రాజ్యసభకు వెళ్లేది ఆయనేనా..? ఆ ఇద్దరికి కేసీఆర్ హ్యాండిచ్చినట్టేనా..?

by  |
రాజ్యసభకు వెళ్లేది ఆయనేనా..? ఆ ఇద్దరికి కేసీఆర్ హ్యాండిచ్చినట్టేనా..?
X

దిశ, తెలంగాణ బ్యూరో : రాజ్యసభలో టీఆర్ఎస్ ఖాతా నుంచి ఒక స్థానం ఖాళీ అయింది. ఈ స్థానాన్ని అధిష్ఠానం ఎవరితో భర్తీ చేస్తుందోననే ఉత్కంఠ నెలకొంది. ఆశావహులు ఎక్కువగా ఉండటం… ఈసారైనా తమకు అవకాశం కల్పిస్తారనే ఆశతో ఉన్నారు. పదుల సంఖ్యలో ఆశావహులు ఉండటం, ఒకటే స్థానం కావడంతో పోటీ తీవ్రంగా ఉంది. ఇప్పటికే పలువురు పేర్లను అధిష్ఠానం పరిశీలించగా ప్రధానంగా నమస్తే తెలంగాణ ఎండీ దామోదర్ రావు పేరు వినిపిస్తోంది. ఆయన పేరును త్వరలోనే ప్రకటించనున్నట్లు సమాచారం.

టీఆర్ఎస్ పార్టీ నుంచి రాజ్యసభలో బండ ప్రకాశ్ ప్రాతినిధ్యం వహిస్తున్నారు. అయితే పదవికాలం మరో రెండేళ్లు ఉన్నప్పటికీ ఆయనకు ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీగా అవకాశం కల్పించారు. దీంతో ఆయన ఎంపీ పదవికి రాజీనామా చేశారు. దీంతో ఖాళీ అయిన స్థానానికి ఎక్కువ సంఖ్యలో ఆశావహులు ఉన్నారు. గతంలోనే కొంతమందికి ఎంపీగా అవకాశం కల్పిస్తామని కేసీఆర్ హామీ ఇచ్చినప్పటికీ ఇవ్వలేదు. ఈ అసంతృప్తి పార్టీ నేతల్లో ఉంది. అనుకోకుండా రాజ్యసభ స్థానం ఖాళీ కావడంతో ఆ స్థానంలో అవకాశం కల్పిస్తారనే ఆశతో ఉన్నారు. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీగా, స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా అవకాశం రాకపోవడంతో రాజ్యసభకు అయినా ఎంపిక చేస్తారనే ఆశతో ఎదురు చూస్తున్నారు.

రాజ్యసభకు ఎవరిని పంపాలనేదానిపై ఇప్పటికే అధినేత పలువురి పేర్లను పరిశీలించినట్లు సమాచారం. రాష్ట్ర ప్రణాళికసంఘం వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్ కుమార్, ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటీ శ్రీనివాస్ రెడ్డి, నమస్తే తెలంగాణ ఎండీ దామోదరరావు పేర్లను పరిశీలించినట్లు తెలిసింది. వీరితో పాటు మరికొంత మంది పేర్లను పరిశీలించారు. ఇందులో ప్రధానంగా దామోదరరావు పేర్లను ప్రస్తావించినట్లు సమాచారం. గత సంవత్సరమే రాజ్యసభకు పంపిస్తామని ఆయనకు హామీ ఇచ్చినప్పటికీ రాజకీయ పరిణామాల నేపథ్యంలో అవకాశం కల్పించలేదు. ప్రస్తుతం రాజ్యసభ స్థానం ఖాళీ కావడంతో దామోదరరావుకు అవకాశం కల్పిస్తారనే ప్రచారం జరుగుతోంది. ఏదీ ఏమైనప్పటికీ కేసీఆర్ ఆశీస్సులు ఎవరికి ఉంటాయోననే ఉత్కంఠ పార్టీ నేతల్లో నెలకొంది.

ప్రశాంత్ కిషోర్‌తో టీఆర్‌ఎస్ చర్చలు.. అందుకోసమేనా?


Next Story