టీఆర్ఎస్ మాస్టర్ ప్లాన్.. ఎంపీల రాజీనామా?

by  |
TRS Perty, Parliament
X

కేంద్రాన్ని ఇరుకున పెట్టేందుకు టీఆర్ఎస్ రాజీనామా అస్త్రాన్ని ఎంచుకున్నది. వడ్ల కొనుగోలు అంశంపై ఉభయ సభల్లో వివిధ రూపాల్లో నిరసన తెలుపుతున్న గులాబీ పార్టీ.. సరికొత్త వ్యూహంతో ప్రజల సానుభూతిని పొందాలని చూస్తున్నది. ప్రస్తుతం రాజ్యసభలో టీఆర్ఎస్‌కు ఏడుగురు సభ్యులున్నారు. అందులో ఐదుగురు మాత్రమే యాక్టివ్‌గా ఉన్నారు. రాజీనామా తర్వాత వచ్చే ఉప ఎన్నికలో గెలవడం టీఆర్ఎస్‌కు నల్లేరుమీద నడకే. రాజ్యసభ సభ్యులను ఎన్నుకోవాల్సిన ఎమ్మెల్యేలంతా ఆ పార్టీ వారేకావడం కలిసొచ్చే అంశం.

దిశ, తెలంగాణ బ్యూరో: వడ్ల కొనుగోలు అంశంపై టీఆర్ఎస్ సరికొత్త వ్యూహాన్ని అవలంబించబోతున్నది. కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి పెంచే తీరులో రాజ్యసభకు ఎంపీలు మూకుమ్మడిగా రాజీనామా చేయాలనుకుంటున్నారు. టీఆర్ఎస్‌కు మొత్తం ఏడుగురు ఎంపీలుండగా ఈ నెల 3న బండ ప్రకాశ్ ముదిరాజ్ రాజీనామా చేశారు. టీఆర్ఎస్‌కు చెందినప్పటికీ ఎంపీ ధర్మపురి శ్రీనివాస్ పార్టీతో అంటీ ముట్టనట్లుగానే ఉన్నారు. దీంతో మిగిలిన ఐదుగురు రాజీనామా చేసే అవకాశం ఉన్నది. ఇదే విషయాన్ని పార్లమెంటరీ పార్టీ నేత కేశవరావును ప్రశ్నించగా, ఆ విషయం ఆలోచిస్తున్నామని తెలిపారు. పార్లమెంటు శీతాకాల సమావేశాలు ఈ నెల 23వ తేదీ వరకు జరగాల్సి ఉన్నప్పటికీ వడ్ల కొనుగోళ్ల అంశంలో కేంద్ర ప్రభుత్వ తీరుకు నిరసనగా ఉభయ సభల్లో ఉన్న 15 మంది ఎంపీలు మొత్తం సెషన్‌ను బహిష్కరిస్తున్నట్లు మీడియాకు వివరించారు. దీనికి కొనసాగింపుగా తొలుత రాజ్యసభ ఎంపీలంతా రాజీనామా చేయాలనే ఆలోచన జరుగుతున్నది. పార్టీ అధినేత కేసీఆర్‌తో చర్చించిన తర్వాత తదుపరి వ్యూహాన్ని ఖరారు చేయనున్నామని తెలిపారు. ఢిల్లీని వదిలిపెట్టి గల్లీలో ప్రజాక్షేత్రంలో పోరాటం చేస్తామని పేర్కొన్నారు. రాష్ట్ర సాధన కోసం గల్లీలో ఉంటూ ప్రజాక్షేత్రంలో ఉద్యమంలో పాల్గొని ఢిల్లీ మెడలు వంచినట్లుగానే ఇకపైన రైతాంగానికి సంబంధించిన అంశంలోనూ ఇదే వ్యూహాన్ని అమలుచేయబోతున్నట్లు కేకే వివరణ ఇచ్చారు.

ఉప ఎన్నికలొస్తే మళ్లీ గెలుపు ఖాయం!

టీఆర్ఎస్ పార్టీకి రాజ్యసభలో ప్రస్తుతం ఆరుగురు ఎంపీలు ఉన్నప్పటికీ డీఎస్ మాత్రం విడిగానే ఉన్నారు. ఆయన పదవీకాలం వచ్చే ఏడాది జూన్‌తో ముగుస్తున్నది. ఈయనతో పాటు కెప్టెన్ లక్ష్మీకాంతరావు గడువు కూడా జూన్‌తోనే అయిపోతుంది. ఇప్పటికే బండ ప్రకాశ్ ముదిరాజ్ రాజీనామా చేశారు. ఆ స్థానానికి జరగాల్సిన ఉప ఎన్నిక కూడా ఈ రెండింటితో పాటే జరిగే అవకాశం ఉన్నది. మొత్తానికి ఐదుగురు ఎంపీలు రాజీనామా చేస్తే, వాటికి రాజ్యసభ చైర్మన్ నుంచి ఆమోదం లభిస్తే, ఆ తర్వాత జరిగే ఉప ఎన్నికల్లో ఎలాగూ మళ్లీ టీఆర్ఎస్ అభ్యర్థులే గెలిచే అవకాశం ఉన్నది. శాసనసభలో టీఆర్ఎస్ పార్టీకి ఉన్న సంఖ్యాబలం కారణంగా మళ్లీ ఆ పార్టీకి చెందిన అభ్యర్థులే గెలుపొందుతారు. ఇప్పుడు రాజీనామా చేసినా పార్టీకి జరిగే నష్టమేమీ లేకపోవడంతో ప్రస్తుతానికి రాజ్యసభ సభ్యులతోనే రాజీనామా చేయించే ఆలోచన ఉన్నట్లు తెలిసింది.

