Insurance Sector: ఇన్సూరెన్స్ రంగంలో కొత్త అధ్యాయం

by S Gopi |

దీంతో అవివా లైఫ్ ఇన్సూరెన్స్ ఇండియాపై 100 శాతం యాజమాన్యం సాధించిన తొలి విదేశీ జీవిత బీమా సంస్థగా నిలిచింది.

Insurance Sector: ఇన్సూరెన్స్ రంగంలో కొత్త అధ్యాయం
X

దిశ, బిజినెస్ బ్యూరో: భారత బీమా రంగంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. బ్రిటన్‌కు చెందిన బీమా దిగ్గజం అవివా తన భారత భాగస్వామి డాబర్ ఇన్వెస్ట్ కార్ప్ వద్ద ఉన్న మిగిలిన 26 శాతం వాటాను కొనుగోలు చేయడానికి అంగీకరించింది. దీంతో అవివా లైఫ్ ఇన్సూరెన్స్ ఇండియాపై 100 శాతం యాజమాన్యం సాధించిన తొలి విదేశీ జీవిత బీమా సంస్థగా నిలిచింది. కేంద్ర ప్రభుత్వం ఇటీవల బీమా రంగంలో 100 శాతం విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులకు (ఎఫ్‌డీఐ) అనుమతి ఇచ్చిన తర్వాత జరిగిన తొలి ప్రధాన ఒప్పందం ఇదే. 2001లో డాబర్‌తో జాయింట్ వెంచర్‌గా భారత మార్కెట్లోకి అడుగుపెట్టిన అవివా, 2016లో తన వాటాను 49 శాతానికి, 2022లో 74 శాతానికి పెంచుకుంది. తాజా కొనుగోలుతో రెండు దశాబ్దాలకుపైగా కొనసాగిన జాయింట్ వెంచర్‌కు ముగింపు పలుకుతూ కంపెనీ పూర్తి నియంత్రణను తన చేతుల్లోకి తీసుకుంది. అయితే ఈ లావాదేవీ విలువను అవివా వెల్లడించలేదు.

పూర్తి యాజమాన్యంతో అవివాకు భారత మార్కెట్‌లో వేగంగా నిర్ణయాలు తీసుకునే అవకాశం, అదనపు పెట్టుబడులు పెట్టే స్వేచ్ఛ, వ్యాపార విస్తరణకు మరింత అనుకూల పరిస్థితులు ఏర్పడతాయని పరిశ్రమ వర్గాలు భావిస్తున్నాయి. ప్రస్తుతం అవివా ఇండియా నిర్వహణలో రూ.16,316 కోట్ల ఆస్తులు ఉండగా, FY26లో రూ.1,343 కోట్ల ప్రీమియం ఆదాయం నమోదు చేసింది. కొత్త వ్యాపార ప్రీమియం 10 శాతం పెరిగినా, నికర లాభం 21.7 శాతం తగ్గి రూ.84.15 కోట్లకు చేరింది. సంస్థ సాల్వెన్సీ నిష్పత్తి 188 శాతంగా ఉండటం ఆర్థికంగా మెరుగైన స్థితిని సూచిస్తున్నప్పటికీ, పరిమిత బ్రాంచుల నెట్‌వర్క్ కారణంగా మార్కెట్ వాటా పెంపులో సవాళ్లు ఎదుర్కొంటోంది. అయినప్పటికీ 100 శాతం ఎఫ్‌డీఐ విధానం అమల్లోకి వచ్చిన తర్వాత అవివా తీసుకున్న ఈ నిర్ణయం, భారత్‌లో పూర్తి యాజమాన్యం కోసం ఎదురు చూస్తున్న ఇతర విదేశీ బీమా కంపెనీలకూ మార్గదర్శకంగా మారే అవకాశముందని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు.

Next Story