నామినేటెడ్ పోస్టులకు భారీగా పోటీ.. ఎవరికీ వారే ప్రయత్నాలు!

by Jakkula.Mamatha |

రాష్ట్ర స్థాయి నామినేటెడ్ పదవుల కోసం పైరవీలు జోరందుకున్నాయి. కాంగ్రెస్ సీనియర్ నేతలు ఈ పదవుల కోసం పోటీ పడుతున్నారు.

నామినేటెడ్ పోస్టులకు భారీగా పోటీ.. ఎవరికీ వారే ప్రయత్నాలు!
X

దిశ, వరంగల్ బ్యూరో: రాష్ట్ర స్థాయి నామినేటెడ్ పదవుల కోసం పైరవీలు జోరందుకున్నాయి. కాంగ్రెస్ సీనియర్ నేతలు ఈ పదవుల కోసం పోటీ పడుతున్నారు. ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రుల ద్వారా ప్రయత్నం చేస్తూ గట్టి పట్టు పడుతున్నారు. కాంగ్రెస్ లో మొదటి నుంచి ఉన్న నేతలు ఈ రెండవ విడతలో తమకు అవకాశం ఇవ్వాలని కోరుతున్నారు. కొద్ది రోజుల్లో భర్తీ చేయనుండటంతో హైదరాబాద్‌లో ఉంటూ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జి మీనాక్షి నటరాజన్, సీఎం రేవంత్ రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్‌లను కలుస్తూ అవకాశం ఇవ్వాలని కోరుతున్నారు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి తాము పార్టీ కోసం ఏ విధంగా పనిచేశామో వివరిస్తున్నారు. నామినేటెడ్ పదవుల భర్తీకి కొలిక్కి వస్తుండటంతో ఎవరికి వారే ప్రయత్నాలు చేస్తున్నారు. రాష్ట్రస్థాయిలో కార్పొరేషన్ చైర్మన్‌ల పదవి కాలం ఈ నెల మొదటి వారంలో పూర్తయ్యింది.

ఈ పదవుల రెండో విడత భర్తీ కోసం కసరత్తు చేస్తున్నారు. మొదటి విడత లో చైర్మన్‌లుగా పనిచేసిన వారి పనితీరును సమీక్షిస్తున్నారు. వారిలో పనిచేసిన వారికి రెండో విడత అవకాశం ఇస్తూ, పనిచేయని వారిని తప్పించి కొత్త వారికి అవకాశం ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. రెండేళ్ల కాలంలో వారి పనితీరును నిఘా వర్గాలు, ప్రత్యేక ఏజెన్సీ లు ఇచ్చిన నివేదికల ఆధారంగా సగానికి పైగా తప్పిస్తున్నట్లు తెలుస్తోంది. పనితీరు, పార్టీలో వారి వ్యవహారం బట్టి అవకాశం ఇవ్వనున్నారు. ఉమ్మడి జిల్లా పరిధిలో మొదటి విడతలో ఆరుగురు కార్పొరేషన్ చైర్మన్‌గా పనిచేశారు. వారిలో ఒకరికి ఇప్పటికే రెన్యువల్ చేశారు. ఐదుగురిలో ఒకరిద్దరు మినహా మిగతా వారిని తప్పిస్తున్నట్లు సమాచారం.

రాష్టస్థ్రాయి నామినేటెడ్ పోస్టుల కసరత్తు జరుగుతుండటంతో కాంగ్రెస్ పార్టీలో దీర్ఘకాలికంగా పనిచేస్తున్న నేతలు ఈ పదవుల కోసం గట్టి ప్రయత్నాలు చేస్తున్నారు. రెండో విడత కార్పొరేషన్ చైర్మన్‌లుగా నామినేటెడ్ అయితే రెండేళ్ల పాటు పదవి కాలం ఉండటంతో ఎక్కువ మంది పోటీ పడుతున్నారు. ప్రభుత్వం మళ్లీ ఎన్నికలకు వెళ్లే సమయంలో రెన్యువల్‌కు అవకాశం ఉండటంతో సీనియర్ నేతలు పోటీ పడుతున్నారు. ఎమ్మెల్యేలుగా అవకాశం లేని వారికి ఈ దఫా అవకాశం ఇవ్వనున్నారు. నామినేటెడ్ పదవులకు పోటీపడుతున్న వారిలో కొంత మంది కి ఎమ్మెల్యేలు గట్టి మద్దతు ఇస్తున్నారు. సీఎం, రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జి, పీసీసీ అధ్యక్షుని దృష్టికి తీసుకెళ్లడంతో పాటు పూర్తిస్థాయిలో అవకాశం ఇవ్వాలని కోరుతున్నారు.

పదవుల కోసం గట్టి ప్రయత్నాలు..

