విద్యార్థులను తీర్చిదిద్దడంలో ఉపాధ్యాయుల పాత్ర కీలకం : కలెక్టర్ కుమార్ దీపక్

by Batti.Sumithra |

విద్యార్థులను తీర్చిదిద్దడంలో ఉపాధ్యాయుల పాత్ర అత్యంత కీలకమైందని మంచిర్యాల జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు.

విద్యార్థులను తీర్చిదిద్దడంలో ఉపాధ్యాయుల పాత్ర కీలకం : కలెక్టర్ కుమార్ దీపక్
X

దిశ, మంచిర్యాల : విద్యార్థులను తీర్చిదిద్దడంలో ఉపాధ్యాయుల పాత్ర అత్యంత కీలకమైందని మంచిర్యాల జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. గురువారం జిల్లాలోని నెన్నెల మండలం ఆవడం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. పాఠశాల పరిసరాలను పరిశీలించారు. అనంతరం తరగతి గదుల్లోకి వెళ్లి ఉపాధ్యాయుడిగా మారి విద్యార్థులకు పాఠాలు బోధించారు. విద్యార్థుల సామర్థ్యాలను పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, విద్యార్థులను తీర్చిదిద్దడంలో ఉపాధ్యాయుల పాత్ర అత్యంత కీలకమైందని అన్నారు. ప్రభుత్వం విద్యార్థులకు అవసరమైన మౌలిక వసతులు కల్పించి విద్యను అందిస్తుందన్నారు. మంచిర్యాల జిల్లా విద్యారంగంలో దేశంలో, రాష్ట్రంలో ఉన్నత స్థానంలో నిలిచిందన్నారు. జిల్లాలో దాదాపు 320 మంది ఉపాధ్యాయులను నియమించడం జరిగిందన్నారు.

అడ్మిషన్లలో జిల్లా మొదటి స్థానంలో ఉందన్నారు. విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని సూచించారు. అనంతరం బెల్లంపల్లిలో సబ్‌కలెక్టర్ మనోజ్‌తో కలిసి వివిధ అంశాలపై చర్చించారు. తహసీల్దార్ కార్యాలయాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. కార్యాలయంలో హాజరు పట్టికలు, రికార్డులు, ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ వివరాల నమోదు అంశాలను పరిశీలించారు. ఈ నెల 24వ తేదీలోగా ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియను అధికారులు సమర్థవంతంగా నిర్వహించేందుకు నిబద్ధతతో విధులు నిర్వర్తించాలని సూచించారు. ఓటర్ల నుంచి సేకరించిన ఎన్యుమరేషన్ ఫారాల్లోని సమాచారాన్ని బీఎల్‌ఓ యాప్‌లో స్పష్టంగా నమోదు చేయాలని ఆదేశించారు. కార్యాలయాలకు వచ్చే రైతుల సమస్యలను పరిష్కరించే దిశగా అధికారులు కృషి చేయాలని సూచించారు. కలెక్టర్ వెంట నెన్నెల, బెల్లంపల్లి తహసీల్దార్లు శ్రీనివాస్, కృష్ణ, పలు శాఖల అధికారులు, ఉపాధ్యాయులు ఉన్నారు.

Next Story