అర్ధరాత్రి వేళ కిరాతకం.. కాంగ్రెస్ కీలక నేతపై పెట్రోల్ దాడి

by Kema Shiva Kumar |   (  Updated:2026-07-19 06:06:48  IST  )

వరంగల్‌లో పొలిటికల్ క్రైమ్ తీవ్ర కలకలం రేపుతోంది.

అర్ధరాత్రి వేళ కిరాతకం.. కాంగ్రెస్ కీలక నేతపై పెట్రోల్ దాడి
X

దిశ, వెబ్‌డెస్క్/గీసుకొండ: మాజీ డివిజన్ అధ్యక్షుడిపై జరిగిన హత్యాయత్నంతో వర్ధన్నపేట నియోజకవర్గంలో వర్గ పోరు అగ్గి రాజేసింది. ఎనుమాముల ఎన్టీఆర్ నగర్‌కు చెందిన కాంగ్రెస్ పార్టీ 14వ డివిజన్ మాజీ అధ్యక్షుడు ఆడుప మహేశ్‌పై శనివారం రాత్రి దుండగులు దారుణానికి పాల్పడ్డారు. ఎన్టీఆర్ నగర్‌కు చెందిన జన్ను మధు ఫోన్ చేసి, కోటిలింగాల ఆలయం దగ్గరున్న నిర్మానుష్య ప్రదేశానికి రమ్మన్నాడు. అది నమ్మి అమాయకంగా వెళ్లిన మహేశ్ కోసం అక్కడ పత్రి కుమార్ కాచుకుని ఉన్నాడు.

అనంతరం మద్యం మత్తులో ఉన్న వారు ‘ఎమ్మెల్యే దగ్గర మా గురించి ఏం చెప్పావ్?’ అంటూ మహేశ్‌ను నిలదీశారు. ఆయన సమాధానం చెప్పే లోపే ఫోన్ లాక్కొని, ఒంటిపై పెట్రోల్ పోసి నిప్పు అంటించారు. దాంతో తాను చూస్తుండగానే మంటల్లో చిక్కుకున్నానని బాధితుడు తెలిపాడు. ఆ ప్రమాదం నుండి ఎలాగోలా ప్రాణాలతో బయటపడి ఆయన గ్రామానికి చేరుకోగా.. స్థానికులు వెంటనే ఎంజీఎం ఆసుపత్రికి తరలించారు. దాదాపు 50 శాతం శరీరం కాలిపోవడంతో, మహేశ్ ప్రస్తుతం వెంటిలేటర్‌పై చికిత్స పొందుతున్నాడు. ఈ ఘటనలో ప్రధాన నిందితుడైన పత్రి కుమార్‌పై ఇప్పటికే ఒక హత్య కేసు ఉంది. ఆ కేసులో కోర్టు అతనికి జీవిత ఖైదు విధించినప్పటికీ, బెయిల్‌పై బయటకు వచ్చి మళ్లీ ఇలాంటి దాడికి తెగబడ్డాడు.

నా కుటుంబాన్ని ఆదుకోండి..

ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మహేశ్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశాడు. ‘26 ఏళ్లుగా పార్టీ కోసం కష్టపడ్డాను. నాపై దాడి చేసిన వారిని ఎన్‌కౌంటర్ చేయాలి. లేదంటే నా కుటుంబాన్ని ప్రభుత్వమే ఆదుకోవాలి’ అంటూ కన్నీరు పెట్టుకున్నాడు. ఈ ఘటనపై గీసుకొండ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Next Story