కేంద్ర కేబినెట్ లో భారీ మార్పులు..తెలంగాణ నుంచి వీళ్ల‌కే ఛాన్స్ !

by velandi.Saikiran |

ఢిల్లీ వేదికగా త్వరలో జరగనున్న కేంద్ర కేబినెట్ విస్తరణలో తెలంగాణ ఎంపీకి చోటు దక్కే ఛాన్స్ ఉంది.

కేంద్ర కేబినెట్ లో భారీ మార్పులు..తెలంగాణ నుంచి వీళ్ల‌కే ఛాన్స్ !
X

కేంద్ర కేబినెట్‌లోకి గడ్డం నగేష్!

దక్షిణ భారతదేశం నుంచి ఏకైక ఆదివాసీ ఎంపీ..

సమీకరణాల నేపథ్యంలో అధిష్టానం మొగ్గు!

రేసులో ఈటెల, అరవింద్, డీకే అరుణ

సామాజిక సమీకరణాలతో మారిన లెక్కలు

దక్షిణ భారతం నుంచి మైలేజ్ సాధించేందుకు బీజేపీ వ్యూహం

ఇప్పటికే ఢిల్లీ అధిష్టానం నుంచి ఎంపీకి సంకేతాలు!

ఢిల్లీ వేదికగా త్వరలో జరగనున్న కేంద్ర కేబినెట్ విస్తరణలో తెలంగాణ ఎంపీకి చోటు దక్కే ఛాన్స్ ఉంది. రాష్ట్రం నుంచి ఈటెల, అరవింద్, డీకే అరుణ పేర్లు ప్రచారంలో ఉన్నా, సామాజిక సమీకరణాలతో లెక్కలు మారాయి. ఆదిలాబాద్ ఆదివాసీ ఎంపీ గోడం నగేష్ వైపు బీజేపీ జాతీయ నాయకత్వం మొగ్గు చూపుతున్నట్లు సమాచారం. దక్షిణ భారతం నుంచి కేంద్ర మంత్రివర్గంలో ఆదివాసీలకు ప్రాతినిధ్యం లేకపోవడం నగేష్‌కు కలిసిరానుంది. తెలంగాణతోపాటు పొరుగు రాష్ట్రాల గిరిజనుల్లో పట్టు సాధించడంతోపాటు ఆదివాసీల ఓట్లను ఆకర్షించేందుకు ఇది వ్యూహాత్మక అడుగుగా బావిస్తున్నట్లు తెలుస్తోంది. ఢిల్లీ నుంచి సంకేతాలు రావడంతో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా బీజేపీ శ్రేణుల్లో ఆనందం వ్యక్తమవుతోంది.

దిశ ప్రతినిధి, నిర్మల్ : కేంద్ర కేబినెట్ విస్తరణ త్వరలోనే జరుగుతుందన్న సంకేతాల నేపథ్యంలో ఢిల్లీ రాజకీయాల్లో ఒక ఆసక్తికరమైన చర్చ తెరపైకి వచ్చింది. తెలంగాణ నుంచి కేంద్ర మంత్రివర్గంలో మరొకరికి అవకాశం ఇస్తున్నారన్న సమాచారం లీక్ అవ్వడంతో, రాష్ట్రానికి చెందిన పలువురు సీనియర్ నాయకులు తమ ప్రయత్నాలను ముమ్మరం చేశారు. ఇప్పటికే పార్టీలో కీలక నేతలుగా ఉన్న ఎంపీలు ధర్మపురి అరవింద్, ఈటెల రాజేందర్, జాతీయ నాయకురాలు డీకే అరుణ తదితరుల పేర్లు విస్తృతంగా ప్రచారంలో ఉన్నాయి. అయితే, తాజాగా ఆదిలాబాద్ పార్లమెంటు సభ్యుడు గోడం నగేష్ పేరు అనూహ్యంగా, బలంగా రేసులోకి రావడం రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది.

సీనియర్ల పోటీకి ‘చెక్’.. వివాదరహితుడికే జై..

తెలంగాణ బీజేపీలో ఉన్న ముఖ్య నేతల నడుమ మంత్రి పదవి కోసం తీవ్రమైన పోటీ నెలకొన్నది. ఎవరికి పదవి ఇచ్చినా ఇతరుల్లో అసంతృప్తి తలెత్తే అవకాశం ఉందన్న ఆందోళన జాతీయ నాయకత్వంలో ఉంది. ఇలాంటి తరుణంలో గ్రూపు రాజకీయాలకు దూరంగా ఉండే వివాదరహితుడైన గోడం నగేష్‌ను ఎంపిక చేయడం ద్వారా అధిష్టానానికి తలనొప్పి తగ్గుతుందని పార్టీ పెద్దలు భావిస్తున్నారు. దీంతోపాటు సామాజిక కోణంలో చూసినా, వెనుకబడిన గిరిజన (ఆదివాసీ) సామాజిక వర్గానికి కేంద్రంలో గొప్ప ప్రాధాన్యత ఇచ్చినట్లు అవుతుందన్న ఆలోచనతో అధిష్టానం నగేష్ వైపు మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది.

దక్షిణ భారతంలో ఒకే ఒక్కడు...

ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఆదివాసీ సామాజిక వర్గం నుంచి కేంద్ర కేబినెట్‌లో కేవలం ఒకే ఒక్కరు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. అందులోనూ దక్షిణ భారతదేశం నుంచి గిరిజన సామాజిక వర్గానికి చెందిన ఒక్క నేతకు కూడా కేంద్ర మంత్రివర్గంలో చోటు దక్కలేదు. ఈ లోటును భర్తీ చేసేందుకు, దక్షిణ భారతం నుంచి ప్రస్తుతం లోక్‌సభలో ఉన్న ఏకైక ఆదివాసీ ఎంపీ అయిన గోడం నగేష్ సరైన ప్రత్యామ్నాయమని బీజేపీ జాతీయ నాయకత్వం గట్టిగా విశ్వసిస్తోంది. ఈ మేరకు ఆయనకు ఢిల్లీలోని అగ్ర నాయకత్వం నుంచి ప్రాథమికంగా సానుకూల సంకేతాలు కూడా అందినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం.

ఆ వర్గాల ఓట్లే టార్గెట్..

కేవలం తెలంగాణ మాత్రమే కాకుండా, దక్షిణ భారతదేశంతోపాటు పొరుగునే ఉన్న మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, జార్ఖండ్, ఒడిశా వంటి రాష్ట్రాల్లో కూడా ఆదివాసి సమూహాలు చాలా పెద్ద మొత్తంలో విస్తరించి ఉన్నాయి. రాబోయే రోజుల్లో ఆయా రాష్ట్రాల్లో జరగబోయే ఎన్నికలు, పార్టీ భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని బీజేపీ ఈ వ్యూహాత్మక అడుగు వేస్తున్నట్లు స్పష్టమవుతోంది. దక్షిణ భారతదేశం నుంచి ఒక ఆదివాసి నేతకు కేంద్రంలో పెద్దపీట వేయడం ద్వారా, ఆయా రాష్ట్రాల్లోని గిరిజన ఓటు బ్యాంకును పెద్దఎత్తున ఆకర్షించవచ్చని, ఇది పార్టీకి రాజకీయంగా భారీ మైలేజ్ తెచ్చిపెడుతుందని బీజేపీ అగ్రనాయకత్వం లెక్కిస్తోంది. అంతా అనుకున్నట్లు జరిగితే, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నుంచి కేంద్ర మంత్రివర్గంలో స్థానం దక్కించుకున్న అరుదైన రికార్డు నగేష్ ఖాతాలో చేరనుంది.

Next Story