- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఖేలో ఇండియా ఏర్పాట్లపై క్షేత్రస్థాయి సమీక్ష.. హైదరాబాద్‌లో క్రీడా వేదికల పరిశీలన
తెలంగాణలో నిర్వహించనున్న 8వ ఎడిషన్ ఖేలో ఇండియా గేమ్స్-2026 సన్నాహకాలు వేగవంతమవుతున్నాయి.

దిశ, తెలంగాణ బ్యూరో: తెలంగాణలో నిర్వహించనున్న 8వ ఎడిషన్ ఖేలో ఇండియా గేమ్స్-2026 సన్నాహకాలు వేగవంతమవుతున్నాయి. ఇందులో భాగంగా భారత క్రీడా ప్రాధికార సంస్థ (ఎస్‌ఏఐ) ఉన్నతాధికారుల బృందం మంగళవారం హైదరాబాద్‌లో పర్యటించి గేమ్స్ నిర్వహణకు ప్రతిపాదించిన క్రీడా వేదికలను క్షేత్రస్థాయిలో పరిశీలించింది. ఎస్‌ఏఐ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అమర్ జ్యోతి నేతృత్వంలోని బృందంలో అసిస్టెంట్ డైరెక్టర్లు మధు హర్ష, గోపాల్ కందపాల్, మోహిత్ తదితరులు పాల్గొన్నారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు గచ్చిబౌలిలోని జీఎంసీబీ స్పోర్ట్స్ కాంప్లెక్స్, షూటింగ్ రేంజ్, కేవీబీఆర్ ఇండోర్ స్టేడియం, హుస్సేన్ సాగర్ వాటర్ స్పోర్ట్స్ ట్రైనింగ్ సెంటర్, సైక్లింగ్ వేలోడ్రోమ్, ఎల్‌బీ స్టేడియంలను సందర్శించి అక్కడి మౌలిక సదుపాయాలు, క్రీడాకారులకు అందుబాటులో ఉన్న వసతులను పరిశీలించారు. ఈ సందర్భంగా తెలంగాణ క్రీడా ప్రాధికార సంస్థ అధికారులతో సమావేశమైన బృందం, క్రీడాకారులు, సాంకేతిక అధికారులు, సందర్శకులకు అవసరమైన వసతులు, నిర్వహణ ఏర్పాట్లపై సమీక్ష నిర్వహించింది. హైదరాబాద్‌లోని క్రీడా మౌలిక సదుపాయాలపై అధికారులు సంతృప్తి వ్యక్తం చేసినప్పటికీ, కొన్ని వేదికల్లో అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా మరిన్ని మెరుగుదలలు చేపట్టాల్సిన అవసరం ఉందని సూచించారు.
ఖేలో ఇండియా గేమ్స్ ప్రారంభానికి ముందే అవసరమైన మరమ్మతులు పూర్తి చేసి, మౌలిక సదుపాయాలను మరింత బలోపేతం చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. అధికారుల బృందం బుధవారం హకింపేట్ స్పోర్ట్స్ స్కూల్‌తో పాటు మేడ్చల్, కరీంనగర్, వరంగల్, హన్మకొండ జిల్లాల్లోని క్రీడా మైదానాలను సందర్శించి అక్కడి ఏర్పాట్లను పరిశీలించనుంది. ఈ సమీక్షలో తెలంగాణ క్రీడా ప్రాధికార సంస్థ డిప్యూటీ డైరెక్టర్లు రవీందర్, రవితేజ, అశోక్ కుమార్, ఇంజినీరింగ్ విభాగం అధికారులు శ్రీనివాస్, సందీప్, స్టేడియం అడ్మినిస్ట్రేటర్లు కన్నం మధు, రాజ్‌వీర్, గోకుల్ రవికుమార్, ద్రోణాచార్య అవార్డు గ్రహీత ఇస్మాయిల్ బేగ్ తదితరులు పాల్గొన్నారు.






