బెంగాల్ ఎన్నికల్లో హింస..చాప్రలో బీజేపీ పోలింగ్ ఏజెంట్‌పై రాడ్లతో దాడి

by Malleboina Mahesh |   (  Updated:2026-04-29 06:22:51  IST  )

బెంగాల్ ఎన్నికల్లో రక్తపాతం! నదియా జిల్లా చాప్రలో బీజేపీ పోలింగ్ ఏజెంట్‌పై రాడ్లతో దాడి. తలకు ఆరు కుట్లు.. టీఎంసీపై బీజేపీ ఆరోపణలు.

బెంగాల్ ఎన్నికల్లో హింస..చాప్రలో బీజేపీ పోలింగ్ ఏజెంట్‌పై రాడ్లతో దాడి
X

దిశ, వెబ్ డెస్క్: పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల చివరి దశ పోలింగ్ ఓ పక్క పండగ వాతావరణంలో కొనసాగుతోంది. కానీ మరోపక్క మాత్రం హింస చెలరేగి.. ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. నదియా జిల్లాలోని చాప్ర నియోజకవర్గంలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. బుధవారం తెల్లవారుజామున సుమారు 5:30 గంటల సమయంలో, హత్రా పంచాయతీ పరిధిలోని బూత్ నెంబర్ 53 కు వెళ్తున్న బీజేపీ పోలింగ్ ఏజెంట్ మొషార్రఫ్ మీర్‌పై కొందరు దుండగులు ఇనుప రాడ్లు, కర్రలతో దాడికి పాల్పడ్డారు.

తృణమూల్ కాంగ్రెస్ (TMC) కి చెందిన సుమారు 15 నుంచి 20 మంది వ్యక్తులు తుపాకులతో బెదిరిస్తూ తనను దారుణంగా కొట్టారని, ఈ దాడిలో తన తలకు తీవ్ర గాయాలయ్యాయని బాధితుడు ఆరోపించారు. పోలీసులు వెంటనే స్పందించి బాధితుడిని రక్షించి, చికిత్స నిమిత్తం చాప్ర గ్రామీణ ఆసుపత్రికి తరలించారు. ఈ దాడిలో మొషార్రఫ్ మీర్ తలకు ఆరు కుట్లు పడ్డాయి.

ఈ ఘటనపై బీజేపీ ఎంపీ జగన్నాథ్ సర్కార్ తీవ్రంగా స్పందించారు. చాప్ర వంటి మైనారిటీ ప్రాబల్య ప్రాంతాల్లో టీఎంసీ అండతో గూండాయిజం సాగుతోందని, తమ పార్టీ ఏజెంట్లను బూత్‌లలో ఉండనివ్వకుండా భయభ్రాంతులకు గురిచేస్తున్నారని ఆయన మండిపడ్డారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. అయితే, ఈ ఆరోపణలను టీఎంసీ నేతలు తోసిపుచ్చారు. మరోవైపు, ఈ హింసాత్మక ఘటనల మధ్యే నదియా జిల్లాలో ఉదయం 9 గంటల వరకు 18.50 శాతం పోలింగ్ నమోదైంది. పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చేందుకు ఎన్నికల అధికారులు ఆ ప్రాంతంలో అదనపు బలగాలను మోహరించారు.

బెంగాల్ ఎన్నికల క్లైమాక్స్.. 11 గంటలకే 39.97% పోలింగ్ నమోదు

Next Story