- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
7 నెలల చిన్నారిపై హత్యాయత్నం కేసు ఛేదించిన బీర్కూర్ పోలీసులు
బీర్కూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో 7 నెలల చిన్నారి వైష్ణవిపై జరిగిన హత్యాయత్నం కేసును పోలీసులు ఛేదించారు.

దిశ, బాన్సువాడ : బీర్కూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో 7 నెలల చిన్నారి వైష్ణవిపై జరిగిన హత్యాయత్నం కేసును పోలీసులు ఛేదించారు. ఈ కేసులో చిన్నారి తండ్రి టేకు సతీష్, సవతి తల్లి సంకు శైలజను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించినట్లు బాన్సువాడ డీఎస్పీ విఠల్ రెడ్డి తెలిపారు. డీఎస్పీ వెల్లడించిన వివరాల ప్రకారం.. ఈ నెల 15వ తేదీ ఉదయం చిన్నారి ఇంట్లో కనిపించకపోవడంతో కుటుంబ సభ్యులు గాలించగా, ఇంటి సమీపంలోని ముళ్లపొదల్లో తీవ్ర గాయాలతో అపస్మారక స్థితిలో కనిపించింది. చిన్నారిని తొలుత బాన్సువాడ ప్రభుత్వ ఆసుపత్రికి, అనంతరం నిజామాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్‌లోని నిలోఫర్ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం అక్కడ చికిత్స కొనసాగుతోంది.ఈ ఘటనపై చిన్నారి తల్లి సంధ్య ఫిర్యాదు మేరకు బీర్కూర్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
దర్యాప్తులో వెలుగులోకి వచ్చిన వాస్తవాలు..
దర్యాప్తులో టేకు సతీష్‌కు మొదటి భార్య శైలజతో ముగ్గురు పిల్లలు ఉన్నట్లు, అనంతరం శైలజ చెల్లెలైన సంధ్యను రెండో వివాహం చేసుకుని వైష్ణవికి తండ్రి అయినట్లు పోలీసులు గుర్తించారు. అనంతరం సంధ్యతో విడిపోయిన సతీష్ వద్దే చిన్నారి వైష్ణవి ఉండేది. చిన్నారిని పోషించడం భారంగా మారిందనే భావనతో పాటు కుటుంబ విభేదాల నేపథ్యంలో చిన్నారిని అడ్డుతొలగించుకోవాలని సతీష్, శైలజ కుట్ర పన్నినట్లు విచారణలో తేలిందని డీఎస్పీ తెలిపారు. ఈ నెల 14వ తేదీ అర్ధరాత్రి ఇంటి బయట నిద్రిస్తున్న చిన్నారిని ఇద్దరూ తీసుకెళ్లి, సీసీ రోడ్డుపై ఈడ్చుకుంటూ కొంత దూరం తీసుకెళ్లి గడ్డి ఉన్న ప్రాంతంలో పడుకోబెట్టి, వెంట తీసుకెళ్లిన బ్లేడ్లతో శరీరంపై పలుచోట్ల గాయాలు చేసినట్లు విచారణలో వెల్లడైంది. చిన్నారి ఏడుపు ఆగిపోవడంతో చనిపోయిందని భావించి అక్కడే వదిలేసి ఇంటికి వెళ్లినట్లు నిందితులు ఒప్పుకున్నారని పోలీసులు తెలిపారు. మరుసటి రోజు ఉదయం చిన్నారి కనిపించడం లేదని గ్రామ పెద్దలకు సమాచారం ఇచ్చి, గ్రామస్తులతో కలిసి వెతుకుతున్నట్లు నాటకం ఆడారని పోలీసులు వెల్లడించారు. తొలుత కుక్కలు చిన్నారిని ఎత్తుకెళ్లి ఉంటాయని నమ్మించే ప్రయత్నం చేసినప్పటికీ, పోలీసుల లోతైన దర్యాప్తులో అసలు విషయం బయటపడిందన్నారు. నిందితులు టేకు సతీష్, సంకు శైలజలను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించినట్లు డీఎస్పీ విఠల్ రెడ్డి తెలిపారు. ప్రస్తుతం చిన్నారి హైదరాబాద్‌లోని నిలోఫర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది.






