కడియం శ్రీహరి పై టీపీసీసీ చీఫ్‌కు కొండా సురేఖ ఫిర్యాదు

by Malleboina Mahesh |

ఎమ్మెల్యే కడియం శ్రీహరిపై మంత్రి కొండా సురేఖ టీపీసీసీ చీఫ్‌కు 3 పేజీల ఫిర్యాదు చేసింది. దేవాదాయ శాఖలో అనధికార సమీక్షలపై ఆగ్రహం వ్యక్తం చేసింది.

కడియం శ్రీహరి పై టీపీసీసీ చీఫ్‌కు కొండా సురేఖ ఫిర్యాదు
X

దిశ, తెలంగాణ బ్యూరో: మంత్రి కొండా సురేఖ, స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి ల మధ్య నెలకొన్న వివాదం మరింత ముదురుతోంది. ఈ వివాదంపై కడియం శ్రీహరి పై టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కి మంత్రి సురేఖ ఫిర్యాదు చేశారు. నార్సింగిలోని ఆయన నివాసంలో గురువారం కొండా సురేఖ ఆయనతో భేటీ అయి వివాదానికి సంబంధించిన వివరాలను తెలియజేశారు. కడియం శ్రీహరి నుంచి తనకు ఎదురవుతున్న ఇబ్బందులు, దేవాదాయ శాఖ మంత్రిగా తన అధికార పరిధిని ప్రశ్నించేలా ఇటీవల ఆయన వ్యవహరించారని ఆమె మహేశ్ కుమార్ గౌడ్ కి ఫిర్యాదు చేశారు. మంత్రి సురేఖ వివరణను సానుకూలంగా విన్న మహేశ్ కుమార్ గౌడ్ సమస్యను సమగ్రంగా పరిశీలిస్తామని, సంబంధిత అంశాలపై తగిన స్థాయిలో చర్చించి న్యాయమైన పరిష్కారానికి కృషి చేస్తామని ఆమెకు హామీ ఇచ్చారు.

మహేష్ కుమార్ గౌడ్ కి ఇచ్చిన మూడు పేజీల ఫిర్యాదు లేఖలో కొండా సురేఖ పలు అంశాలను ప్రస్థావించారు. రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రిగా సీఎం రేవంత్ రెడ్డి తనకు అప్పగించిన బాధ్యతలను అంతకరణ శుద్దితో నిర్వహిస్తున్నానని, తన పరిధిలోని శాఖ పరిపాలన, విధాన నిర్ణయాలు, సమీక్షలు, అభివృద్ధి కార్యక్రమాల పర్యవేక్షణ, అధికార యంత్రాంగానికి మార్గనిర్ధేశం చేయడం వంటి అంశాలను రూల్ ఆఫ్ బిజినెస్ ప్రకారం నిర్వహిస్తారనే అంశం అనుభవం ఉన్న ప్రజా ప్రతినిథులకు విదితమే అని పేర్కొన్నారు. అయినప్పటికీ స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి దేవాదాయ శాఖ మంత్రి నైన తనకు ఎటువంటి సమాచారం ఇవ్వకుండా హైదరాబాద్ లోని బొగ్గులకుంట దేవాదాయ శాఖ కమిషనర్ కార్యాలయంలో ఈనెల 6వ తేదీన దేవాదాయ శాఖ డైరక్టర్‌తో పాటు ఆ శాఖ అధికారులను సమావేశపరిచి పలు దేవాలయాల అభివృద్ధిపై అధికారిక సమీక్ష నిర్వహించడం అత్యంత విచారకరమైన, ఆందోళనకరమైన విషయమని కొండా సురేఖ స్పష్టం చేశారు.

