- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఘోర ప్రమాదం: టన్నెల్‌లో కొండచరియలు విరిగిపడి ఏడుగురు మృతి
సిక్కింలోని నామ్చీ జిల్లాలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. టన్నెల్ లో కొండచరియలు విరిగిపడి ఏడుగురు కార్మికులు మృతి చెందారు.

దిశ, వెబ్‌డెస్క్: సిక్కింలోని నామ్చీ జిల్లాలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. నిర్మాణంలో ఉన్న ఒక టన్నెల్ (సొరంగం)లో కొండచరియలు విరిగిపడటంతో పాటు గ్యాస్ లీకేజీ సంభవించిన ఘోర ప్రమాదంలో కనీసం ఏడుగురు ప్రాణాలు కోల్పోయారు. లోపల ఇంకా పలువురు కార్మికులు చిక్కుకుపోయినట్లు తెలుస్తోంది. సోమవారం మధ్యాహ్నం నామ్చీ జిల్లాలోని సమర్‌డంగ్, జోలుంగే పరిధిలో నిర్మాణంలో ఉన్న టన్నెల్‌లో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ప్రమాద సమయంలో సొరంగం లోపల సుమారు 27 మంది వరకు కార్మికులు చిక్కుకుపోయి ఉండవచ్చని అధికారులు ప్రాథమికంగా భావిస్తున్నారు.
ప్రమాద ఘటనపై నామ్చీ జిల్లా సమాచార, పౌర సంబంధాల శాఖ అధికారిక ప్రకటన విడుదల చేసింది. ఇప్పటివరకు ఏడుగురు మరణించినట్లు జిల్లా యంత్రాంగం అధికారికంగా ధృవీకరించిందని వెల్లడించింది. మృతదేహాలను సింగ్తామ్ జిల్లా ఆసుపత్రి, గ్యాంగ్‌టక్‌లోని ఎస్‌టీఎన్‌ఎమ్ (STNM) ఆసుపత్రి, నామ్చీ జిల్లా ఆసుపత్రులకు తరలించారు. ఘటనా స్థలంలో ఎన్డీఆర్‌ఎఫ్ (NDRF), ఎస్‌డీఆర్‌ఎఫ్ (SDRF), సిక్కిం పోలీసులు, అగ్నిమాపక & అత్యవసర సేవల సిబ్బంది, ఆరోగ్య శాఖ, ఇతర విభాగాలు సంయుక్తంగా భారీ రెస్క్యూ ఆపరేషన్‌ను నిర్వహిస్తున్నాయి.
ప్రమాదంపై నామ్చీ జిల్లా కలెక్టర్ అనూపా తామ్లింగ్ మాట్లాడుతూ.. సొరంగంలో దాదాపు 27 మంది కార్మికులు చిక్కుకుపోయి ఉండే అవకాశం ఉందన్నారు. అయితే లోపలి పరిస్థితిపై పూర్తి వివరాలు ఇంకా లభించకపోవడంతో ఖచ్చితమైన సంఖ్యను ధృవీకరించలేకపోతున్నామన్నారు. ఎన్డీఆర్‌ఎఫ్ బృందం లోపలికి వెళ్లి తిరిగి వచ్చిన తర్వాతే ఎంతమంది ఉన్నారు? వారి పరిస్థితి ఎలా ఉందనే దానిపై పూర్తి స్పష్టత వస్తుందని తెలిపారు. ప్రమాదానికి గల ఖచ్చితమైన కారణాలు ఇంకా తెలియాల్సి ఉందని, పూర్తి సమాచారం తెలిసిన వెంటనే తదుపరి వివరాలను వెల్లడిస్తామని అధికారులు తెలిపారు.






