మానేరు రిజర్వాయర్‌లో అక్రమ ఇసుక దందా?

by velandi.Saikiran |   (  Updated:2026-06-03 23:01:04  IST  )

మానేరు కేంద్రంగా సాగుతున్న అక్రమ ఇసుక దందా వివాదాస్పదంగా మారుతుంది.

మానేరు రిజర్వాయర్‌లో అక్రమ ఇసుక దందా?
X

మానేరు రిజర్వాయర్‌లో అక్రమ ఇసుక దందా?

పూడిక తొలగింపు పేరుతో ఇసుక తవ్వకాలు

కోట్ల రూపాయల ప్రభుత్వ ఆదాయానికి గండి

ప్రభుత్వ సొమ్ముతో సహజ సంపద దోపిడీ

పక్కదారి పడుతున్న పైలట్ ప్రాజెక్టు

తమకేమీ పట్టనట్లుగా వ్యవహరిస్తున్న అధికారులు

అధికారుల తీరుపై గ్రామస్తుల ఆగ్రహం

దిశ, కరీంనగర్ బ్యూరో: మానేరు కేంద్రంగా సాగుతున్న అక్రమ ఇసుక దందా వివాదాస్పదంగా మారుతుంది. అధికారాన్ని అడ్డుపెట్టుకుని నిబంధనలకు విరుద్ధంగా ఇసుక తవ్వకాలు చేపడుతున్నారు అంటూ పరిసర గ్రామాల ప్రజలు ఆందోళనలు వ్యక్తం చేస్తూ అక్రమ ఇసుక తవ్వకాలను అడ్డుకుంటుంటే అక్రమ దందాలను అరికట్టాల్సిన అధికారులు మాత్రం ఖద్దరు నేతల కనుసన్నల్లో చూసీ చూడనట్లుగా వ్యహరిస్తున్నారు. కాంట్రాక్టర్ ప్రభుత్వం సొమ్ముతో దర్జాగా ఇసుక దోపిడీకి పాల్పడుతున్నారు అనే విమర్శలు వ్యక్తమముతూ విషయం వివాదస్పదంగా మారుతుంది.

నీటి సామర్థ్యాన్ని పెంచేందుకు ప్రభుత్వం శ్రీకారం

రిజర్వాయర్ లో పేరుకుపోయిన పూడికను తీసి ప్రాజెక్టుల్లో నీటి సామార్థాన్ని పెంచేందుకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. అందులో భాగంగా ప్రభుత్వం ఫైలెట్ ప్రాజెక్టుగా మానేర్ డ్యామ్, మిడ్ మానేర్, కడెం ప్రాజెక్టుల అంతర్భాగం నుంచి మట్టిని తీసి ఇసుకను వేరు చేసే ప్రక్రియ చేపట్టింది.అందుకోసం రూ.1457 కోట్ల కేటాయించి ఆ పనులు చేసేందుకు టెండర్లు నిర్వహించింది. టెండర్లలోకాంట్రాక్ట్ ను ఈథర్ సిస్టమ్ ప్రైవేట్ లిమిటెడ్ అండ్ ట్రినిటీ సాండ్ అండ్ మినరల్స్ ప్రైవేట్ లిమిటెడ్ అండ్​సహారా డ్రెడ్జింగ్ లిమిటెడ్ దక్కించుకున్నాయి.

గత ఏడాది 2025 మార్చి 24న కాంట్రాక్ట్ ఒప్పందం కుదుర్చికుని హైడ్రో-సైక్లోన్ పద్ధతి ద్వారా లోయర్ మానేర్ డ్యామ్ లో పూడిక తీయడం తిమ్మాపూర్ మండలం కొత్తపల్లి శివారులోని రేణికుంట బ్రిడ్జి వద్ద ప్రారంభించారు. ప్రాసెసింగ్ ద్వారా గంటకు 20 క్యూబిక్ మీటర్ల ఇసుక వేరు చేసి విక్రయించే పనులు చేపట్టారు.

