ప్రజలు ఇచ్చిన అవకాశాన్ని జల్సాలకు, చిల్లర పనులకు వాడుకున్నది ఎవరో ప్రజలు ఆలోచించాలి

by Ratna Kumari |

ఉనికిచర్ల గ్రామాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేసి పట్టణ రూపురేఖలు తీసుకురావడం తన బాధ్యత అని స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి అన్నారు.

ప్రజలు ఇచ్చిన అవకాశాన్ని జల్సాలకు, చిల్లర పనులకు వాడుకున్నది ఎవరో ప్రజలు ఆలోచించాలి
X

దిశ, ధర్మసాగర్ : ఉనికిచర్ల గ్రామాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేసి పట్టణ రూపురేఖలు తీసుకురావడం తన బాధ్యత అని స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి అన్నారు. గ్రేటర్ వరంగల్ 64వ డివిజన్ పరిధిలోని ఉనికిచర్ల గ్రామంలో పలు అభివృద్ధి పనుల శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా రూ.2 కోట్లతో కుడా వెంచర్ నుంచి ఉనికిచర్ల వరకు డబుల్ లైన్ సీసీ రోడ్డు నిర్మాణానికి, రూ.50 లక్షలతో స్మశానవాటిక అభివృద్ధి పనులకు, రూ.2 కోట్లతో అంతర్గత సీసీ రోడ్ల నిర్మాణానికి ఎమ్మెల్యే శంకుస్థాపన చేశారు. అనంతరం గ్రామంలో నూతనంగా నిర్మించిన ఇందిరమ్మ ఇండ్లను లబ్ధిదారులతో కలిసి ప్రారంభించి, సుమారు 700 మంది మహిళా సంఘాల సభ్యులకు ఇందిరమ్మ చీరలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కడియం శ్రీహరి మాట్లాడుతూ.. ఓఆర్ఆర్ నుంచి ఉనికిచర్ల వరకు నాలుగు లైన్ల రహదారి నిర్మాణంతో పాటు సెంట్రల్ లైటింగ్, సైడ్ డ్రైనేజీల నిర్మాణం చేపడతామని, అందుకు అవసరమైన నిధులు మంజూరు చేస్తామని తెలిపారు.

అలాగే రూ.50 లక్షలతో స్మశానవాటికలో ప్రహరీ గోడ, బర్నింగ్ ప్లాట్‌ఫామ్, బోర్, వాటర్ ట్యాంక్, ప్రధాన రహదారి నుంచి స్మశానవాటిక వరకు సీసీ రోడ్డు నిర్మాణాన్ని ఆరు నెలల్లో పూర్తి చేస్తామని** హామీ ఇచ్చారు. ఎంపీ నిధుల ద్వారా త్వరలోనే మహిళా కమ్యూనిటీ హాల్‌తో పాటు గ్రామానికి అవసరమైన ఇతర అభివృద్ధి పనులను కూడా మంజూరు చేస్తామని పేర్కొన్నారు. కడియం శ్రీహరి ఎమ్మెల్యేగా ఉన్నప్పుడే గ్రామాల్లో అభివృద్ధి జరిగిందని, మళ్లీ తాను ఎన్నికైన తర్వాతే అభివృద్ధి పనులు వేగం పుంజుకున్నాయని అన్నారు. పని చేయని వారు ఎవరో, పని చేసిన వారు ఎవరో ప్రజలు తెలుసుకోవాలని, ప్రజలు ఇచ్చిన అవకాశాన్ని జల్సాలకు, చిల్లర పనులకు వాడుకున్నది ఎవరో ప్రజలు గమనించాలని కోరారు. పార్టీలకు అతీతంగా నిజాయితీగా ప్రజల కోసం పని చేసే వారిని గుర్తించాలని, అభివృద్ధిలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో గ్రేటర్ వరంగల్ కార్పొరేషన్ అధికారులు, హౌసింగ్ అధికారులు, తహసీల్దార్, ఎంపీడీవో, మాజీ కార్పొరేటర్ ఆవాల రాధికా రెడ్డి, స్థానిక నాయకులు, కార్యకర్తలు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.

Next Story