకారం వ్యవహారం ఉంటేనే ఫైల్ సాఫీగా ముందుకు కదులుతుందని, లేకపోతే ఏదో ఒక కారణం చూపి ఫైల్‌ను పక్కన పెడుతున్నారని ఆరోపిస్తున్నారు.తిరిగి ఫైల్ ముందుకు కదలాలంటే బడా వ్యాపారులు లేదా అధికారులకు మామూళ్లు వసూలు చేసే ప్రైవేటు వ్యక్తుల సూచన తప్పనిసరిగా ఉండాల్సి వస్తోందని వ్యాపారులు వాపోతున్నారు. అధికారుల మామూళ్ల వ్యవస్థతో కొందరు వ్యాపారులు కోర్టులను ఆశ్రయిస్తుండగా, మరికొందరు వ్యాపారాన్ని కొనసాగించలేక తమ పరిశ్రమలను బడా వ్యాపారులకు అప్పగించి తప్పుకుంటున్నారని చెబుతున్నారు.

కార్యాలయంలో ఫోన్ నిషేధం

రాజన్న సిరిసిల్లా జిల్లా మైనింగ్ శాఖ అధికారులను కలవాలంటే మొబైల్ ఫోన్లను బయటే వదిలివేయాల్సిందే. లేకపోతే కార్యాలయంలోకి అనుమతి ఉండదని అక్కడి నిబంధనలు చెబుతున్నాయి. సందర్శకులు తమ మొబైల్ ఫోన్లను కార్యాలయంలో ఏర్పాటు చేసిన బాక్స్‌లో ఉంచి లోపలికి వెళ్లాల్సి వస్తోంది. లేకపోతే వెంట వచ్చిన వారికి అప్పగించి లోపలికి వెళ్లాలి. ఈ ఫోన్ నిషేధ నిబంధన సందర్శకులను ఆశ్చర్యానికి గురి చేస్తుండగా, శాఖ అధికారులపై వస్తున్న విమర్శలకు మరింత బలం చేకూరుస్తోందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

పర్మిషన్ ఉంటే చాలు.. పట్టించుకోం

చిన్న వ్యాపారుల విషయంలో కఠిన నిబంధనలు అమలు చేస్తున్న మైనింగ్ అధికారులు, బడా గ్రానైట్ క్రషర్ యజమానుల విషయంలో మాత్రం భిన్నంగా వ్యవహరిస్తున్నారనే విమర్శలు ఉన్నాయి. చిన్న వ్యాపారుల ఐడీలను బ్లాక్ చేస్తూ కఠిన చర్యలు తీసుకునే అధికారులు, పెద్ద వ్యాపారులకు మాత్రం లీజు పర్మిషన్ ఉంటే ఎంత మేర మైనింగ్ చేసినా పట్టించుకోవడం లేదని ఆరోపణలు ఉన్నాయి.దీనికోసం నెలవారీగా నిర్దిష్ట మొత్తం చెల్లించేలా ఒప్పందాలు కుదుర్చుకుని, ఆ మొత్తాన్ని తీసుకున్న తర్వాత అటు వైపు కన్నెత్తి కూడా చూడరని విమర్శలు వినిపిస్తున్నాయి. అధికారుల ఈ తీరుతో ప్రభుత్వ ఖజానాకు కోట్ల రూపాయల నష్టం వాటిల్లడమే కాకుండా, ప్రకృతి సహజ వనరులు నాశనమై, కాలుష్యం పెరిగి గ్రామాలు, పట్టణాలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

"ప్రభుత్వ ఆదేశాల ప్రకారమే వ్యవహరిస్తున్నాం"

"ప్రభుత్వ ఆదేశాల మేరకే మేము పనిచేస్తున్నాం. కోర్టు ఆదేశాలను పరిశీలిస్తూ ప్రభుత్వ నిబంధనల ప్రకారమే విధులు నిర్వహిస్తున్నాం. అయినప్పటికీ కొన్ని విమర్శలు వస్తున్నాయి. మేమెక్కడా తప్పు చేయడం లేదు. ప్రతి ఫైల్‌ను మా పై అధికారులకు పంపిస్తాం. ఐడీలను ఓపెన్ చేసే అధికారం మా చేతుల్లో ఉండదు. మేము కేవలం సిఫార్సు మాత్రమే చేస్తాం.- క్రాంతికుమార్, మైనింగ్ ఏడీ, రాజన్న సిరిసిల్ల

Next Story