చనిపోయాక కూడా మళ్లీ బతకాలనే కోరిక.. ఈ 500 మంది ఏం చేశారంటే?

by Yella Dhawani Reddy |   (  Updated:2025-08-25 14:08:46  IST  )

ఒక కుక్క జీవిత కాలం 10 నుంచి 13 ఏళ్లు. అదే ఒక పిల్లి 13 నుంచి 20 ఏళ్లు బతుకుతుంది.

చనిపోయాక కూడా మళ్లీ బతకాలనే కోరిక.. ఈ 500 మంది ఏం చేశారంటే?
X

దిశ, వెబ్ డెస్క్: ఒక కుక్క జీవిత కాలం 10 నుంచి 13 ఏళ్లు. అదే ఒక పిల్లి 13 నుంచి 20 ఏళ్లు బతుకుతుంది. అలాగే అడవిలో సంచరించే భారీ జంతువైన ఒక ఏనుగు 50 నుంచి 70 ఏళ్లు జీవిస్తుంది. ఇక మనిషి ఆయుష్షు వందేళ్లుగా చెబుతుంటారు. ఆకరికి వెయ్యేళ్లకు పైగా ప్రకృతి విపత్తులను తట్టుకుని నిలిచిన మహావృక్షం కూడా ఏదో ఒక రోజు నేలకొరగక తప్పదు. అంటే.. భూమిపై పుట్టిన ప్రతి ప్రాణికి మరణం అనేది సర్వసాధారణమైనది. అందుకే చావు పుట్టుకలనేవి సాధారణ జీవన చక్రంలో భాగంగా చూస్తారు. కానీ, మనలో చాలా మందికి ప్రాణంపై తీపి ఎక్కువ. అందుకే ఏదో ఒక రోజు చావు తప్పదని తెలిసినా దాన్ని జీర్ణించుకోలేరు. ఎక్కువకాలం జీవించాలని, చనిపోకూడదని ఎంతో ఆరాటపడుతంటారు. ఈ దిశగా శాస్త్రవేత్తలు సైతం ఎన్నో ఏళ్లుగా పరిశోధనలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో, కొంతమంది మరణం తర్వాత కూడా జీవన అవకాశం కోసం ఒక విప్లవాత్మక ప్రయోగంలో పాల్గొంటున్నారు.

సాధారణంగా మనం మరణించిన తర్వాత ఖననం చేయటం, దహనం చేయటం వంటి ఆచారాలు పాటిస్తుంటాం. కానీ, మరణించిన దాదాపు 500 మంది వ్యక్తులను చట్టపరంగా -196 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత వద్ద లిక్విడ్ నైట్రోజన్‌లో భద్రపరిచారు. ఈ ప్రక్రియను క్రయోనిక్స్ అంటారు. భవిష్యత్తులో శాస్త్రవేత్తలు చావును జయిస్తే.. తిరిగి జీవితాన్ని పొందాలని అనుకుంటున్నారు. ప్రస్తుతం అమెరికాలోని అరిజోనాలో ఉన్న అల్కోర్ లైఫ్ ఎక్స్‌టెన్షన్ ఫౌండేషన్ (Alcor Life Extension Foundation) 248 మందిని, మిచిగాన్‌లోని క్రయోనిక్స్ ఇన్‌స్టిట్యూట్ (Cryonics Institute) 240 మందిని, రష్యాలోని క్రియోరస్ సంస్థ (KrioRus) 100 మందికి పైగా వ్యక్తులను ఇలా సంరక్షిస్తోంది. ఇందుకోసం వీరంతా చాలా డబ్బును సైతం ఖర్చుపెడుతున్నారు.

క్రయోనిక్స్ అనేది మానవ జీవనాన్ని పెంచుకోవాలనే లక్ష్యంతో చేసిన ఒక వినూత్న ప్రయత్నం. అయితే ఇది ఇంకా ప్రయోగాత్మక దశలోనే ఉంది. ఈ ప్రక్రియలో భాగంగా ఉన్న వ్యక్తులు మాత్రం భవిష్యత్తులో శాస్త్ర విజ్ఞానం అభివృద్ధి చెందితే, తమ శరీరాలను మళ్లీ జీవితం వైపు తీసుకెళ్తుందన్న ఆశతో ఉన్నారు. అయితే, ఈ సాంకేతికత ప్రస్తుతం అనేక సవాళ్లను ఎదుర్కొంటోంది. నిల్వ చేసిన శరీరాన్ని మళ్లీ జీవితం పొందేలా చేయడం సాధ్యమవుతుందా? లేదా ఇది కేవలం ఊహాగానమేనా? అనే ప్రశ్నలకు ఇంకా స్పష్టమైన సమాధానం లేదు. శాస్త్రవేత్తలు ఈ రంగంలో అధ్యయనాలు కొనసాగిస్తూనే ఉన్నా, ఇప్పటివరకు వాస్తవంగా ఎవరినైనా తిరిగి జీవింపజేసిన ఉదాహరణలు లేవు. దీంతో, క్రయోనిక్స్‌పై నమ్మకంతో పాటు అనుమానాలు కూడా పెరుగుతున్నాయి. ఇది నిజంగా మానవ జీవితాన్ని పొడిగించగలదా? లేక కేవలం ఖరీదైన ఆశగా మిగిలిపోతుందా? అనే అంశం ఇప్పటికీ పరిష్కారం లేని ప్రశ్నంగానే ఉంది. ఈ విధానం విజయవంతమైతే అది శాస్త్ర సాంకేతిక విజ్ఞానంలో ఒక విప్లవాత్మక మార్పును తెస్తుంది. కానీ అప్పటి వరకు ఇది ఓ గంభీరమైన ప్రయోగంగా మాత్రమే కొనసాగుతుంది.

Read More..

2050 నాటికి వృద్ధాప్యాన్ని జయించే బయోటెక్ విప్లవం : మనిషి వెయ్యేళ్లు జీవిస్తాడా?

డెన్నీ లేకపోతే మనుషులు ఉండేవారు కాదా? ఒక ఎముక ముక్కతో తారుమారైన మానవ చరిత్ర?

Next Story