రాష్ట్ర మంత్రులతోపాటు జిల్లా కలెక్టర్, సీపీప్రాజెక్టును సందర్శించి పనితీరును పరిశీలించి అభినందించారు. ఆ తర్వాత ఏం జరిగిందో ఏమో కాంట్రాక్టర్ రూట్ మార్చాడు. ఇలా పూడికను తీసి వేరుచేయడం ఖర్చుతో కూడుకుని లాభదాయకంగా లేకపోవడంతో నేరుగా ఇసుక నిల్వలపై కన్నేసి ఇసుకను తోడుతు విక్రయిస్తున్నాడు. దీంతో ప్రభుత్వ లక్ష్యం నీరుగారుతుండగా కోట్ల రూపాయల సహజ సంపదను దోచుకుని కాంట్రాక్టర్ ప్రభుత్వ ఖజానాకు గండికొడుతున్నాడు అనే విమర్శలు వ్యక్తం అవుతున్నాయి

నీటిలో పూటికకు బదులు ఇసుక తవ్వుతున్న కాంట్రాక్టర్

ప్రభుత్వం ఫైలెట్ ప్రాజెక్టులో భాగంగా పనులు దక్కించుకున్న కాంట్రాక్టు కంపెనీలు మానేరు రిజర్వాయర్ లో పేరుకుపోయిన పూటికను తీసి అందులో నుంచి మట్టిని ఇసుకను వేరు చేసి విక్రయించుకునేందుకు టెండర్లు అప్పగిస్తే టెండర్లు దక్కించుకుని పనులు చేపట్టిన కాంట్రాక్టు కంపెనీలు ఆ పని పక్కకు నెట్టి నేరుగా అక్రమ దందాకు శ్రీకారం చుట్టడం జిల్లాలో వివాదాస్పదంగా మారింది. మానేరు డ్యాంలో నీటిలో నుంచి మట్టిని తోడి ఇసుకను వేరుచేయకుండా మానేరులో ఇసుక నిక్షేపాలను తవ్వుతూ తరలిస్తున్నారు. కోట్ల రూపాయల సంపదను కొల్లగొడుతున్న ప్రభుత్వ ఖజానాకు గండికొడుతున్నారు. ఈ అక్రమ ఇసుక తవ్వకాలను

పరిసర గ్రామాల ప్రజలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఇసుక తవ్వకాలను అడ్డుకుంటూ కాంట్రాక్టర్ పై తిరగబడుతున్నారు. ముందుగా మోయతుమ్మెద వాగులో ఇసుక తవ్వకాలను అక్కడి రైతులు గ్రామస్తులు అడ్డుకోవడంతో రూట్ మార్చిన కాంట్రాక్టర్ అక్కడి నుంచి రిజర్వాయర్ పై భాగాన ఉన్న పెద్దవాగులో అర్థరాత్రి ఇసుక తవ్వకాలు చేపట్టాడు. అర్థరాత్రి భారీ క్రేన్ లు జేసీబీలతో తవ్వకాలు చేపట్టడంతో ఇల్లంతకుంట మండలం పొత్తూర్ గ్రామస్తులు అక్కడి రైతులు అడ్డుకుని ప్రతిఘటించారు. వాహనాలను అక్కడి నుంచి తరలించేవరకు ఆందోళనకు దిగారు. దీంతో పరిస్థితిని గమనించిన కాంట్రాక్టర్ అక్కడి నుంచి ఆ వాహనాలను ఒడ్డుకు చేర్చారు. కాంట్రాక్టర్ టెండరు నిబంధనలను ఉల్లంఘిస్తూ ఇసుక తవ్వకాలు చేపట్టడం జిల్లాలో వివాదాస్పదంగా మారుతుంది.

అక్రమ దందాలో పాలకులు ?అధికారులు?

ప్రభుత్వం అప్పగించిన పని పక్కకు పెట్టి కాంట్రాక్టర్ అక్రమ ఇసుక దందాకు తెరలేపడం పనులను పర్యవేక్షిస్తూ అక్రమ దందాను అరికట్టాల్సిన అధికారులు చూసీ చూడనట్లుగా వ్యవహరించడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి.కాంట్రాక్టర్ ప్రభుత్వం అప్పగించిన పనులను చేయకుండా మానేరు వాగులో సహజ సిద్ధంగా నిక్షిప్తమైన ఇసుక నిల్వలను దోచుకెళ్తుంటే పాలకులు కూడా అటు వైపు కన్నెత్తి చూడకపోవడంతో అధికార పార్టీ కనుసన్నల్లోనే అక్రమ దందా సాగుతుందా అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఇప్పటికైనా ప్రభుత్వం అక్రమ దందాను అరికట్టాలని తక్షణమే ఇసుక తవ్వాకాలు నిలిపివేసి ప్రాజెక్టులో పేరుకపోయిన పూడికను తొలగిస్తే ప్రభుత్వ లక్ష్యం నెరవేరడంతో పాటు ప్రాజెక్టులో నీటి సామర్థ్యం పెరిగి రైతులకు జిల్లా ప్రజలకు ఉపయోగకరంగా ఉంటుందనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.

Next Story