వివాహితులు సహజీవనం చేస్తే 5 ఏళ్ల జైలు.. యూసీసీకి మధ్యప్రదేశ్ కేబినెట్ ఆమోదం

by I. Sairam |

యూసీసీకి మధ్యప్రదేశ్ కేబినేట్ ఆమోదం తెలిపింది. దీని ప్రకారం వివాహితులు సహజీవనం చేస్తే ఐదేళ్ల జైలు శిక్ష విధిస్తారు.

వివాహితులు సహజీవనం చేస్తే 5 ఏళ్ల జైలు.. యూసీసీకి మధ్యప్రదేశ్ కేబినెట్ ఆమోదం
X

దిశ, నేషనల్ బ్యూరో : మధ్యప్రదేశ్ కేబినెట్ ఉమ్మడి పౌర స్మృతి (యూసీసీ) ముసాయిదా బిల్లుకు ఏకగ్రీవంగా ఆమోదం తెలిపింది. సీఎం మోహన్ యాదవ్ అధ్యక్షతన భోపాల్‌లోని జగదీష్‌పురాలో ఆదివారం జరిగిన ప్రత్యేక సమావేశంలో ఈ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ కొత్త చట్టం వివాహం, ఆస్తి వారసత్వం, సహజీవనం, మత స్వేచ్ఛ వంటి విషయాలలో అందరికీ సమాన హక్కులను కల్పిస్తుందని ప్రభుత్వం స్పష్టం చేసింది. అయితే రక్షిత ప్రాంతాలలో నివసించే షెడ్యూల్డ్ తెగలు (ఎస్టీలు), అత్యంత వెనుకబడిన గిరిజన సమూహాలకు (పీవీటీజీలు) ఈ చట్టం పరిధి నుండి మినహాయింపు ఇచ్చింది. కొత్త నిబంధనల ప్రకారం.. వివాహమైన పురుషుడు లేదా స్త్రీ మరొకరితో సహజీవనం చేస్తే వారికి 5 ఏళ్ల వరకు జైలు శిక్ష పడే అవకాశం ఉంది.

రాముడైనా, రహీమ్ అయినా అందరికీ సమాన హక్కులే : సీఎం

ఈ సమావేశం అనంతరం సీఎం మోహన్ యాదవ్ మాట్లాడుతూ.. రాముడైనా, రహీమ్ అయినా, అందరికీ సమాన హక్కులు కల్పించడానికే యూసీసీని తీసుకువచ్చామని ప్రకటించారు. ఈ కొత్త చట్టం వివాహం, ఆస్తి, సహజీవనం, మత స్వేచ్ఛకు సంబంధించి స్పష్టమైన నిబంధనలను నిర్దేశిస్తుందని వెల్లడించారు. ఎవరి మతాచారాలను, పూజా విధానాలను వారు ఎలాంటి బలవంతం లేకుండా అనుసరించేలా మత స్వేచ్ఛను రక్షించామని, ఏ మతాన్ని కూడా తక్కువ చేసి చూపలేదని ఆయన స్పష్టం చేశారు. కాగా.. యూసీసీ ప్రకారం భార్య లేదా భర్త బతికి ఉండగా ఒకే ఒక వివాహానికి అనుమతి ఉంటుంది. చట్టపరమైన పద్ధతులు, కోర్టు ద్వారానే విడాకులు చెల్లుబాటు అవుతాయి. పంచాయతీల నుండి మున్సిపల్ కార్పొరేషన్ల వరకు అన్ని స్థాయిలలో వివాహాల నమోదు తప్పనిసరిగా చేయాలి. ఆస్తి, వారసత్వ విషయాలలో కుమారులు, కూతుర్లకు సమాన హక్కులు ఉంటాయి. గతంలో మహిళలకు సగం వాటా మాత్రమే ఇచ్చే నిబంధనల స్థానంలో దీనిని తీసుకువచ్చారు. అయితే సహజీనం చేసే సాధారణ జంటలు తాము కలిసి ఉంటున్న ఒక నెల రోజుల్లోగా జిల్లా రిజిస్ట్రార్ వద్ద పేరు నమోదు చేసుకోవడం తప్పనిసరి చేశారు.

Next Story