కడియం శ్రీహరికి దేవాలయాలు లేదా ఆ శాఖ పరిధిలోకి వచ్చే ఇతర అంశాలకు సంబంధించి ఏమైనా సమస్యలుంటే సంబంధిత శాఖ మంత్రిగా తనను కానీ, అధికారులను కానీ అధికారికంగా సంప్రదించి తమ ప్రతిపాదనలు లేదా వినతిపత్రాన్ని సమర్పించాలన్నారు. అలా చేసి ఉంటే సంబంధిత నిబంధనలు, విధివిధానాలకు అనుగుణంగా వాటిని పరిశీల​ఇంచి తగిన చర్యలు తీసుకునే వీలుండేదని, కానీ, అలా జరగలేదని కొండా సురేఖ ఆరోపించారు. సమావేశానికి సంబంధించి ఎమ్మెల్యే కార్యాలయం విడుదల చేసిన అధికారికి ప్రెస్ నోట్ లో కూడా మాస్టర్ ప్లాన్ల రూపకల్పన, ప్రత్యేక అధికారుల బృందం ఏర్పాటు, అభివృద్ధి పనుల ప్రతిపాదనలు సిద్ధం చేయడం, దేవాదాయ భూముల పరిరక్షణకు చర్యలు తీసుకోవడం, జిల్లా కలెక్టర్ ద్వారా సర్వే నిర్వహించడం, నెల రోజుల్లో సమగ్ర నివేదిక సమర్పించాలని అధికారులను ఆదేశించడం వంటి అంశాలున్నాయని కొండా సురేఖ ఆరోపించారు.

ఇవన్నీ శాఖ పరిపాలన పరిధిలో మంత్రిగా నిర్ణయించాల్సిన అంశాలని, మంత్రిని పూర్తిగా విస్మరించి సమావేశం నిర్వహించడం పరిపాలన వ్యవస్థలో అనుచిత సంప్రదాయానికి నాంది పలికే చర్య అని ఆమె మండిపడ్డారు. శాఖా మంత్రి అధికారాలను బహిరంగంగా ప్రశ్నించే ప్రయత్నంగా కనిపిస్తోందని కొండా సురేఖ ఆరోపించారు. గతంలో కూడా తన రాజకీయ, వ్యక్తిగత ప్రతిష్టను దెబ్బతీసే ఉద్దేశంతో ఎమ్మెల్యే కడియం శ్రీహరి ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రజాప్రతినిథులను రెచ్చగొట్టి తనపైన దుష్ప్రచారం జరిగేలా ప్రయత్నాలు చేసిన సందర్భాలు మీకు తెలుసు అని ఆమె పేర్కొన్నారు. అయినా రాష్ట్ర నాయకత్వం, అధిష్టానం తన నిబద్ధత, నిజాయితీ, పార్టీ పట్ల విధేయతపై సంపూర్ణ విశ్వాసం కలిగి ఉండటం వల్ల వారి కుటిల ప్రయత్నాలు విఫలం అయ్యాయని కొండా సురేఖ ఆరోపించారు. మరోమారు దేవాదాయ శాఖ మంత్రిగా తన అధికార పరిధిని బలహీనపరిచే విధంగా, ప్రభుత్వ పాలనా వ్యవస్థలో అనవసర జోక్యం చేసుకునే చర్యలు ప్రోత్సహించే విధంగా కడియం శ్రీహరి ప్రవర్తించారని ఆమె ఆరోపణలు గుప్పించారు.

ఇలాంటి చర్యలు ప్రభుత్వ పాలనా సమన్వయాన్ని దెబ్బతీయడమే కాకుండా, అధికార యంత్రాంగంలో కూడా అయోమయ పరిస్థితులను సృష్టించే అవకాశం ఉందని కొండా సురేఖ పేర్కొన్నారు. శాఖ పరిపాలనకు సంబంధించిన నిర్ణయాలు సంబంధిత శాఖ మంత్రి ద్వారా మాత్రమే జరగాల్సిన ఉంటుందనే విషయం అనుభవజ్ఞులైన కడియం శ్రీహరికి తెలియనిది కాదన్నారు. అయినప్పటికీ, అందుకు విరుద్ధంగా ఆయన వ్యవహరించడం తనను ఉద్దేశపూర్వకంగా నిర్లక్ష్యం చేశారని స్పష్టం అవుతుందని కొండా సురేఖ అన్నారు. ఈ వ్యవహారంపైన పార్టీ స్థాయిలో, ప్రభుత్వ స్థాయిలో సమగ్రంగా పరిశీలించి, శాఖా మంత్రికి సమాచారం ఇవ్వకుండా అధికారిక సమీక్ష నిర్వహించిన అంశంపై వివరణ కోరాలన్నారు. ప్రభుత్వ పాలనా విధానాలు, శాఖ మంత్రులు రాజ్యాంగబద్ధ అధికారాలను గౌరవించే విధంగా కడియం శ్రీహరికి స్పష్టమైన మార్గదర్శకాలు ఇవ్వాలని, పార్టీ క్రమశిక్షణా కమిటీ ద్వారా విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు లేఖలో కొండా సురేఖ కోరారు.

Next Story