కేంద్రం మీద ఒత్తిడి పెంచడానికే!

రాష్ట్రంలోని రైతాంగానికి సంబంధించిన అంశంతో రాజ్యసభ సభ్యులంతా రాజీనామా చేయడాన్ని కేంద్రంపై ఒత్తిడి పెంచడానికేనన్నది ఆ టీఆర్ఎస్ భావన. సొంత అవసరాల కోసం కాకుండా రాష్ట్రానికి సంబంధించిన అంశంతో ఈ రాజీనామా చేయాల్సి వచ్చిందని చెప్పుకొని రాజకీయ లబ్ధి పొందాలన్నది ఈ పార్టీ లక్ష్యంగా కనిపిస్తున్నది. ఉప ఎన్నికల్లో పోటీచేసి గెలవడాన్ని పార్టీ ఒక సెంటిమెంట్‌గానే భావిస్తున్నది. రాష్ట్రంలో బీజేపీ ఇటీవల కొన్ని అసెంబ్లీ ఉప ఎన్నికల్లో గెలుపొందిన తర్వాత సంస్థాగతంగా బలోపేతం కావడానికి పరిస్థితులు అనుకూలిస్తున్నాయన్న ఉద్దేశంతో ఇప్పుడు టీఆర్ఎస్ రాజ్యసభ ఎంపీలతో రాజీనామా చేయించి ఉప ఎన్నికల్లో మళ్ళీ గెలిచి ప్రజల్లోకి ఒక సంకేతాన్ని పంపించాలనుకుంటున్నట్లు తెలిసింది. అయితే, ముఖ్యమంత్రి కేసీఆర్‌తో భేటీ తర్వాత ఈ ఊహాగానాలపై స్పష్టత రానున్నది.

రాష్ట్ర అవసరాల కోసమేననే ఇండికేషన్!

తెలంగాణ ఏర్పడినప్పుడు జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో సెంటిమెంట్ అస్త్రాన్ని వాడుకున్న టీఆర్ఎస్ బొటాబొటి సీట్లతో అధికారంలోకి వచ్చింది. తర్వాత దాదాపు ఆరు నెలల ముందే అసెంబ్లీని రద్దుచేసి మధ్యంతర ఎన్నికలకు వెళ్ళింది. నాల్గింట మూడొంతుల మెజారిటీ సీట్లతో అధికారంలోకి వచ్చింది. కానీ, రెండో టర్ములో మూడేళ్ళ కాలం దాదాపుగా పూర్తికావస్తున్నందున ప్రజల్లో వ్యతిరేకత క్రమంగా బలపడుతున్నట్లు పార్టీ గ్రహించింది. సంక్షేమ పథకాలు విస్తృతంగా అమలవుతున్నా ప్రజల్లో విశ్వాసం సన్నగిల్లుతున్నదనే ఆందోళనకు గురవుతున్నది.

దళితబంధు లాంటి భారీ పథకాన్ని తీసుకొచ్చినా హుజూరాబాద్‌లో గెలుపు చేజారిపోవడంతో రానున్న అసెంబ్లీ ఎన్నికల కోసం ఇప్పటి నుంచే కసరత్తు మొదలుపెట్టింది. అందులో భాగంగానే బలమైన సెంటిమెంట్‌తో ఈసారి ప్రజల్లోకి వెళ్లాలని భావిస్తున్నది. దీనికోసం వడ్ల కొనుగోలు అంశాన్ని విస్తృతంగా వాడుకోవాలనుకుంటున్నది. రాష్ట్ర రైతాంగం జీవితాల కోసం పార్టీ కొట్లాడుతున్నదనే సెంటిమెంట్‌ను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్ళడానికి ఆలోచిస్తున్నది. రాజ్యసభ సభ్యులతో రాజీనామా చేయించాలనే ఆలోచనకు త్వరలోనే సీఎం నుంచి క్లారిటీ రానున్నది. వడ్ల సమస్య యాసంగి సీజన్‌కు సంబంధించినదే అయినా ఎంఎస్‌పీ చట్టం, ప్రతీ ఏటా కొనాల్సిన బాధ్యత ఎఫ్‌సీఐదేననే ఒత్తిడి తేవడం కోసం భవిష్యత్ పోరాట వ్యూహాన్ని రూపొందించనున్నది. ఇతర రాష్ట్రాల నుంచి కూడా ఇదే తరహా డిమాండ్లు కేంద్రానికి వెళ్లడానికి వివిధ పార్టీలతోనూ సంప్రదింపులు జరపాలన్న ఆలోచన చేస్తున్నట్లు తెలిసింది.

క్రాప్ లోన్లు ఇస్తలే.. ప్రైవేట్​ అప్పులే దిక్కు


Next Story

Most Viewed