అనుమతి లేకుండా.. వృద్ధాశ్రమం..!

by velandi.Saikiran |   (  Updated:2026-06-03 22:30:29  IST  )

వృద్ధ జీవితం నేటి తరం వాసులకు శత్రువుగా మారింది.

అనుమతి లేకుండా.. వృద్ధాశ్రమం..!
X

అనుమతి లేకుండా.. వృద్ధాశ్రమం..!

నోటీసులు ఇచ్చి ఆరు నెలలైనా చర్యల్లేవ్..

మాతృ శ్రీ వృద్ధాశ్రమం అక్రమ దందా

గతంలో వృద్ధులపై అకారణంగా దాడులు

దిశ, మేడ్చల్ బ్యూరో : వృద్ధ జీవితం నేటి తరం వాసులకు శత్రువుగా మారింది. కనికరం లేని బిడ్డలు.. కడుపున మోసిన తల్లిదండ్రులను ఆశ్రమాల్లో వదిలేస్తున్నారు. బంధాలు, బంధుత్వాలు, ప్రేమానురాగాలు ఆవిరై చివరకు కడుపున పుట్టిన వారు అమ్మానాన్నలకు పట్టెడు అన్నం పెట్టని దుస్థితికి చేరుకున్నారు. మలి సంజెలోకి చేరిన ఆ వృద్ధులు అందరున్నా ఏకాకులుగా మిగులుతున్నారు. అయితే సామాజిక సేవనే పరమావధిగా కొందరు వృద్ధాశ్రమాలను నడుపుతుండగా, మరికొందరు అక్రమ వ్యాపారమే ధ్యేయంగా ఎలాంటి అనుమతులు లేకుండా ఆశ్రమాలను నడుపుతూ.. వృద్ధుల జీవితాలతో చెలగాటమడుతున్నారు. ఇదే తరహాలో మేడ్చల్ జిల్లా శామీర్ పేటలోని స్ఫూర్తి కాలనీలో ‘మాతృ శ్రీ ఫౌండేషన్’ గత కొన్ని ఏళ్లుగా ఎలాంటి అనుమతులు తీసుకోకుండా వృద్ధాశ్రమాన్ని నడుపుతుండటం విమర్శలకు తావిస్తోంది.

ఉత్తిత్తి నోటీసులేనా....?

శామీర్ పేటలోని ‘మాతృ శ్రీ ’ వృద్ధాశ్రమానికి ఏళ్ల తరబడి ఎలాం టి ప్రభుత్వ అనుమతులు లేకుండా చట్ట విరుద్ధంగా నడుస్తోంది. వృద్ధు లకు కనీస వసతులు కల్పించకుండా ఆశ్రమ నిర్వహకుడు నర్సింహా ఇబ్బందులుకు గురి చేస్తున్నట్లు ఫిర్యాదులు రావడంతో మేడ్చల్ జిల్లా మహిళ శిశు, వృద్ధుల సంక్షేమ శాఖ 2025, నవంబర్ 28న మాతృ శ్రీ ఫౌండేషన్ యాజమాన్యానికి నోటీసులు జారీచేసింది. నోటీసు అందిన మూడు రోజుల్లో వివరణ ఇవ్వాలని, సరైన ఆధారాలతో వివరణ ఇవ్వని యెడల అశ్రమానికి క్లోజింగ్ ఆర్డర్ ఇస్తామని ఆయా నోటీసుల్లో హెచ్చరించారు. నోటీసులు ఇచ్చి 6 నెలలు దాటిన మాతృ శ్రీ వృద్ధాశ్రమంపై ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం పట్ల పెద్ద ఎత్తున ఆరోపణలు వినిపిస్తున్నాయి. జిల్లా మహిళా, శిశు సంక్షేమ శాఖ యంత్రాంగం చట్ట విరుద్ధంగా నిబంధనలను ఉల్లం ఘించి కొనసాగుతున్న మాతృ శ్రీ ఫౌండేషన్ కు పరోక్షంగా సహకరిస్తుందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

వసతుల లేమితో.. అవస్థలు

మాతృశ్రీ వృద్ధాశ్రమంలో కనీస వసతులు లేక పండుటాకులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. ఒకే గదిలో పరిమితికి మించి ఎక్కువ మందిని ఉంచుతున్నారు. సరైన భోజనం, రక్షణ, వైద్య సదుపాయాలు కల్పించడం లేదన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఆశ్రమంలో నిర్వాహకులు వృద్ధు లను వేధించడం.. ఇబ్బందులకు గురి చేస్తున్నట్లు వాపోతున్నారు. గతంలో నిర్వాహకులు వృద్ధుల పై విచక్షణ రహితంగా దాడులు చేసిన సంఘటనలు అనేకం ఉన్నాయి. వృద్ధులపై దాడుల విష యం జిల్లా అధికారులకు తెలిసినప్పటికీ, మాతృ శ్రీ ఫౌండేషన్ వృద్ధాశ్రమంపై చర్యలు తీసుకోకపోవడంపై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. అక్రమంగా నడు స్తున్న వృద్ధాశ్రమాన్ని రక్షించేందుకు కొందరు పైరవీకారులు రంగంలోకి దిగినట్లు తెలిసింది. ఆశ్రమంపై ఎలాంటి చర్యలు తీసుకోకుండా నయానో.. భయనో ముట్ట చెప్పినట్లు తెలిసింది. దీంతో ఆశ్రమ నిర్వాహకులతో కుమ్మక్కైన అధికార యంత్రాంగం చర్యలు తీసుకోకుండా కాలయాపన చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇప్పటికైనా జిల్లా ఉన్నతాధికారులు ఎలాంటి ప్రభుత్వ అనుమతులు లేకుండా కొనసాగుతున్న మాతృ శ్రీ వృద్ధాశ్రమంపై చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. సహకరిస్తున్న జిల్లా సంక్షేమ అధికారులపై విచారణ జరిపించి, చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

Next Story