6 రోజులు గడవక ముందే, పిండిప్రోలు తరహాలో బీరోలు గ్రామంలో మరో దొంగతనం

by Taduka Kalyani |

గత శనివారం తెల్లవారుజామున తిరుమలాయపాలెం మండలంలోని పిండిప్రోలు గ్రామంలో వృద్ధ దంపతుల ఇంట్లో జరిగిన చోరీ ఘటన మరువకముందే, మండలంలోని బీరోలు గ్రామంలో బుధవారం రాత్రి మరో చోరీ చోటుచేసుకుంది.

6 రోజులు గడవక ముందే, పిండిప్రోలు తరహాలో  బీరోలు గ్రామంలో మరో దొంగతనం
X

దిశ, తిరుమలాయపాలెం: గత శనివారం తెల్లవారుజామున తిరుమలాయపాలెం మండలంలోని పిండిప్రోలు గ్రామంలో వృద్ధ దంపతుల ఇంట్లో జరిగిన చోరీ ఘటన మరువకముందే, మండలంలోని బీరోలు గ్రామంలో బుధవారం రాత్రి మరో చోరీ చోటుచేసుకుంది. వరుస ఘటనలతో మండల ప్రజల్లో ఆందోళన నెలకొంది. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బీరోలు గ్రామానికి చెందిన ఆవుల భద్రయ్య, శకుంతల అనే వృద్ధ దంపతులు తమ ఇంట్లో నివాసం ఉంటున్నారు. వారికి ఐదుగురు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. పిల్లలందరూ వివాహం అనంతరం వేర్వేరు ప్రాంతాల్లో స్థిరపడగా, వృద్ధ దంపతులు గ్రామంలోని తమ ఇంట్లోనే ఉంటున్నారు. బుధవారం రాత్రి సుమారు 11 గంటల సమయంలో గుర్తుతెలియని వ్యక్తి ద్విచక్రవాహనంపై వచ్చి ఇంటి వెనుక వైపు నుంచి లోపలికి ప్రవేశించినట్లు తెలుస్తోంది. నిద్రిస్తున్న శకుంతల మెడలోని బంగారు గొలుసును లాక్కునే ప్రయత్నంలో ఆమె మేల్కొని కేకలు వేయగా, భర్త భద్రయ్య కూడా లేచాడు. దీంతో దంపతులు ప్రతిఘటించగా, దుండగుడు వారి కళ్లలో కారం చల్లి బంగారు గొలుసును లాక్కొని అక్కడి నుంచి పరారైనట్లు బాధితులు తెలిపారు. చోరీకి గురైన బంగారు గొలుసు సుమారు రెండున్నర తులాల బరువు ఉండగా, దాని విలువ రూ.3 లక్షలకు పైగా ఉంటుందని వారు తెలిపారు. సమాచారం అందుకున్న రూరల్ ఏసీపీ తిరుపతి రెడ్డి సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. స్థానిక ఎస్సై కూచిపూడి జగదీశ్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఆరు రోజుల వ్యవధిలోనే మండలంలో వరుసగా వృద్ధుల ఇళ్లనే లక్ష్యంగా చేసుకుని చోరీలు జరగడం స్థానికుల్లో భయాందోళనలు కలిగిస్తోంది. నిందితులను త్వరగా గుర్తించి కఠిన చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు పోలీసులను కోరుతున్నారు.

Next Story