కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా..! సోషల్ మీడియాలో లేఖ వైరల్

by Kema Shiva Kumar |   (  Updated:2026-07-23 07:03:00  IST  )

కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసినట్లుగా ఓ లేఖ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.

కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా..! సోషల్ మీడియాలో లేఖ వైరల్
X

దిశ, వెబ్‌డెస్క్: దేశవ్యాప్తంగా ‘నీట్’ (NEET) పరీక్షల్లో జరిగిన అవకతవకలు, వరుస పేపర్ లీకేజీల వ్యవహారం కేంద్ర ప్రభుత్వాన్ని తీవ్ర ఇబ్బందుల్లోకి నెడుతోంది. ఢిల్లీలోని జంతర్‌మంతర్ వేదికగా కాక్రోచ్ జనతా పార్టీ (CJP), విద్యార్థుల ఆధ్వర్యంలో జరుగుతున్న నిరసనలకు విపక్షాలు కూడా మద్దతు తెలపడంతో ఆందోళనలు మరింత తీవ్రరూపం దాల్చాయి. వీరంతా కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తక్షణమే రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ వివాదం కారణంగా గడిచిన నాలుగు రోజులుగా పార్లమెంట్‌లోని ఉభయ సభలు వరుసగా వాయిదా పడుతున్నాయి. ‘నీట్’ వ్యవహారంపై సమగ్ర చర్చ జరగాలని విపక్షాలు పట్టుబట్టడంతో సభలో నిత్యం ఉద్రిక్త వాతావరణం నెలకొంటోంది.

వైరల్ అవుతున్న రాజీనామా లేఖ..

ఈ ఉద్రిక్తతల నడుమ సోషల్ మీడియా (Social Media)లో ఓ వార్త విపరీతంగా చక్కర్లు కొడుతోంది. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ (Dharmendra Pradhan) తన పదవికి రాజీనామా చేస్తూ ప్రధానమంత్రికి పంపినట్లుగా ఉన్న ఓ సంచలన లేఖ వెలుగులోకి వచ్చింది. జూలై 21 తేదీతో ఉన్న ఆ లేఖలో.. ‘భారత్‌లోని విద్యార్థులు, యువత ఎదుర్కొంటున్న ఆందోళనలను పరిష్కరించడంలో నేను విఫలమైనందున విద్యాశాఖ మంత్రి పదవికి రాజీనామా చేస్తున్నాను. వరుస పేపర్ లీకేజీ ఘటనలు మన పరీక్షల వ్యవస్థపై ఉన్న నమ్మకాన్ని దెబ్బతీశాయి. విద్యార్థుల ఆత్మహత్యల వార్తలతో యువతలో ఆందోళన పెరుగుతోంది. ఈ వైఫల్యాలు ప్రభుత్వ నాయకత్వంలోని వైఫల్యాన్ని ప్రతిబింబిస్తున్నాయి. కాబట్టి ప్రస్తుత పరిస్థితికి ప్రధాని కూడా బాధ్యత వహించాలి’ అని రాసి ఉంది. లేఖ చివర్లో ధర్మేంద్ర ప్రధాన్ సంతకం కూడా కనిపించడంతో దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున చర్చ నడుస్తోంది.

కాగా, సదరు రాజీనామా లేఖపై కేంద్ర ప్రభుత్వం, ప్రధాని కార్యాలయం (PMO), మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. పార్లమెంట్ ఆందోళనల నేపథ్యంలో సంచలనం సృష్టించేందుకు ఎవరైనా నకిలీ లేఖను సృష్టించారా అనేది ఇంకా తెలియాల్సి ఉంది.

Lok Sabha: లోక్‌సభలో విపక్షాల ఆందోళన.. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాకు డిమాండ్

Next Story