Robot: కేరళ వీధుల్లో ‘మర మనిషి’ హల్‌చల్.. నెట్టింట వైరల్

by Ramesh Naini |   (  Updated:2026-02-11 14:40:45  IST  )

సైన్స్ ఫిక్షన్ సినిమాల్లో మాత్రమే కనిపించే రోబోలు ఇప్పుడు సామాన్యుల మధ్య తిరుగుతూ ఆశ్చర్యపరుస్తున్నాయి.

Robot: కేరళ వీధుల్లో ‘మర మనిషి’ హల్‌చల్.. నెట్టింట వైరల్
X

దిశ, డైనమిక్ బ్యూరో: సైన్స్ ఫిక్షన్ సినిమాల్లో మాత్రమే కనిపించే రోబోలు ఇప్పుడు సామాన్యుల మధ్య తిరుగుతూ ఆశ్చర్యపరుస్తున్నాయి. కేరళలోని పాలక్కాడ్ జిల్లా కంజిరప్పుజ సమీపంలోని చిరక్కల్పడిలో ఒక హ్యూమనాయిడ్ రోబోట్ (మర మనిషి) సందడి చేసింది. కేవలం నడవడమే కాకుండా, స్థానిక ప్రజలతో ముచ్చటిస్తూ అందరినీ అబ్బురపరిచింది. ఈ రోబోట్ చైనాకు చెందిన ప్రముఖ కంపెనీ యూనిట్రీ రోబోటిక్స్ (Unitree Robotics) తయారు చేసిన 'Unitree G1' మోడల్. ఇది అధునాతన సాంకేతికతతో పనిచేసే హ్యూమనాయిడ్ రోబోట్. దీనిని ప్రచార కార్యక్రమాల్లో భాగంగా (Promotion) ప్రజల మధ్యకు తీసుకువచ్చారు.

రోబోట్ చేసిన పనులు ఇవే..

సోషల్ మీడియాలో వైరల్ వీడియో ప్రకారం.. రోబోట్ ఒక సాధారణ మనిషిలాగా రోడ్ల వెంట నడిచింది. కనిపించిన ప్రతి ఒక్కరి ముందు చేతులు చాచింది. ఒక చేపల వ్యాపారి వద్దకు వెళ్లి, సాధారణ కస్టమర్‌లా చేపలు అడగడం స్థానికులను నవ్వుల్లో ముంచెత్తింది. బస్సు కోసం వేచి ఉన్న ప్రయాణికులకు 'హాయ్' చెప్పడం, ఫ్లయింగ్ కిస్సులు ఇవ్వడం వంటి చేష్టలతో అందరినీ ఆకర్షించింది. మరోవైపు మనిషిలాగే అందరికీ షేక్ హ్యాండ్ ఇవ్వడంతో స్థానిక ప్రజలు దీన్ని ఆసక్తిగా చూడసాగారు.

బ్యాటరీతో పనిచేసే రోబోట్

కాగా, ఈ రోబోట్ పూర్తిగా బ్యాటరీతో పనిచేస్తుంది. దీనికి ఎటువంటి ప్రత్యేక లైసెన్స్‌లు అవసరం లేదని, వినోదం, ప్రమోషన్ కోసం దీనిని రూపొందించారని దీనిని అక్కడికి తీసుకొచ్చిన ప్రతినిధులు తెలిపారు. రాబోయే రోజుల్లో ఇటువంటి రోబోలు ఇంటి పనుల్లో కూడా సహాయపడే అవకాశం ఉందని వారు పేర్కొన్నారు. ప్రస్తుతం ఈ 'యంత్ర మనిషి'కి సంబంధించిన వీడియోలు నెట్టింట వైరల్ అవుతుండటంతో, కేరళలో టెక్నాలజీ ఏ స్థాయిలో దూసుకుపోతుందోనని నెటిజన్లు చర్చించుకుంటున్నారు.

‘బాయ్‌ఫ్రెండ్ వస్తున్నాడు.. కండోమ్స్ కావాలి’.. బైక్ టాక్సీ రైడర్‌కు యువతి వింత రిక్వెస్ట్!

Next Story