రైతులకు జింకల దడ

by Jakkula.Mamatha |

జింకలు ముచ్చట గొలుపుతాయి. చెంగు చెంగున అవి ఎగురుతుంటే పిల్లలకైనా పెద్దలకైనా ఆనందమే.

రైతులకు జింకల దడ
X

దిశ, మద్నూర్: జింకలు ముచ్చట గొలుపుతాయి. చెంగు చెంగున అవి ఎగురుతుంటే పిల్లలకైనా పెద్దలకైనా ఆనందమే. కానీ ఇక్కడి గ్రామాల రైతులకు మాత్రం జింకలు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. ఒక్కసారిగా వందల జింకలు పంటలపై దాడి చేసి నాశనం చేస్తున్నాయి. ఒకసారి ఒక మంద పొలాల మీదికి వచ్చిందంటే పంట ధ్వంసమైపోయినట్టే. పంటలను తిని, పీకేసి చేతికి అందకుండా చేస్తున్నాయి. రైతులను జింకల బెడద పట్టి పీడిస్తోంది. పొలాల్లో ఎక్కడ చూసినా జింకల మందలే కనిపిస్తాయి. ఒక్కొక్క మందలో సుమారు వందకు పైగా ఉంటాయి.

పంట నాశనం నాశనం చేస్తాయనే బెంగ.. ఎటూ పాలుపోక దిక్కుతోచని స్థితిలో రైతులు కొట్టుమిట్టాడుతున్నారు. మద్నూర్, డోంగ్లి, బిచ్కుంద, పిట్లం, జుక్కల్ మండలం గ్రామ శివారులో రైతులకు జింకల బెడద తీవ్రంగా వేధిస్తోంది. పంట మొలక దశలో ఉండగానే గుంపులుగా వస్తున్న జింకలు పంటను తినేయడంతో పాటు కాళ్లతో తొక్కడం వల్ల మొక్కలు లేత దశలో ఉండటం వలన విరిగి వాడిపోయి నాశనమవుతున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జింకల బెడద తప్పించేలా అటవీశాఖ అధికారులు చర్యలు తీసుకోవాలని రైతులు కోరుతున్నారు.

గత కొంతకాలంగా మద్నూర్, డోంగ్లి, బిచ్కుంద, పిట్లం, జుక్కల్ శివారు పొలాల్లో జింకల సంఖ్య భారీగా పెరిగింది. ఒక్కోసారి 120 నుంచి 150 వరకు జింకలు ఒకే గుంపుగా పొలాల్లోకి వస్తున్నాయి. పచ్చని పంటలను చూసి గుంపుగా దాడి చేస్తున్నాయి. మొలకలను తినడమే కాకుండా పొలమంతా తిరుగుతూ తొక్కడంతో వేలాది రూపాయల పెట్టుబడి నీటిపాలవుతోందని రైతులు వాపోతున్నారు. రైతులు మాట్లాడుతూ, సాయంత్రం, రాత్రి పూట, తెల్లవారుజామున జింకలు గుంపులుగా వస్తాయి. కాపలా కాసిన ఆపడం కష్టంగా ఉంది. పంట మొదటి దశలోనే ఇలా నాశనమైతే మేము ఏం చేయాలి అని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పొలాల్లో జింకల గుంపులు సంచరిస్తూ కనిపిస్తున్నాయి. పచ్చని చేనులో వందల సంఖ్యలో జింకలు మేత మేస్తున్న దృశ్యాలు రైతులను కలవరపెడుతున్నాయి.

అటవీ శాఖ స్పందించాలి..

పంటను కాపాడుకోవడం రైతులకు సాధ్యం కావడం లేదు. ఫెన్సింగ్, కాపలా వంటి చర్యలు సరిపోవడం లేదని రైతులు చెబుతున్నారు. వెంటనే అటవీ శాఖ అధికారులు స్పందించి రైతుల పొలాలకు రక్షణ చర్యలు తీసుకోవాలని, జింకల బెడద నుంచి విముక్తి కల్పించాలని మద్నూర్, డోంగ్లి, బిచ్కుంద, పిట్లం, జుక్కల్ గ్రామంతో పాటు చుట్టుపక్కల గ్రామాల రైతులు కోరుతున్నారు. నష్టపోయిన రైతులకు తగిన పరిహారం అందించాలని, జింకలను అడవి వైపు మళ్లించేందుకు చర్యలు చేపట్టాలని రైతులు విజ్ఞప్తి చేస్తున్నారు.

Next Story