ప్రశాంత్ కిషోర్‌తో టీఆర్‌ఎస్ చర్చలు.. అందుకోసమేనా?

by  |
ప్రశాంత్ కిషోర్‌తో టీఆర్‌ఎస్ చర్చలు.. అందుకోసమేనా?
X

దిశ, తెలంగాణ బ్యూరో: హుజూరాబాద్ ఉప ఎన్నిక ఫలితం తర్వాత గులాబీ బాస్ వ్యూహం అంతు చిక్కడం లేదు. సరికొత్త పొలిటికల్ గేమ్ స్టార్ట్ అయింది. వడ్ల కొనుగోళ్లు, ఢిల్లీ పర్యటనతో అటెన్షన్ డైవర్షన్ అయింది. తాజాగా ప్రశాంత్ కిషోర్ టీమ్‌తో టీఆర్ఎస్ పార్టీ టచ్‌లోకి వెళ్ళినట్టు సమాచారం. మూడు అంశాలపై చర్చించినట్లు తెలిసింది. ఢిల్లీ పర్యటనలోనూ దీనిపై ఒక రౌండ్ చర్చలు జరిగినట్లు సమాచారం. అసెంబ్లీ ఎన్నికలకు ఇంకా చాలా సమయం ఉన్నా ఇప్పటినుంచే టీఆర్ఎస్ గ్రౌండ్ వర్క్ సిద్ధం చేసుకుంటున్నదని తెలిసింది. గులాబీ సీనియర్ నేతలు మాత్రం పీకే టీమ్‌తో చర్చల విషయాన్ని గుంభనంగా ఉంచారు. మూడు అంశాల ఆధారంగా పీకే టీమ్‌తో టీఆర్ఎస్ చర్చలు జరిపినట్లు తెలిసింది. హుజూరాబాద్ అసెంబ్లీ ఉప ఎన్నికల్లో సర్వశక్తులూ ఒడ్డినప్పటికీ ప్రతికూల ఫలితం రావడానికి దారితీసిన కారణలపై సర్వే చేసి వివరాలను సేకరించడం మొదటిది. రెండోది రానున్న అసెంబ్లీ ఎన్నికలకు ఆ టీమ్ నుంచి పూర్తి స్థాయిలో సహకారం తీసుకోవాల్సిన ఆవశ్యకత ఏ మేరకు ఉన్నదనేది నిర్ణయించడం. ఇక ఫైనల్‌గా, గతంలో ఫెడరల్ ఫ్రంట్ పేరుతో కాంగ్రెసేతర, బీజేపీయేతర ప్రాంతీయ పార్టీలను కూడగట్టే ప్రయత్నం జరిగినా అది లాజికల్ ఎండ్‌కు చేరకపోవడంతో ఇప్పుడు ఆ టాస్కును మమతా బెనర్జీ తీసుకున్నందున టీఆర్ఎస్ పోషించాల్సిన పాత్రపై స్పష్టతకు రావడం.

ప్రజా వ్యతిరేకత అంచనా కోసం

వినూత్నమైన సంక్షేమ పథకాలను అమలుచేస్తున్నా ప్రజలు ఆదరించకపోవడం, ఊహించిన స్థాయిలో ఫలితం రాకపోవడంపై ఒకింత అసంతృప్తితోనే ఉన్నారు. కేసీఆర్ ఎక్కువగా సర్వేలు, ఇంటెలిజెన్స్ ఇన్‌పుట్స్‌పై ఆధారపడుతూ ఉంటారు. హుజూరాబాద్ వెలుగులో రానున్న భవిష్యత్తుపై దృష్టి పెట్టారు. క్షేత్రస్థాయిలో ప్రజల అభిప్రాయాలు, ప్రభుత్వం పట్ల ఉన్న వ్యతిరేకత తదితరాలను పీకే టీమ్‌ ద్వారా సర్వే చేయించి సేకరించినట్లు సమాచారం. ఆ టీమ్ సభ్యులు రెండు రోజుల క్రితమే ప్రెజెంటేషన్ రూపంలో కేసీఆర్‌కు వివరించినట్లు తెలిసింది. ఇకపైన వీటి ఆధారంగా దిద్దుబాటు చర్యలతో పాటు ప్రజల నమ్మకాన్ని గెల్చుకోడానికి తగిన వ్యూహాన్ని కేసీఆర్ రచించే అవకాశం ఉంది.

కేసీఆరే పెద్ద వ్యూహకర్త?

