పాప ఆరోగ్యం బాగోలేదని లీవ్ తీసుకున్నందుకు జాబ్ నుంచి తొలగించారు.. మహిళా టెక్కీ ఆవేదన

by Prasad Jukanti |

పాపకు ఆరోగ్యం బాగోలేదని లీవ్ తీసుకున్నందుకు తనను ఉద్యోగం నుంచి తొలగించారని మహిళా టెక్కీ ఆవేదన వ్యక్తం చేశారు.

పాప ఆరోగ్యం బాగోలేదని లీవ్ తీసుకున్నందుకు జాబ్ నుంచి తొలగించారు.. మహిళా టెక్కీ ఆవేదన
X

దిశ, డైనమిక్ బ్యూరో: తనతో పాటు తన 11 ఏళ్ల కుమార్తె అనారోగ్యానికి గురైందనే కారణంతో సెలవు తీసుకున్నందుకు తనన ఉద్యోగం నుంచి తొలగించారని ఓ మహిళ సాఫ్ట్ వేర్ ఉద్యోగిని ఆవేదన వ్యక్తం చేశారు. ముందస్తు సమాచారం ఇచ్చినప్పటికీ ఎలాంటి నోటీసు ఇవ్వకుండా ఉన్నఫలంగా ఉద్యోగం నుంచి తొలగించారని ఆరోపిస్తూ బాధితురాలు మేడ్చల్ జిల్లా కుత్బుల్లాపూర్ పరిధిలోని దుండిగల్ పోలీసులను ఆశ్రయించినట్లు తెలుస్తోంది. ఈ సంఘటనకు సంబంధించిన వివరాలను బాధితురాలు భావన మాట్లాడిన ఓ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‍గా మారింది.

ముందుగా సమాచారం ఇచ్చినా తీసేశారు:

తన పేరు భావన అని చెప్పుకున్న బాధితురాలు తాను టెక్ మహీంద్రాలో చేరిన కొత్తలోనే ట్రైనింగ్ సమయంలో తీవ్ర అనారోగ్యానికి గురై ఆసుపత్రి పాలయ్యానని, దీంతో జూన్ నెలలో 13 రోజులు సిక్ లీవ్ తీసుకోవాల్సి వచ్చిందని తెలిపారు. తాను సిక్ లీవ్‍లో ఉండగానే తన అనారోగ్యం గురించి ఏ మాత్రం పట్టింపు లేకుండా జాబ్‍కు ఎప్పుడు వస్తారని లేదంటే జాబ్ తీసేస్తామని బెదిరింపు మెయిల్స్ పెట్టేవారని ఆవేదన చెందారు. ఈ క్రమంలో ఇటీవల తన కుమార్తెకు తీవ్ర కడుపునొప్పి వచ్చిందని ఇంటి నుంచి పదే పదే ఫోన్లు రావడంతో వెళ్లాల్సి వచ్చిందని ఆ సమయంలో ముందస్తు సమాచారంతో పాటు హెల్త్ రిపోర్టులను కంపెనీకి పంపించి 3 రోజులు సెలవు తీసుకున్నట్లు చెప్పారు. తన పాప అనారోగ్యంతో లీవ్ తీసుకుంటే తనను అన్యాయంగా ఉద్యోగం నుంచి తొలగించారని ఆవేదన వ్యక్తం చేశారు.

వాష్‌రూమ్‌కు వెళ్లాలన్నా అనుమతి తీసుకోవాల:

ఉద్యోగం నుంచి తొలగించాలంటే 60 రోజుల నోటీసులు ఇవ్వాలని కానీ తన విషయంలో అవేవి పాటించకుండా ఇమ్మిడియేట్లీ ట్రమినేషన్ ఇచ్చారన్నారు. అంతే కాదు పనివేళల్లో ఆఫీస్‍లో వాష్‌రూమ్‌కు వెళ్లాలన్నా అనుమతి తీసుకోవాలంటూ తీవ్ర ఒత్తిడి తెచ్చేవారని ఆరోపించారు. మహిళలుగా అన్ని విషయాలు బయటకు చెప్పుకోలేం కదా అని ఆవేదన వ్యక్తం చేశారు. మహిళలను గౌరవించాలని మీటింగ్ లలో చెప్పడం కాదని నిజంగానే మహిళలకు గౌరవం ఇవ్వాలని సూచించారు. కాగా వీడియోపై స్పందిస్తున్న నెటిజన్లు సదరు కంపెనీ తీరుపై తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఉద్యోగుల ఆరోగ్యం ఎటుపోయినా పర్వాలేదు వారికి కావాల్సింది మనం పని చేయడమేనంటూ కామెంట్స్ చేస్తున్నారు. మరికొంత మంది నెటిజన్లు ఆనంద్ మహింద్రాకు ట్యాగ్ చేస్తూ ఇదేనా మీ ఉద్యోగులను డీల్ చేసే పద్దతి అంటూ ప్రశ్నిస్తున్నారు. అయితే ఈ ఆరోపణలపై సదరు సంస్థ ఎలా రియాక్ట్అవుతుందో చూడాలి మరి.

Next Story