క్రాప్ లోన్లు ఇస్తలే.. ప్రైవేట్​ అప్పులే దిక్కు

by  |
క్రాప్ లోన్లు ఇస్తలే.. ప్రైవేట్​ అప్పులే దిక్కు
X

దిశ, తెలంగాణ బ్యూరో: రైతులకు బ్యాంకు రుణాలు అందడం లేదు. ప్రతి ఏటా సగం మందికి రెన్యూవల్​ చేసి, మరో సగం మందికి పాత రుణాలపై కొత్త రుణం ఇస్తున్నట్లు తిరుగు బాండ్​ చేసుకుని రుణ లక్ష్యాన్ని దాట వేస్తున్నాయి. దీంతో క్రాప్​ లోన్లు లక్ష్యాన్ని చేరడం లేదు. ఎస్‌‌ఎల్‌‌బీసీ సమావేశాలు నిర్వహించి రైతులకు రుణాలు ఇవ్వాలని బ్యాంకర్లకు లక్ష్యాన్ని నిర్దేశించినా ఫలితాలు అనుకున్నంత స్థాయిలో రావడం లేదు. దీంతో పెట్టుబడికి డబ్బులు లేక రైతులు వడ్డీ వ్యాపారుల దగ్గరకు పరుగులు తీస్తున్నారు.

ఏటేటా అంతే

ప్రతిఏటా రైతులకు వ్యవసాయ రుణాల కోసం వేల కోట్లు టార్గెట్​ పెట్టుకుంటున్నారు. లక్షల మంది రైతులకు ప్రధానంగా క్రాప్​ లోన్లు ఇవ్వాలనుకుంటున్నా.. నిజమైన రైతులకు మాత్రం అందనంత దూరంగానే ఉంటున్నాయి. గత ఆర్థిక సంవత్సరంలో వ్యవసాయ రుణాల లక్ష్యం రూ. 75 వేల కోట్లు ఉంటే.. అందులో రూ. 58 వేల కోట్లు ఇచ్చారు. మొత్తం 61 లక్షల మంది రైతులు ఉంటే.. 42 లక్షల మందికే క్రాప్​లోన్లు అందాయి. ఇక ఈ ఆర్థిక సంవత్సరంలో రూ. 91 వేల కోట్ల రుణలక్ష్యం కాగా.. ఇప్పటి వరకు రూ. 31 వేల కోట్లు ఇచ్చారు. 63 లక్షల మంది రైతులను టార్గెట్​ పెట్టుకుంటే 21 లక్షల మందికే బ్యాంకు అప్పు ఇచ్చారు.

పాత వాటికే తిరుగు ఫైల్​

అంతేకాకుండా క్రాప్​ లోన్లలో పాత రుణాలను ఎక్కువగా రెన్యూవల్​ చేస్తున్నారు. అంతేకాకుండా కొంతమంది రైతుల నుంచి వడ్డీ వసూలు చేసుకుని, పాత రుణానికి నాలుగైదు వేలు ఎక్కువగా ఇచ్చినట్లు చేసి తిరుగు ఫైల్​ పెట్టుకుంటున్నారు. ఈ విధంగా రుణ లక్ష్యంలో టార్గెట్​ను ఎంతో కొంత మేరకు నింపుతున్నారు. అంతేకానీ కొత్త రుణాలు మాత్రం ఇవ్వడం లేదు.

