- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
అందెశ్రీ పాట స్ఫూర్తితో రాష్ట్రానికి సీఎం అయ్యాను : సీఎం రేవంత్ రెడ్డి
ప్రజా కవి, గేయ రచయిత అందెశ్రీ స్ఫూర్తితో ఈ రాష్ట్రానికి సీఎం అయ్యానని ముఖ్యమంత్రి అనుముల రేవంత్ రెడ్డి అన్నారు.

దిశ, ఘట్కేసర్ : ప్రజా కవి, గేయ రచయిత అందెశ్రీ స్ఫూర్తితో ఈ రాష్ట్రానికి సీఎం అయ్యానని ముఖ్యమంత్రి అనుముల రేవంత్ రెడ్డి అన్నారు. మేడ్చల్-మల్కాజ్‌గిరి జిల్లా ఘట్‌కేసర్ లో తెలంగాణ రాష్ట్ర గేయ రచయిత, ప్రజాకవి అందెశ్రీ స్మృతి వనం, విగ్రహ ఏర్పాటుకు శనివారం సీఎం శంకుస్థాపన చేశారు. ఆ తర్వాత ఏర్పాటు చేసిన సభలో సీఎం మాట్లాడుతూ గత పాలకులు కవులు, కళాకారులను అనచివేయాలని చూస్తే కాంగ్రెస్ ప్రభుత్వం 9 మంది కవులను సన్మానించి రూ.కోటి ఆర్థిక సహాయం అందజేసిందని తెలిపారు. జయహే తెలంగాణ గేయంతో 4 కోట్ల తెలంగాణ ప్రజలను చైతన్యవంతులను చేసిన అందెశ్రీ తనకు ఆత్మబంధువని చెప్పారు.
నోటిఫికేషన్లతో కోట్లు గడించారు...
తెలంగాణ సెంటిమెంటుతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకున్న కేసీఆర్ కుటుంబం నోటిఫికేషన్ లో ఇచ్చి ప్రశ్నపత్రాలను జిరాక్స్ సెంటర్లలో కోట్ల రూపాయలకు అమ్ముకొని శ్రీమంతులయ్యారని ఆరోపించారు. వందల ఎకరాల్లో ఒక్కొక్కరు ఫాం హోజులు నిర్మించుకొని తెలంగాణకు ఏమి ఇచ్చారు అని ప్రశ్నించారు. తెలంగాణకు 8 లక్షల కోట్ల అప్పులు చేసి ఫామ్ హౌస్ లకే పరిమితమయ్యారన్నారు. తెలంగాణ సమాజం ప్రతి ఒక్కరిని పరిశీలిస్తుందని, మరోసారి తెలంగాణలో ప్రభుత్వం ఏర్పాటు చేస్తామని అహంకారపూరితమైన ప్రకటనలు చేస్తున్న వారికి తెలంగాణ ప్రజలు మరోసారి బుద్ధి చెబుతారని అన్నారు. పదహారేళ్ల పాటు ఉద్యోగాల కోసం కోచింగ్ సెంటర్లలో కాలం వెలుబుచ్చిన యువతకు దాదాపు 70 వేల ఉద్యోగాలను భర్తీ చేశామని తెలిపారు.
కవులను, కళాకారులను నిర్బంధించాలని చూశారు...
తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఆటపాటలతో, గేయాలతో ఉద్యమించిన గద్దర్, అందెశ్రీలను తమ నిర్బంధంలో పెట్టుకోవాలని చేసిన ప్రయత్నాలు, అహంకారాలను అందెశ్రీ పాటలు తూటాలై పేలి తెలంగాణ సమాజాన్ని చైతన్యం చేసిందని చెప్పారు. అందుకే అందెశ్రీ రచించి పాడిన జయహే తెలంగాణ గీతాన్ని రాష్ట్ర గీతంగా తెలంగాణ అవతరణ దినోత్సవం నాడు ప్రకటించడం అంటే కళాకారులను గౌరవించుకున్నట్లేనని అన్నారు. తెలంగాణ ఉద్యమంలో ప్రాణాలు కోల్పోయిన శ్రీకాంత చారితో పాటు ప్రాణాలు కోల్పోయిన ఉద్యమకారుల కుటుంబాన్ని ఏనాడైనా పలకరించారా అని ప్రశ్నించారు. తెలంగాణ ఉద్యమకారులను గౌరవించి గుర్తించి వారికి ఎమ్మెల్సీ పదవులను కూడా ఇచ్చినట్లు తెలిపారు.
2034 వరకు ప్రజాపాలన కొనసాగుతుంది...
కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా నెరవేర్చుకుంటూ వస్తుందని, ప్రజాసంక్షేమం కోసం మంత్రులు, ఎమ్మెల్యేలు, కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు కృషి చేస్తున్నారని అన్నారు. ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని దిగిపోవాలని అవాక్కులు, చెవాకులు పేలుతున్న కేసీఆర్ కుటుంబం తెలంగాణలో ప్రభుత్వం ఏర్పాటు చేసి రాష్ట్రాన్ని దోచుకోవాలని చూస్తున్నారని ఆరోపించారు. తెలంగాణ ప్రజలు కేసీఆర్ కుటుంబం సభ్యులను క్షమించే పరిస్థితిలో లేరని, గజ్వేల్ లోని వారికి సమాధి కడతారని వ్యాఖ్యలు చేశారు. 2034 వరకు ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రజాపాలన కొనసాగుతుందని జోస్యం చెప్పారు. ప్రసంగం పూర్తయిన తర్వాత అంత శ్రీ కుటుంబ సభ్యులతో కలిసి సీఎం రేవంత్ రెడ్డి ఫోటో దిగారు. ఈ కార్యక్రమంలో ఉపముఖ్యమంత్రి బట్టి విక్రమార్క, మంత్రులు శ్రీధర్ బాబు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, అడ్లూరి లక్ష్మణరావు, పొన్నం ప్రభాకర్, మహేందర్ రెడ్డి, మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి, ఎమ్మెల్సీలు అద్దంకి దయాకర్, బల్మూరి వెంకట్, కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు తోటకూర వజ్రేష్ యాదవ్, మాజీ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రజలు పాల్గొన్నారు.






