- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
రైతుల మోసాలపై వ్యవసాయ శాఖ నిర్లక్ష్యమా..?
ఈ ఏడాది వర్షాభావం, నదుల్లో నీటి లభ్యత తగ్గిపోవడంతో పంటలు సాగవుతాయా లేదా అనే ఆందోళనలో రైతులు ఉన్నారు.

దిశ, మేళ్లచెరువు : ఈ ఏడాది వర్షాభావం, నదుల్లో నీటి లభ్యత తగ్గిపోవడంతో పంటలు సాగవుతాయా లేదా అనే ఆందోళనలో రైతులు ఉన్నారు. బావులు, బోర్ల ద్వారా నీటిని సమకూర్చుకుని ఎంతో కష్టపడి నారు పెంచి పంటలు సాగు చేస్తున్న సమయంలో మరోవైపు నకిలీ విత్తనాలు, ఎరువులు, పురుగుమందులు మార్కెట్‌లో చెలరేగుతున్నాయనే ప్రచారం రైతుల్లో భయాందోళనలు పెంచుతోంది. ఈ పరిస్థితుల్లో వ్యవసాయ శాఖ పనితీరుపై రైతులు పలు సందేహాలు వ్యక్తం చేస్తున్నారు.
నకిలీ పురుగుమందుల ఘటన మరిచిపోయారా..?
2025 ఫిబ్రవరిలో ఓ ప్రముఖ కంపెనీకి చెందిన "నేటివో" పురుగుమందు సుమారు 30 కార్టన్లు ఫ్లిప్‌కార్ట్ ద్వారా బీహార్ నుంచి మేళ్లచెరువుకు చేరినట్లు సమాచారం అందడంతో కంపెనీ ప్రతినిధులు గుర్తించిన ఘటన అప్పట్లో సంచలనం సృష్టించింది. అయితే ఆ ఘటనలో బాధ్యులపై ఎలాంటి చర్యలు తీసుకున్నారన్న విషయంపై స్పష్టత లేకపోవడం, రైతులకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించకపోవడంపై వ్యవసాయ శాఖపై విమర్శలు వినిపిస్తున్నాయి.
ప్రతి సీజన్‌లో నకిలీల దందా..!..
పత్తి, మిర్చి, వరి వంటి పంటలకు సంబంధించిన విత్తనాలను ఇతర ప్రాంతాల నుంచి రైతుల పేరుతో తీసుకొచ్చి గ్రామాల్లో విక్రయిస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. నాణ్యమైన విత్తనాలు, పురుగుమందుల పేరుతో రైతులను మభ్యపెట్టి నకిలీ ఉత్పత్తులు విక్రయిస్తున్నా వాటిని అరికట్టడంలో వ్యవసాయ శాఖ విఫలమైందని రైతులు ఆరోపిస్తున్నారు.
వేపల మాదారంలో నకిలీ ఎరువుల కలకలం...
మండలంలోని వేపల మాదారం గ్రామంలో నకిలీ ఎరువులు విక్రయిస్తున్న వ్యక్తిని అధికారులు గుర్తించిన ఘటన రైతుల్లో మరింత ఆందోళన కలిగించింది. స్థానికంగా కొనుగోలు చేస్తున్న ఎరువులు, పురుగుమందులు అసలైనవేనా? నకిలీవేనా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయని, ఏ డీలర్‌ను నమ్మాలో తెలియని పరిస్థితి ఏర్పడిందని రైతులు వాపోతున్నారు.
మిర్చి నారు పేరుతో భారీ మోసం...
గత ఏడాది అధిక దిగుబడి వస్తుందంటూ మిర్చి నారును విక్రయించి సుమారు 70 మంది రైతులను మోసం చేసిన ఘటనను రైతులు గుర్తు చేస్తున్నారు. మొక్కలు బలంగా పెరిగినా చివరి వరకు పూత, కాయలు రాకపోవడంతో రైతులు తీవ్రంగా నష్టపోయి ఆందోళన చేపట్టిన విషయం తెలిసిందే.
గ్రామాలకు దూరమైన వ్యవసాయ శాఖ..
రైతులకు నాణ్యమైన విత్తనాలు, పంటల సాగు విధానాలు, పంట మార్పిడి, ఎరువుల వినియోగం, సేంద్రియ సాగుపై అవగాహన కల్పించాల్సిన వ్యవసాయ శాఖ గ్రామస్థాయిలో తగిన అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం లేదని రైతులు ఆరోపిస్తున్నారు. అధికారులు గ్రామాలకు అందుబాటులో లేకపోవడంతో రైతులు ప్రైవేట్ డీలర్లను ఆశ్రయించి, వారు సూచించిన విత్తనాలు, ఎరువులు, పురుగుమందులు కొనుగోలు చేసి మోసపోతున్న పరిస్థితి నెలకొందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
రైతులకు చేరువ కావాలి..
ఇప్పటికైనా వ్యవసాయ శాఖ అధికారులు గ్రామాల్లో విస్తృతంగా పర్యటించి రైతులకు ఎప్పటికప్పుడు సలహాలు, సూచనలు అందించాలని, నకిలీ విత్తనాలు, ఎరువులు, పురుగుమందులపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసి అక్రమ విక్రయాలను అరికట్టాలని రైతులు కోరుతున్నారు. రైతుల్లో వ్యవసాయ శాఖపై మళ్లీ నమ్మకం పెంపొందించేలా అధికారులు చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని వారు అభిప్రాయపడుతున్నారు.