యంత్రాలకు ప్రాధాన్యత

మొత్తం వ్యవసాయ రుణాల్లో క్రాప్​లోన్లకే ఎక్కువ ప్రాధాన్యత ఉన్నప్పటికీ.. వాటిని ఇవ్వడం లేదు. వ్యవసాయ యంత్రాలకు మాత్రమే ఎక్కువ అప్పులిస్తున్నారు. పంట పెట్టుబడులకు మాత్రం వెనకడుగు వేస్తున్నారు. ఉదాహరణగా 2018–19 ఆర్థిక సంవత్సరంలో క్రాప్​ లోన్ల కింద రూ. 43 వేల కోట్లు ఉంటే ఇచ్చింది మాత్రం రూ. 33 వేల కోట్లే. కానీ వ్యవసాయ యంత్రాల కోసం రూ. 11,422 కోట్లు కేటాయిస్తే.. ఏకంగా రూ. 12,672 కోట్ల అప్పులిచ్చారు. 2019–20లో క్రాప్​ లోన్లకు రూ. 47 వేల కోట్లు టార్గెట్​ పెట్టుకుంటే రూ. 37 వేల కోట్లు ఇచ్చారు. అదే వ్యవసాయ యంత్రాల కోసం రూ. 11,445 కోట్ల టార్గెట్​ ఉంటే రూ. 10,500 కోట్లు ఇచ్చారు. 2020–21 ఫైనాన్సియల్​ ఇయర్​లో క్రాప్​లోన్ల టార్గెట్​ రూ. 53 వేల కోట్లు అయితే రూ. 41వేల కోట్లు ఇచ్చినట్లు నివేదికల్లో వెల్లడించారు. ఇక వ్యవసాయ యంత్రాల కోసం రూ. 12,601 కోట్ల లక్ష్యం పెట్టుకుంటే రూ. 12,644 కోట్లు ఇచ్చారు. ఇక ఈ ఆర్థిక సంవత్సరంలో రూ. 59వేల క్రాప్​లోన్లకు ఇచ్చింది మాత్రం రూ. 24 వేల కోట్లు. వ్యవసాయ యంత్రాలకు రూ. 16 వేల కోట్ల టార్గెట్​ ఉండగా.. ఇప్పటి వరకు రూ. 5 వేల కోట్లు విడుదల చేశారు. ఎందుకంటే వ్యవసాయ యంత్రాల రుణాలు ఇస్తే ఒకవేళ చెల్లించకున్నా వాటిని రికవరీ చేసుకోవచ్చనే కారణంతో బ్యాంకర్లు ఈ రుణాలను ఎక్కువగా ఇస్తున్నట్లు తెలుస్తోంది.

సగం మంది ప్రైవేట్​ అప్పులకే

క్రాప్​ లోన్లు ఇచ్చేందుకు బ్యాంకర్లు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుండటం వల్ల రైతులకు పంట పెట్టుబడికి కష్టాలు తప్పడం లేదు. మరోవైపు రుణమాఫీ ప్రక్రియ సజావుగా సాగకపోవడం, వడ్డీ చెల్లింపుల కోసం రైతుల చుట్టూ తిరుగాల్సి రావడంతో బ్యాంకర్లు అప్పులిచ్చేందుకు వెనకాడుతున్నారు. పెట్టుబడుల కోసం అప్పు తీసుకునేందుకు బ్యాంకులకు రైతులు వెళ్తున్నా తిప్పి పంపుతున్నారు. రిజర్వ్ బ్యాంకు రూల్స్‌‌ ప్రకారం రూ. లక్షా 60 వేల దాకా ఎలాంటివి కుదువ పెట్టుకోకుండా రుణాలు ఇవ్వాలి. కానీ బ్యాంకులు పాసుపుస్తకాలను తనాఖా పెట్టి రుణాలు ఇస్తున్నాయి. అది కూడా అందరికీ ఇవ్వడం లేదు. దీంతో చేసేది లేక ప్రైవేటు వ్యాపారుల వద్ద అప్పులు తీసుకుంటున్నామని రైతులు వాపోతున్నారు. రాష్ట్రంలో వడ్డీ వ్యాపారుల దగ్గర అప్పులు తీసుకుంటున్న రైతులు 41.3 శాతం ఉన్నట్లు ఇటీవల కేంద్రం ప్రకటించిన విషయం తెలిసిందే. కానీ అంతకంటే ఎక్కువగానే ఉన్నట్లు రాష్ట్రంలో పరిస్థితిలు చూస్తే తెలుస్తోంది.

కొత్త అప్పు ఇస్తలే

రాష్ట్ర ప్రభుత్వం రూ.లక్ష దాకా అప్పు మాఫీ చేస్తామని చెప్పడంతో రైతులు తీసుకున్న పాత రుణాలు తిరిగి కట్టలేదు. దీంతో ఇప్పుడు కొత్తగా రుణం ఇవ్వడం లేదని రైతులు ఆరోపిస్తున్నారు. అప్పు కోసం బ్యాంకులకు పోవాలంటేనే భయపడుతున్నరు. గతంలో ఓసారి బ్యాంకు నుంచి అప్పు తీసుకున్నామని, సర్కారు రుణమాఫీ చేస్తామంటే తాము చెల్లించడం లేదని, ఏటా పాత బాకీనే రెన్యూవల్‌ చేసుకుంటూ వస్తున్నామని రైతులు చెప్పుతున్నారు. ఇప్పుడు బ్యాంకుకు పోతే అప్పు ఇవ్వడం లేదని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

టీఆర్ఎస్ మాస్టర్ ప్లాన్.. ఏడుగురు ఎంపీల రాజీనామా?


Next Story

Most Viewed