ఉమ్మడి జిల్లాలో రాజకీయ సమీకరణాలు బట్టి ఈ దఫా వరంగల్ కార్పొరేషన్ పరిధిలోని వర్ధన్నపేట, వరంగల్ ఈస్ట్, వెస్ట్ నియోజకవర్గాల నేతలకు నామినేటెడ్ పదవులు రానున్నట్లు తెలుస్తోంది. వీటి కోసం మంత్రితో పాటు ఎమ్మెల్యేలు గట్టి పట్టు పడుతున్నారు. వర్ధన్నపేట నియోజకవర్గం పరిధిలో గతంలో ఎమ్మెల్యే టిక్కెట్ కోసం ప్రయత్నం చేసిన ఓ నేతకు ఈ దఫా అవకాశం ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. హన్మకొండ వెస్ట్ నియోజకవర్గం పరిధిలో ఎమ్మెల్యే అనుచరులతో పాటు రాష్ట్ర మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు అనుచరుడికి అవకాశం రానున్నట్లు తెలుస్తోంది. మంత్రి అనుచరుడి కోసం కూడా గట్టి ప్రయత్నం చేస్తున్నారు. ములుగు నియోజకవర్గం పరిధిలో జిల్లా అధ్యక్షునికి నామినేటెడ్ పదవి రానున్నట్లు పార్టీ నేతల్లో చర్చ జరుగుతోంది. ములుగులో మంత్రి ఉండటం అనుచరుల కోసం ఈ దఫా ఒక కార్పొరేషన్ పదవి ఇవ్వాలని కోరినట్లు తెలుస్తోంది. వీరే కాకుండా జనగామ, పాలకుర్తి నియోజకవర్గం పరిధిలో నేతలు నామినేటెడ్ పోస్టుల కోసం గట్టి ప్రయత్నాలు చేస్తున్నారు. పాలకుర్తిలో ఎమ్మెల్యేకు కొంత మంది సీనియర్ నేతలకు విబేదాలు ఉండటంతో సమన్వయం చేస్తూ అక్కడ కార్పొరేషన్ చైర్మన్ గా ఒకరికి అవకాశం ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. జనగామ పరిధిలో ఎమ్మెల్యే లేకపోవడం జిల్లా కేంద్రం కావడంతో పరిశీలిస్తున్నట్లు సమాచారం. ఇవే కాకుండా భూపాలపల్లి, పరకాల నియోజకవర్గం పరిధిలోని నేతలు కూడా ప్రయత్నాలు చేస్తున్నారు.

వరంగల్ లో కీలకమైన కాకతీయ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ పదవి కాలం పూర్తయ్యింది. చైర్మన్ గా పనిచేసిన ఇనగాల వెంకట్రామిరెడ్డికి మరోదఫా పొడిగింపు రానున్నట్లు తెలుస్తోంది. పార్టీ జిల్లా అధ్యక్షుడు కావడంతో రెండో విడత కూడా ఆయన అవకాశం ఇవ్వనున్నట్లు తెలుస్తుంది. రెండు మూడు రోజుల్లో ఉత్తర్వులను వెలువర్చనున్నట్లు సమాచారం. దీర్ఘకాలికంగా పార్టీలో పనిచేయడం కలిసి వస్తుంది.

ఈ పదవి కోసం నగరం పరిధిలోని ఇతర నేతలు దృష్టి పెట్టిన ఆయనకే మొగ్గు చూపినట్లు సమాచారం. కుడాకు రెవెన్యూ తీసుకురావడంతో పాటు రైతుల ద్వారా భూ సేకరణ చేపట్టి కొత్త వెంచర్లను తీసుకురావడంలో ముఖ్య పాత్ర పోషించారు. ఉమ్మడి జిల్లా పరిధిలో ఇప్పటి వరకు కార్పొరేషన్ చైర్మన్ గా చేసిన ఒక నేత తనకు రెండో విడత పదవి వద్దని నగర మేయర్ గా అవకాశం ఇవ్వాలని అధిష్టానాన్ని కోరినట్లు తెలుస్తోంది. గతంలో ఎమ్మెల్యే టిక్కెట్ కోసం ఆయన ప్రయత్నం చేసిన సామాజిక సమీకరణాల వల్ల ఆయనకు అవకాశం ఇవ్వలేదు. ప్రస్తుతం మేయర్ పదవి ఖాళీగా ఉండటం మూడు నాలుగు నెలల్లో ఎన్నికలు నిర్వహించే అవకాశం ఉండటంతో తనకు అవకాశం ఇవ్వాలని కోరారు.

నాలుగు రోజుల క్రితం రాష్ట్ర స్థాయిలో జరిగిన జిల్లా అధ్యక్షుల సమావేశాల్లో కొంత మంది అధ్యక్షులు రాష్ట్రస్థాయి కార్పొరేషన్ పదవుల్లో తమకు అవకాశం ఇవ్వాలని కోరినట్లు తెలుస్తోంది. సీఎం రేవంత్ రెడ్డి, రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జి మీనాక్షి నటరాజన్, పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, దృష్టికి తీసుకెళ్లడంతో పాటు పరిశీలించాలని కోరారు. మొత్తంగా నామినేటెడ్ పదవుల కోసం భారీగా ఉమ్మడి జిల్లా కాంగ్రెస్ నేతలు పోటీ పడుతున్నారు. కొంత మంది ఎమ్మెల్యేలు, మంత్రుల ద్వారా ప్రయత్నం చేస్తుండగా మరికొంత మంది నేరుగా సీఎంను, పీసీసీ అధ్యక్షుడిని, డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్కను, ఉత్తమ్ కుమార్ రెడ్డితో పాటు ఇతర నేతలను కలుస్తున్నారు. తమకు అవకాశం ఇవ్వాలని కోరుతున్నారు. ఎవ్వరికి నామినేటెడ్ పదవులు వస్తాయో ఈ నెలాఖరు లోపు తేలే అవకాశం ఉంది.

Next Story