- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
స్వరాష్ట్రానికి తెలంగాణ హోంగార్డులు.. తుది దశకు మోడల్ హోంగార్డ్స్ బిల్లు సవరణ
మోడల్ హోంగార్డ్స్ బిల్లు సవరణతో ఏపీలో చిక్కుకున్న 200 మంది తెలంగాణ హోంగార్డుల్లో కొత్త ఆశలు.. స్వరాష్ట్ర బదిలీల కోసం ప్రభుత్వానికి విజ్ఞప్తి!

దిశ, తెలంగాణ బ్యూరో: దేశవ్యాప్తంగా హోంగార్డుల సేవలకు చట్టబద్ధ గుర్తింపు, మెరుగైన సంక్షేమం కల్పించే దిశగా కేంద్ర ప్రభుత్వం చేపట్టిన మోడల్ హోంగార్డ్స్ బిల్లు-1965 సవరణ ప్రక్రియ తుది దశకు చేరుకోవడం తెలంగాణ హోంగార్డుల్లో కొత్త ఆశలు రేకెత్తిస్తోంది. ముఖ్యంగా రాష్ట్ర విభజన జరిగి దశాబ్దం దాటుతున్నా.. ఇంకా ఆంధ్రప్రదేశ్‌లోనే విధులు నిర్వర్తిస్తున్న సుమారు 200 మంది తెలంగాణ స్థానికత కలిగిన హోంగార్డులు స్వరాష్ట్రానికి వచ్చేందుకు ఈ బిల్లు మార్గం సుగమం చేస్తుందన్న ఆశాభావం వ్యక్తమవుతోంది. చట్టపరమైన అంశాలను పరిశీలించి ముసాయిదా ఖరారైన వెంటనే రాష్ట్రాలకు పంపుతామని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి నిత్యానంద్ రాయ్ ఇటీవల స్పష్టం చేయడంతో.. తెలంగాణకు బదిలీ కోసం ఏళ్ల తరబడి ఎదురు చూస్తున్న వారిలో హర్షం వ్యక్తమవుతోంది.
ఉమ్మడి రాష్ట్ర విభజన తర్వాత సుమారు 200 మంది తెలంగాణ హోంగార్డులు ఏపీలో ఉండిపోయారు. కుటుంబం తెలంగాణలో, ఉద్యోగం ఏపీలో అన్నట్లుగా వీరి పరిస్థితి మారింది. ప్రతి వారం స్వరాష్ట్రానికి రాకపోకలు సాగుతుండటంతో రవాణా ఖర్చులు తడిసి మోపెడవుతున్నాయని, ఆర్థికంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వృద్ధ తల్లిదండ్రుల సంరక్షణతో పాటు, పిల్లల చదువులపైనా ఈ బదిలీల జాప్యం తీవ్ర ప్రతికూల ప్రభావం చూపుతోంది. ట్రాఫిక్ నియంత్రణ, విపత్తులు, పండుగలు, ఎన్నికల బందోబస్తుల్లో పోలీసులతో సమానంగా రేయింబవళ్లు వీరు సేవలందిస్తున్నారు. అయినప్పటికీ కనీస ఉద్యోగ భద్రత, సమాన పనికి సమాన వేతనం అమలు కావడం లేదు. ముఖ్యంగా తెలంగాణ స్థానికులు కావడం వల్ల ఏపీలో కానిస్టేబుల్ పదోన్నతులకు వీరు అర్హత కోల్పోయి తీవ్రంగా నష్టపోతున్నారు. దశాబ్దాల తరబడి సేవలు అందిస్తున్నా కనీసం గ్రూప్-సీ, గ్రూప్-డీ హోదా కూడా దక్కడం లేదని వాపోతున్నారు.
ఇటీవల జరిగిన తెలంగాణ శాసనసభ సమావేశాల్లోనూ హోంగార్డుల స్వరాష్ట్ర బదిలీల సమస్యను ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు ప్రస్తావించి, ప్రభుత్వ జోక్యాన్ని కోరారు. ఈ అంశంపై రాష్ట్ర ప్రభుత్వం సానుకూల నిర్ణయం తీసుకుంటుందని హోంగార్డులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. కేంద్రం మోడల్ బిల్లును ఖరారు చేస్తున్న నేపథ్యంలో, తెలంగాణ ప్రభుత్వం చొరవ తీసుకుని ఏపీలో పనిచేస్తున్న తమను తక్షణమే స్వరాష్ట్రానికి రప్పించాలని విజ్ఞప్తి చేస్తున్నారు. తాజా చట్ట సవరణ ద్వారా బదిలీలతో పాటు ఉద్యోగ భద్రత, సమాన వేతనం, సామాజిక భద్రత వంటి దీర్ఘకాలిక సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపి, తమ కుటుంబాల్లో వెలుగులు నింపాలని తెలంగాణ ప్రభుత్వాన్ని వారు కోరుతున్నారు.






