ఎల్‌నినో ముప్పు.. విద్యుత్ శాఖ అప్రమత్తంగా ఉండాలి : డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క

by Naga Rani Yarlagadda |

రాష్ట్రంలో ఎల్‌నినో ప్రభావంతో వర్షాభావ పరిస్థితులు తలెత్తి, భవిష్యత్తులో విద్యుత్ డిమాండ్ పెరిగే అవకాశం ఉన్నందున యంత్రాంగం అంతా అప్రమత్తంగా ఉండాలని డిఫ్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క ఆదేశించారు.

ఎల్‌నినో ముప్పు.. విద్యుత్ శాఖ అప్రమత్తంగా ఉండాలి : డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క
X

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలో ఎల్‌నినో ప్రభావంతో వర్షాభావ పరిస్థితులు తలెత్తి, భవిష్యత్తులో విద్యుత్ డిమాండ్ పెరిగే అవకాశం ఉన్నందున యంత్రాంగం అంతా అప్రమత్తంగా ఉండాలని డిఫ్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క ఆదేశించారు. శనివారం హైదరాబాద్‌లోని ఎస్పీడీసీఎల్ కార్యాలయంలో విద్యుత్, సింగరేణి సంస్థల ఉన్నతాధికారులతో ఆయన ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. తాగునీరు, వ్యవసాయ సాగుకు ఆటంకం లేకుండా నిరంతరాయంగా నాణ్యమైన కరెంటు అందించడమే లక్ష్యంగా పనిచేయాలని స్పష్టం చేశారు. బకాయిల వసూళ్లు వేగవంతం చేసి ఆర్థిక క్రమశిక్షణ పాటించాలన్నారు. ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం పలు కీలక నిర్ణయాలు, ఆదేశాలు జారీ చేశారు. రాష్ట్రంలోని అన్ని అంగన్‌వాడీ కేంద్రాలకు దశలవారీగా సోలార్ విద్యుత్ సదుపాయం కల్పించాలని, మిడ్జిల్ మోడల్ సబ్‌స్టేషన్ తరహాలోనే మిగతా వాటిని ఆధునీకరించాలని సూచించారు. ఐటీ కారిడార్లలో ఫ్లైఓవర్ల కింద సబ్‌స్టేషన్ల ఏర్పాటుకు మున్సిపల్ శాఖతో సమన్వయం చేసుకోవాలన్నారు. 108 తరహా పవర్ అంబులెన్స్ సేవలను రాష్ట్రవ్యాప్తంగా విస్తరించాలని, విద్యుత్ శాఖలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ), డీటీఆర్ మ్యాపింగ్ ప్రక్రియను గడువులోగా పూర్తి చేయాలని స్పష్టం చేశారు. గృహజ్యోతి బకాయిలను ప్రభుత్వం పూర్తిగా చెల్లించడం వల్ల డిస్కంల ఆర్థిక పరిస్థితి బలోపేతమైందని అధికారులు ఈ సందర్భంగా మంత్రికి వివరించారు. ఈ సందర్భంగా టీజీఎస్‌పీడీసీఎల్ సీఎండీ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా గత 30 నెలలుగా చేపట్టిన పురోగతి కార్యక్రమాలు, తీసుకొచ్చిన సంస్కరణలు, అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాల గురించి ఉప ముఖ్యమంత్రికి వివరించారు. ఫీడర్-డీటీఆర్-వినియోగదారుల మ్యాపింగ్ ద్వారా విద్యుత్ అంతరాయాలను తక్షణమే గుర్తించి సరఫరాను పునరుద్ధరించడం, ఫిర్యాదుల పరిష్కారం, కచ్చితమైన ఎనర్జీ ఆడిట్ నిర్వహించడం సాధ్యమవుతుందని తెలిపారు.

కొత్త బొగ్గు బ్లాక్‌లను సాధించాలి..

తెలంగాణలో పెరుగుతున్న విద్యుత్ అవసరాలకు అనుగుణంగా సింగరేణి సంస్థ కొత్త బొగ్గు బ్లాక్‌లను సాధించి ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచుకోవాలని భట్టి విక్రమార్క సూచించారు. గత ప్రభుత్వం కొత్త గనుల సాధనలో విఫలమైనందున ప్రస్తుతం ఇబ్బందులు ఎదురవుతున్నాయని విమర్శించారు. మైనింగ్ లీజు లభించిన తాడిచర్ల-2 బ్లాక్‌లో యుద్ధ ప్రాతిపదికన ఉత్పత్తి ప్రారంభించాలని, గతంలో చేజారిన కోయగూడెం-3, సత్తుపల్లి-2 బ్లాక్‌లను తిరిగి సింగరేణికే దక్కేలా కార్యాచరణ చేపట్టాలని ఆదేశించారు. ఈ సమావేశంలో ఇంధన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి నవీన్ మిట్టల్, ఫైనాన్స్ ప్రిన్సిపల్ సెక్రెటరీ సందీప్ కుమార్ సుల్తానియా, టీజీఎస్‌పీడీసీఎల్ సీఎండీ జితేష్ వి పాటిల్, ట్రాన్స్‌కో సీఎండీ కృష్ణ భాస్కర్, సింగరేణి సీఎండీ బుద్ధప్రకాష్ జ్యోతి తదితరులు పాల్గొన్నారు.

Next Story