- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఏజెన్సీలో ఉపాధ్యాయుల డిప్యూటేషన్.. మారుమూల పాఠశాలల విద్యకు బ్రేక్..!
నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేట నియోజకవర్గంలోని ఏజెన్సీ ప్రాంతాలైన అమ్రాబాద్, పదరా, లింగాల, బల్మూరు, అచ్చంపేట మండలాలలో మారుమూల గ్రామీణ ప్రాంతాల్లో విద్యావ్యవస్థ బ్రేక్ పడే పరిస్థితులు దాపరించాయి.

దిశ, అచ్చంపేట : నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేట నియోజకవర్గంలోని ఏజెన్సీ ప్రాంతాలైన అమ్రాబాద్, పదరా, లింగాల, బల్మూరు, అచ్చంపేట మండలాలలో మారుమూల గ్రామీణ ప్రాంతాల్లో విద్యావ్యవస్థ బ్రేక్ పడే పరిస్థితులు దాపరించాయి. కావున లోతట్టు ప్రాంతాలైన గ్రామాలలో విద్యా వ్యవస్థను తిరిగి గాడిలో పెట్టాల్సిన బాధ్యత సంబంధిత ఉన్నత అధికారులతో పాటు జిల్లా కలెక్టర్ ప్రత్యేక దృష్టి కేంద్రీకరించి విద్యార్థులకు మెరుగైన నాణ్యత విద్య అందేలా చర్యలు తీసుకోవాలని ఆయా ప్రాంతాల ప్రజలు కోరుతున్నారు. ప్రధానంగా ఏజెన్సీ ప్రాంతానికి వృత్తిరీత్యా ఉపాధ్యాయులుగా వచ్చినవారు వారి వారి పలుకుబడితో ఇతర ప్రాంతాలకు డిప్యూటేషన్ పై తరలి వెళుతుండడం వలన గ్రామాల్లో విద్యాప్రమాణాలు పూర్తిగా క్షీణించి అడుగంటిపోతున్నాయని అందుకు ముందు చూపు లేకుండా సంబంధిత మండల అధికార యంత్రాంగం వారికి అనుకూలంగా ఉంటున్నారని విమర్శలు కూడా వెల్లువెత్తుతున్నాయి. అందుకు చక్కని ఉదాహరణ ఉమ్మడి అమ్రాబాద్ మండలం ఏజెన్సీ గ్రామాలలో ప్రాథమిక పాఠశాల విద్య దెబ్బతిని అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి.
మారుమూల పాఠశాలలో విద్య ప్రమాదంలోకి..?
ఉమ్మడి అమ్రాబాద్ మండలంలో ఉపాధ్యాయులు ఇంటీరియర్, గిరిజన ప్రాంతాలు, ప్రభుత్వ పాఠశాలల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయులను వివిధ మండలాలకు డిప్యూటేషన్ పై పంపించడం వల్ల ఆయా పాఠశాలల్లో విద్యాబోధన తీవ్రంగా దెబ్బతింటోందని స్థానికులు, విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అందుకు నిదర్శనం అమ్రాబాద్ మండలం ఎంపీపీఎస్ పాతాళగంగలో పనిచేస్తున్న వాసంతిని పెద్దకొత్తపల్లి మండలానికి, జంగారెడ్డిపల్లిలో పనిచేస్తున్న ఎల్‌ఎఫ్‌ఎల్ హెచ్‌ఎం మమతాబాయిని వంగూరు మండలానికి, బీకే తిరుమలాపూర్ లో విధులు నిర్వహిస్తున్న శ్రావణిని వెల్దండ మండలానికి, పదర మండలం మద్దిమడుగులో పనిచేస్తున్న స్వాతిని బిజినపల్లి మండలానికి, మారడుగులలో పనిచేస్తున్న లావణ్యను కల్వకుర్తి మండలానికి డిప్యూటేషన్ పై పంపడంతో సంబంధిత పాఠశాలల్లో ఉపాధ్యాయుల కొరత ఏర్పడింది. ఇదే సమయంలో ఝాన్సీ ప్రసూతి సెలవులో ఉండటంతో పరిస్థితి మరింత క్లిష్టంగా మారింది.
