2050 నాటికి వృద్ధాప్యాన్ని జయించే బయోటెక్ విప్లవం : మనిషి వెయ్యేళ్లు జీవిస్తాడా?

by Javid Pasha |   (  Updated:2025-08-25 14:07:51  IST  )

కృత్రిమ మేధ, నానో టెక్నాలజీ, జన్యుశాస్త్రం, రోబోటిక్స్‌లో జరుగుతున్న మార్పులు, పురోగతులతో వృద్ధాప్యాన్ని అడ్డుకోవచ్చు లేదా పూర్తిగా నిలిపి వేయవచ్చునని రే కుర్జ్‌వీల్, అలాగే ఆబ్రే డి గ్రే వంటి నిపుణులు అంచనా వేశారు.

2050 నాటికి వృద్ధాప్యాన్ని జయించే బయోటెక్ విప్లవం : మనిషి వెయ్యేళ్లు జీవిస్తాడా?
X

దిశ, ఫీచర్స్ : మనుషులు ఎంత కాలం జీవిస్తారు? ఇప్పుడైతే సాధారణంగా 70 నుంచి 80 ఏండ్ల వరకు జీవిస్తున్నారు. కొందరు 90 ఏండ్ల వరకు, ఆపైన కూడా జీవిస్తున్నారు. ఒకప్పుడైతే వందేండ్లు, అంతుకుమించి కూడా జీవించేవారు. కారణాలేమైనా ఆయుఃప్రమాణాలు తగ్గుతున్నాయ్. కానీ భవిష్యత్ ఆధునిక పరిణామాలు, సాంకేతికత మార్పుల కారణంగా మనిషి సాధారణ ఆయుష్షు వెయ్యేండ్లకు పెరిగితే..! ఇలా ఊహించుకోవడం సైన్స్ ఫిక్షన్‌లా అనిపిస్తుండవచ్చు కానీ.. శాస్త్రవేత్తలు, భవిష్యత్ ఆలోచనా పరుల(Future thinkers) మధ్య ఇదొక ఆసక్తికరమైన చర్చకు దారితీస్తూ ఆశలు రేకెత్తిస్తోంది.

బయోటెక్నాలజీలో వచ్చే సరికొత్త మార్పులు మానవాళి వృద్ధాప్యాన్ని జయించేందుకు దోహద పడతాయని ఫ్యూచరిస్టులు అంటున్నారు. ఇప్పటికే రే కుర్జ్‌వీల్ (Ray Kurzweil), అలాగే ఆబ్రే డి గ్రే (Aubrey de Grey) వంటి నిపుణులు కృత్రిమ మేధ(artificial intelligence), నానో టెక్నాలజీ, జన్యుశాస్త్రం(Genetics), రోబోటిక్స్‌లో జరుగుతున్న మార్పులు, పురోగతులతో వృద్ధాప్యాన్ని అడ్డుకోవచ్చు లేదా పూర్తిగా నిలిపి వేయవచ్చునని వాదిస్తున్నారు. ముఖ్యంగా 2050 నాటికి బయో టెక్నాలజీలో సాధించే బయోటెక్ విప్లవం (Technological advances), వైద్య పరమైన మార్పులు ‘ప్రాక్టికల్ ఇమ్మార్టాలిటీ’ అని పిలబడే స్థితికి మనల్ని దగ్గర చేస్తాయని, ఇవి దీర్ఘాయుష్షును పెంచేందుకు దోహదం చేస్తాయని అంచనా వేస్తున్నారు.

సైంటిఫిక్ అమెరికన్ అండ్ పాపులర్ మెకానిక్స్‌లో చర్చించిన పరిశోధనల ప్రకారం కూడా.. సెల్యులార్ స్థాయిలో వృద్ధాప్యాన్ని పూర్తిగా రిపేర్ చేయగలిగితే లేదా రివర్స్ చేయగలిగితే మానవులు థియరికల్లీ (theoretically) వేల సంవత్సరాలు, అంటే సుమారు 1000 నుంచి 2000 సంవత్సరాలు జీవించవచ్చునని అంచనా వేస్తున్నారు కొందరు శాస్త్రవేత్తలు. నానోబాట్‌లు దెబ్బతిన్న కణాలను రియల్ టైమ్‌లో రిపేర్ చేయడం, వృద్ధాప్యానికి సంబంధించిన జెనెటిక్ మ్యుటేషన్‌లను తొలగించే జన్యుసవరణ వంటి అత్యాధునిక సాంకేతికతలు మానవ శరీరానికి సంబంధించి జీవ సంబంధ పరిమితులను సవాలు చేయగలవని, దీంతో వృద్ధాప్యాన్ని జయించడం సాధ్యమేనని రే కుర్జ్‌వీల్ వంటి ఫ్యూచరిస్టులు అంచనా వేశారు. అయినప్పటికీ దీర్ఘాయుష్షు కూడా, తర్వాత సవాళ్లకు దారితీసే అవకాశం ఉందనే వాదనలు సైతం వినిపిస్తున్నాయి. మొత్తానికి మోడ్రన్ బయో టెక్నాలజీ వైద్య రంగంలో తెచ్చే మార్పులు మనిషి వృద్ధాప్యాన్ని అడ్డుకొని ఆయుష్షును పెంచుతాయన్న చర్చలు సోషల్ మీడియా వేదికగా ఆసక్తి రేకెత్తిస్తున్నాయి.

Read More..

చనిపోయాక కూడా మళ్లీ బతకాలనే కోరిక.. ఈ 500 మంది ఏం చేశారంటే?

Next Story