డెన్నీ లేకపోతే మనుషులు ఉండేవారు కాదా? ఒక ఎముక ముక్కతో తారుమారైన మానవ చరిత్ర?

by Yella Dhawani Reddy |   (  Updated:2025-08-24 16:24:56  IST  )

మానవ చరిత్ర అనేది కేవలం కాలక్రమానుసారంగా జరిగిన సంఘటనల పరంపర మాత్రమే కాదు. అది ఓ అనంతమైన ప్రశ్నల ప్రయాణం.

డెన్నీ లేకపోతే మనుషులు ఉండేవారు కాదా? ఒక ఎముక ముక్కతో తారుమారైన మానవ చరిత్ర?
X

దిశ, వెబ్ డెస్క్: మానవ చరిత్ర అనేది కేవలం కాలక్రమానుసారంగా జరిగిన సంఘటనల పరంపర మాత్రమే కాదు. అది ఓ అనంతమైన ప్రశ్నల ప్రయాణం. మనిషి పుట్టుక ఎక్కడ మొదలైంది? ఎవరు మన అసలైన పూర్వీకులు? వేర్వేరు మానవ జాతులు ఎప్పటికప్పుడు కలిశాయా? లేక వేరే వేరే దారుల్లో నడిచాయా? మానవజాతి మూలాల వెనుక ఉన్న సత్యాలు ఏమిటి? వంటి అనేక ప్రశ్నలు శతాబ్దాలుగా శాస్త్రవేత్తలను వెంటాడుతున్నాయి. ఈ రహాస్యాలను చేధించేందుకు ఎన్నో ప్రయోగాలు చేస్తున్నారు. శిలాజాల విశ్లేషణలు, DNA పరీక్షలు, ఆధునిక టెక్నాలజీ సహాయంతో మానవ చరిత్రను తిరిగి చదవడానికి ప్రయత్నిస్తున్నారు. ప్రతి కొత్త ఆవిష్కరణ మన మూలాలపై మరో కొత్త కోణాన్ని తెరుస్తోంది. కానీ, సమాధానాల కంటే సందేహాలే ఎక్కువగా పుట్టుకొస్తున్నాయి. కానీ, ఇప్పుడు సైబీరియాలోని (Siberia) డెనిసోవా గుహలో (Denisova Cave) దొరికిన ఒక చిన్న ఎముక ముక్క మానవ చరిత్రలోని (Human history) ఈ రహస్యాలకు కొత్త దారిని చూపించింది.

ఆ ఎముక 90 వేల సంవత్సరాల క్రితం మంచు యుగంలో (Ice Age) జీవించిన ఓ యువతికి చెందింది. ఆమె పేరు డెన్నీ (Denny). మొదట ఇది సాధారణ శిలాజంగా అనిపించింది. కానీ ఆమె DNAలో దాగి ఉన్న వివరాలు మాత్రం ఆశ్చర్యానికి గురిచేశాయి. ఆమె తల్లి నియాండర్తల్ (Neanderthal), తండ్రి డెనిసోవన్ (Denisovan) అని తేలింది. ఇవి రెండూ ఇప్పుడు అంతరించిపోయిన మానవ జాతులు. శాస్త్రవేత్తలు ఇంతవరకు వీరిద్దరి మధ్య సంబంధం ఉండవచ్చునని ఊహించేవారు. కానీ డెన్నీ డీఎన్ఏ మాత్రం స్పష్టమైన ఆధారంగా నిలిచింది. అంతేకాదు, డెన్నీ డీఎన్‌ఏలో మరో ఆశ్చర్యకరమైన విషయం బయటపడింది. ఇది మానవ చరిత్రకు మరో కోణాన్ని మేల్కొలిపింది.

డెన్నీ తండ్రి జన్యువుల్లో కూడా గత తరాల నుంచి నియాండర్తల్ వంశపారంపర్య జాడలు కనిపించాయి. అంటే.. నియాండర్తల్‌లు, డెనిసోవన్‌ జాతులు ఒక్కసారే కాదు, పలు తరాలుగా కలుసుకొని సంకరం చెందడాన్ని సూచిస్తుంది. ఇంకా ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. ఆమె తల్లి జన్యువుల్లో పాశ్చాత్య యూరోప్ ప్రాంతానికి చెందిన నియాండర్తల్‌తో సంబంధం కలిగి ఉంది. అంటే.. పురాతన మానవులు చాలా దూరాల వరకు ప్రయాణించి, ఇతర ప్రాంతాల మానవులతో సంబంధాలు ఏర్పరచుకున్నారని తెలుస్తోంది. అంతేకాదు, డెన్నీ కథ మానవ చరిత్ర అనేది ఒకే దారిలో నేరుగా సాగిన సాఫీ ప్రయాణం కాదని, వేర్వేరు జాతులు కలిసి, కలిసిపోయి మన ఆవిర్భావానికి బీజాలు వేసినట్లుగా తెలియజేస్తోంది.

Next Story