పై పాఠశాలల్లో ఉన్న ఉపాధ్యాయులు డిప్యూటేషన్ బదిలీ పై వెళ్లడంతో ఈ పరిస్థితుల్లో ఇప్పలపల్లి ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో విధులు నిర్వహిస్తున్న నారాయణమ్మను మద్దిమడుగు, జయమ్మను మారడుగు పాఠశాలకు అధికారులు అడ్జస్ట్‌మెంట్ చేయాల్సి వచ్చింది. మరోవైపు హరిలాల్, లక్ష్మణ్, బిక్కు శాంతి, కమల, మధు, కిషన్ తదితరులు విద్యా సెలవుల్లో ఉండటంతో పలు పాఠశాలల్లో విద్యార్థులకు సక్రమంగా బోధన అందడం లేదని గ్రామస్థులు తెలిపారు. ఈ సమస్యను పలుమార్లు విద్యాశాఖ అధికారుల దృష్టికి తీసుకెళ్లినా ఇప్పటివరకు పరిష్కారం లభించలేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు.
డిప్యూటేషన్ రద్దు చేయాలి...
కావున అచ్చంపేట నియోజకవర్గంలోని ఏజెన్సీ ప్రాంతాలలో పనిచేస్తూ ఇతర ప్రాంతాలకు ఉపాధ్యాయుల డిప్యూటేషన్‌లను రద్దు చేసి, ఉపాధ్యాయులను వారి అసలు పోస్టింగ్ ఉన్న పాఠశాలల్లో తిరిగి విధుల్లో చేర్చాలని, మారుమూల గిరిజన, ఆదివాసీ, ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు నాణ్యమైన విద్య అందేలా ప్రభుత్వం, విద్యాశాఖ అధికారులు తక్షణ చర్యలు తీసుకోవాలని స్థానికులు, తల్లిదండ్రులు డిమాండ్ చేశారు.
రాక ముందు ఒక లెక్క వచ్చినంక మరో లెక్క..
ఏజెన్సీ ప్రాంతాల్లో ఉద్యోగాలు వచ్చేవరకు ఒక లెక్క.. వచ్చిన తర్వాత మరో లెక్క అనే విధంగా ఉపాధ్యాయుల తీరు ఉందని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. వారికున్న పలుకుబడితో కొద్దికాలం పాటు ఉద్యోగం వచ్చిన ప్రదేశంలో విధులు నిర్వహించి తదుపరి వారికి నచ్చిన ప్రదేశాలకు వివిధ కారణాలను చూపుతూ డిప్యూటేషన్ పై వెళుతూ ఏజెన్సీ ప్రాంతాల విద్యార్థులకు తీరని అన్యాయం చేస్తున్నారని విద్యావంతులు మేధావులు ఏజెన్సీ ప్రాంతాల ప్రజలు ఉపాధ్యాయుల పై అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు.
కలెక్టర్ ప్రత్యేక దృష్టి సారించాలి...
అచ్చంపేట నియోజకవర్గంలోని ఏజెన్సీ ప్రాంతాల్లో విధులు నిర్వహిస్తున్న ఉపాధ్యాయులు డిప్యూటేషన్ పై ఇతర ప్రాంతాలకు వెళ్లిన వారిని తిరిగి వారు ఉద్యోగం చేస్తున్న ప్రాంతాలకు తక్షణమే వచ్చేలా జిల్లా కలెక్టర్ తగిన చర్యలు తీసుకోవాలని బాలల హక్కుల రాష్ట్ర కన్వీనర్ బియాని వెంకటేష్ కోరారు. అలాగే డిప్యూటేషన్ విధానాన్ని వెంటనే విధానాన్ని రద్దుచేసి ఏజెన్సీ ప్రాంతాల్లో విద్యాప్రమాణాలు పూర్తిగా అడుగంటి పోకుండా ఉండేందుకు, విద్యార్థులకు నాణ్యమైన విద్య అందేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.






