కౌలు రైతుకు గుర్తింపు ఏది..!

by Ratna Kumari |

ఆరుగాలం శ్రమించి పంటలు సాగు చేస్తున్న కౌలు రైతులకు ప్రభుత్వ గుర్తింపు ఇప్పటికీ అందని ద్రాక్షగానే మిగిలిందనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

కౌలు రైతుకు గుర్తింపు ఏది..!
X

దిశ, కామారెడ్డి : ఆరుగాలం శ్రమించి పంటలు సాగు చేస్తున్న కౌలు రైతులకు ప్రభుత్వ గుర్తింపు ఇప్పటికీ అందని ద్రాక్షగానే మిగిలిందనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. వానాకాలం సాగు ప్రారంభమైనా పంట రుణాలు, పెట్టుబడి సాయం, రాయితీలు, యూరియా వంటి సదుపాయాలు అందక కౌలు రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

గుర్తింపు కార్డులే లేవు.. రైతు భరోసా కూడా అందని దూరం..

జిల్లాలో 20 వేలకు పైగా కౌలు రైతులు ఉన్నట్లు అంచనా. ప్రభుత్వం 2011 నుంచి కౌలుదారు రక్షిత చట్టాన్ని అమలు చేస్తున్నప్పటికీ, ఆచరణలో ఆశించిన ఫలితాలు కనిపించడం లేదని రైతు సంఘాలు పేర్కొంటున్నాయి. గతంలో 10,300 మంది కౌలు రైతులకు గుర్తింపు కార్డులు జారీ చేసినప్పటికీ, వారిలో స్వల్ప సంఖ్యలోనే పంట రుణాలు పొందినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం కౌలు రైతుల సంఖ్య గణనీయంగా పెరిగినా, కొత్తగా గుర్తింపు కార్డుల జారీ ప్రక్రియ నిలిచిపోయిందని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. భూమి యజమానులు తమ భూములను కౌలుకు ఇచ్చినట్లు అధికారికంగా ధ్రువీకరించేందుకు ముందుకు రాకపోవడంతో కౌలు రైతులు ప్రభుత్వ పథకాలకు దూరమవుతున్నారని చెబుతున్నారు. ఎకరాకు రూ.6 వేల పెట్టుబడి సాయం అందించే రైతు భరోసా వంటి పథకాల ప్రయోజనాలు కూడా వారికి అందడం లేదని వాపోతున్నారు.

బ్యాంకు రుణాలు అందక.. వడ్డీ వ్యాపారులే ఆశ్రయం..

భూమిపై యాజమాన్య హక్కు లేకపోవడంతో కౌలు రైతులకు బ్యాంకులు పంట రుణాలు మంజూరు చేయడం లేదని రైతులు చెబుతున్నారు. దీంతో అధిక వడ్డీకి ప్రైవేట్ అప్పులు తీసుకుని సాగు చేయాల్సిన పరిస్థితి నెలకొంది. ప్రస్తుతం పత్తి సాగుకు ఎకరాకు రూ.15 వేల నుంచి రూ.25 వేల వరకు, వరి సాగుకు రూ.12 వేల నుంచి రూ.15 వేల వరకు కౌలు చెల్లించాల్సి వస్తోందని రైతులు పేర్కొంటున్నారు. దీనికి తోడు విత్తనాలు, ఎరువులు, కూలీల ఖర్చులు పెరగడంతో పెట్టుబడి భారం మరింత అధికమవుతోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

పంటపైనే హక్కు.. నష్టం మాత్రం రైతుదే..

అధికారిక నిబంధనల ప్రకారం కౌలుదారుకు భూమిపై కాకుండా పంటపై మాత్రమే హక్కు ఉంటుందని చెబుతున్నారు. అయితే అతివృష్టి, అనావృష్టి వంటి కారణాలతో పంట నష్టపోయినప్పుడు పరిహారం అందడంలోనూ ఇబ్బందులు ఎదురవుతున్నాయని రైతులు ఆరోపిస్తున్నారు. పంట నష్టంతో తీసుకున్న అప్పులు తీర్చలేక ఆర్థిక ఒత్తిడికి గురవుతున్న కౌలు రైతుల పరిస్థితి ఆందోళన కలిగిస్తోందని రైతు సంఘాలు పేర్కొంటున్నాయి.

యూరియా కోసం కూడా ఇబ్బందులే..

వానాకాలం సాగు ప్రారంభమైనప్పటికీ యూరియా, విత్తనాలు, ఇతర వ్యవసాయ ఇన్‌పుట్లు సకాలంలో అందుబాటులో లేక ఇబ్బందులు పడుతున్నామని రైతులు చెబుతున్నారు. మార్కెట్‌లో గంటల తరబడి క్యూలలో నిల్చున్నా సరిపడా ఎరువులు దొరకడం లేదని, రాయితీలు లేకపోవడంతో అధిక ధరలకు కొనుగోలు చేయాల్సి వస్తోందని వాపోతున్నారు.

తక్షణ చర్యలు తీసుకోవాలని రైతు సంఘాల డిమాండ్..

ప్రస్తుత పరిస్థితుల్లో కౌలు రైతులు వ్యవసాయాన్ని వదిలి వలస వెళ్లే పరిస్థితి ఏర్పడుతోందని రైతు సంఘాల నాయకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం వెంటనే జిల్లాలో కౌలు రైతుల సమగ్ర సర్వే నిర్వహించి గుర్తింపు కార్డులు జారీ చేయాలని, రైతు భరోసా, పంట రుణాలు, బీమా వంటి పథకాల్లో వారికి అవకాశం కల్పించాలని డిమాండ్ చేస్తున్నారు. వ్యవసాయ, రెవెన్యూ, బ్యాంకింగ్ శాఖలు సమన్వయంతో పనిచేసి కౌలు రైతులకు న్యాయం చేయాలని కోరుతున్నారు. ప్రభుత్వం స్పందించకపోతే పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతామని రైతు సంఘాలు హెచ్చరిస్తున్నాయి.

Next Story