తెలంగాణ ఉద్యమం మొదలు ఇప్పటివరకూ ప్రజల పల్స్‌కు అనుగుణంగా వ్యూహాన్ని రచించడం, అమలుచేయడంలో కేసీఆర్ ఆయనకు ఆయనే సాటి. ప్రశాంత్ కిషోర్ ఆయనను మించిన వ్యూహకర్తేమీ కాదనే అభిప్రాయాన్ని ఆ పార్టీకి చెందిన పలువురు వ్యక్తంచేశారు. అయినా ఇప్పుడు ఆయన టీమ్ సేవలను వినియోగించుకోవాల్సిన అవసరంపై చర్చ జరుగుతున్నది. గతంలో రాష్ట్ర సాధన విషయంలోగానీ, రెండుసార్లు అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపుకానీ కేసీఆర్ అనుకున్నట్లుగానే జరిగాయి. కానీ హుజూరాబాద్ విషయం మాత్రం భిన్నంగా రావడంతో అలర్ట్ అయ్యారని తెలిసింది. కేసీఆర్ మాటలు, కార్యాచరణ పట్ల ప్రజలకు ఎంతో విశ్వాసం ఉన్నప్పటికీ హుజూరాబాద్‌లో అది నెగెటివ్ కావడంతో పబ్లిక్ పల్స్ తెలుసుకోవడంపై దృష్టి పెట్టారు. పీకే టీమ్‌తో సర్వే చేయించుకోవడం అందులో భాగమేనంటున్నారు. పీకే టీమ్‌ సర్వే ద్వారా వచ్చే వివరాల ఆధారంగా దిద్దుబాటు చర్యలు చేపట్టాలన్నది కేసీఆర్ భావనగా ఆ పార్టీ నేతలు చెప్తున్న మాట. గత ఎన్నికల్లో జగన్ వినియోగించుకున్నట్లుగా ఈసారి టీఆర్ఎస్ కూడా పీకే సహకారాన్ని తీసుకోవడంపై ఇంకా క్లారిటీ రాలేదు. కానీ ఆప్షన్లను దగ్గర పెట్టుకునే ముందస్తు వ్యూహం మాత్రం ఉందనేది పార్టీ వర్గాల అభిప్రాయం. కేసీఆర్ ఢిల్లీ పర్యటనలో పీకే టీమ్‌తో ఒక దఫా చర్చలు జరిగినట్లు కూడా వార్తలు వస్తున్నాయి. కానీ గులాబీ పార్టీ నేతలు దీనిపై గుంభనంగానే ఉన్నారు. గతంలో రెండుసార్లు కేటీఆర్ చర్చలు జరిపినట్లు అప్పట్లో వార్తలు వచ్చాయి.

మధ్యవర్తిగా ప్రశాంత్ కిషోర్

గత అసెంబ్లీ ఎన్నికల్లో టీఎంసీ గెలుపునకు వ్యూహకర్తగా పీకే టీమ్ సేవలను వినియోగించుకున్న మమతా బెనర్జీ ఇప్పుడు దేశవ్యాప్తంగా ఉన్న ప్రాంతీయ పార్టీలను ఏకం చేసే టార్గెట్‌కు వాడుకోనున్నారు. కాంగ్రెస్ పని అయిపోయింది, యూపీఏ ఇకపైన ఒక చరిత్రే, అన్ని ప్రాంతీయ పార్టీలు ఏకం కావాలి అంటూ మమతా పిలుపునివ్వడం వెనక భారీ వ్యూహమే ఉన్నట్లు జాతీయ స్థాయిలో రాజకీయ చర్చ జరుగుతున్నది. ఆమ్ ఆద్మీ పార్టీ, డీఎంకే, ఎన్సీపీ, సమాజ్‌వాదీ, తదితర పార్టీలను సంప్రదించి ఒక్కటి చేసే బాధ్యతను ఇప్పుడు పీకే నిర్వహిస్తున్నారు. టీఆర్ఎస్‌తో పీకే టీమ్ సంప్రదింపులు కూడా అందులో భాగమేననే వాదన తెరపైకి వచ్చింది. రెండు జాతీయ పార్టీలకు ప్రత్యామ్నాయంగా ప్రాంతీయ పార్టీల కూటమి ఏర్పాటులో ఆయన కీలక భూమిక పోషించనున్నారు. గతంలో ఫెడరల్ ఫ్రంట్ పేరుతో ప్రాంతీయ పార్టీలను ఏకం చేయాలన్న కేసీఆర్ లక్ష్యం అసంపూర్ణంగా మిగిలిపోయినా ఇప్పుడు దాన్ని మమతా బెనర్జీ అందుకున్నారు. ఇప్పుడు గులాబీ పార్టీతో పీకే చర్చలు జరిపినట్లు వస్తున్న వార్తలు కూడా అందులో భాగమే. టీఆర్ఎస్ వైపు నుంచి ఎలాంటి నిర్ణయం జరుగుతుంది, మమతా బెనర్జీ వ్యూహానికి కేసీఆర్ జై కొడతారా, మళ్లీ ఇద్దరి మధ్య చర్చలు జరుగుతాయా అనేది ఆసక్తికరంగా మారింది

నమస్తే తెలంగాణ ఎండీకి సీఎం కేసీఆర్ బంపర్ ఆఫర్?…ఆ ఇద్దరి నేతలకు హ్యాండ్?.. టీఆర్‌ఎస్‌లో ఆసక్తి రేపుతున్న కేసీఆర్ నిర్ణయం



Next Story

Most Viewed