ఖాజాగూడ తలాబ్ ఎఫ్‌టీఎల్‌లో జోరుగా నిర్మాణాలు

by Jakkula.Mamatha |

ఖాజాగూడ చెరువు బఫర్ జోన్‌లో జరుగుతున్న అక్రమ నిర్మాణాలను అడ్డుకోవడంలో రెవెన్యూ, ఇరిగేషన్, హైడ్రా అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి.

ఖాజాగూడ తలాబ్ ఎఫ్‌టీఎల్‌లో జోరుగా నిర్మాణాలు
X

దిశ, శేరిలింగంపల్లి: ఖాజాగూడ చెరువు బఫర్ జోన్‌లో జరుగుతున్న అక్రమ నిర్మాణాలను అడ్డుకోవడంలో రెవెన్యూ, ఇరిగేషన్, హైడ్రా అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఈ అంశంపై ‘ఖాజాగూడ చెరువుకు ముప్పు.. ఆ మూడు శాఖల అధికారుల మౌనం’ శీర్షికన ‘దిశ’లో ప్రచురితమైన కథనంపై క్షేత్రస్థాయిలో విచారణ చేపట్టిన ఇరిగేషన్ శాఖ డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ రాజశేఖర్, అసిస్టెంట్ ఇంజనీర్ వీణ రెవెన్యూ అధికారులకు లేఖ రాశారు. అయితే అక్కడితో తమ బాధ్యత ముగిసినట్లుగా వ్యవహరించడంతో ఆక్రమణదారులకు వరంగా మారిందనే విమర్శలు వినిపిస్తున్నాయి.

ఖాజాగూడ చెరువు నుంచి రోడా మేస్త్రి కళాశాల వరకు విస్తరించిన ప్రాంతాన్ని పరిశీలించిన అధికారులు, ఖాజాగూడ పెద్ద చెరువు(ఐడీ నంబర్-3730) బఫర్ జోన్ పరిధిలో అక్రమ నిర్మాణాలు జరుగుతున్నట్లు నిర్ధారించారు. దీంతో వాటిపై చర్యలు తీసుకోవాలని తహశీల్దార్‌కు లేఖ రాశారు. తెలంగాణ ఇరిగేషన్ చట్టం-1357 లోని సెక్షన్-48 ప్రకారం జలవనరులు, నాలాల భౌగోళిక స్వరూపాన్ని మార్చడం చట్టవిరుద్ధమని, అలాగే 2012 ఏప్రిల్ 7న అమల్లోకి వచ్చిన జీఓ ఎంఎస్-168 ప్రకారం బఫర్ జోన్ ప్రాంతాల్లో శాశ్వత నిర్మాణాలకు అనుమతి లేదని ఇరిగేషన్ శాఖ స్పష్టం చేసింది.

అయితే ఖాజాగూడ చెరువు బఫర్ జోన్ పరిధిలోని స్థలానికి 2026 ఫిబ్రవరి 4న భవన నిర్మాణ అనుమతులు మంజూరైనట్లు అధికారులు గుర్తించారు. ఫైల్ నంబర్ 039202/ GHMC/11492/IABPC49/2026 ఆధారంగా అప్పటి డిప్యూ టీ కమిషనర్, అసిస్టెంట్ సిటీ ప్లానర్, టౌన్ ప్లానింగ్ సూపర్వైజర్ అనుమతులు ఇచ్చినట్లు పేర్కొన్నారు. అనంతరం స్థల పరిశీలన లేకుండా నే, అది బఫర్ జోన్‌లో ఉందో లేదో నిర్ధారించకుండా పర్మిట్ నంబర్ 0047/CMC/IA/C49/2026 (25-02-2026)తో మరో నిర్మాణానికి అనుమతి జారీ చేసినట్లు రెవెన్యూ శాఖకు పంపిన లేఖలో వెల్లడించారు.

అనుమతులిచ్చిన వారిపై చర్యలేవి?

జలవనరుల సమీపంలో నిర్మాణ అనుమతులు మంజూరు చేసే ముందు టౌన్ ప్లానింగ్ అధికారులు శాటిలైట్ చిత్రాలు పరిశీలించి, అవసరమైతే రెవెన్యూ శాఖ నుంచి స్కెచ్ మ్యాప్, ఇరిగేషన్ శాఖ నుంచి ఎన్ఓసీ తీసుకోవాల్సి ఉంటుంది. అయితే ఈ నిబంధనలను పట్టించుకోకుండా అనుమతులు మంజూరు చేశారనే ఆరోపణలు ఉన్నాయి. సాధారణ ప్రజల దరఖాస్తుల్లో చిన్న చిన్న లోపాలు వెతికే అధికారులు, ఈ విషయంలో మాత్రం అదే స్థాయి పరిశీలన చేయలేదనే విమర్శలు వ్యక్తం అవుతున్నాయి.

నిబంధనలకు విరుద్ధంగా అనుమతులు ఇచ్చిన అధికారులపై ఇప్పటివరకు శాఖాపరమైన చర్యలు తీసుకోకపోవడంతో పాటు, బఫర్ జోన్‌లో నిర్మాణాలను కూడా నిలిపి వేయలేకపోతున్నారు. మూడు శాఖల అధికారులకు సమాచారం ఉన్నప్పటికీ నిర్మాణాలు యథేచ్ఛగా కొనసాగుతున్నాయని, విజిలెన్స్ అధికారులు కూడా మౌనం పాటిస్తున్నారని ఆరోపణలున్నాయి. ఇరిగేషన్ లేఖ ఆధారంగా రెవె న్యూ, శేరిలింగంపల్లి సీఎంసీ అధికారులు చర్యలు తీసుకోవాలని ఖాజాగూడ చెరువు వద్దకు వచ్చే పర్యాటకులు డిమాండ్ చేస్తున్నారు.

Next Story