క్రీడా అకాడమీల్లో ప్రవేశాలకు షెడ్యూల్ విడుదల

by Naga Rani Yarlagadda |

తెలంగాణ క్రీడా ప్రాధికార సంస్థ శాట్ ఆధ్వర్యంలో నడుస్తున్న రాష్ట్రస్థాయి స్పోర్ట్స్ అకాడమీలు,స్పోర్ట్స్ హాస్టళ్లు 2026-27 విద్యా సంవత్సరానికి గాను ప్రవేశాల షెడ్యూల్ ఖరారైంది.

క్రీడా అకాడమీల్లో ప్రవేశాలకు షెడ్యూల్ విడుదల
X
  • ఈ నెల 20 నుంచి 28 వరకు రాష్ట్రవ్యాప్తంగా సెలక్షన్ ట్రయల్స్

దిశ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ క్రీడా ప్రాధికార సంస్థ శాట్ ఆధ్వర్యంలో నడుస్తున్న రాష్ట్రస్థాయి స్పోర్ట్స్ అకాడమీలు,స్పోర్ట్స్ హాస్టళ్లు 2026-27 విద్యా సంవత్సరానికి గాను ప్రవేశాల షెడ్యూల్ ఖరారైంది. రాష్ట్రంలోని ప్రతిభావంతులైన యువ క్రీడాకారులు బాలబాలికలు కోసం ఈ నెల 20వ తేదీ నుంచి 28వ తేదీ వరకు రాష్ట్రవ్యాప్తంగా వివిధ కేంద్రాల్లో సెలక్షన్ ట్రయల్స్ నిర్వహించనున్నట్లు శాట్ శనివారం ఒక ప్రకటనలో తెలిపింది. అర్హులైన వారు నిర్ణీత తేదీల్లో ఆయా వేదికల వద్దకు చేరుకుని ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరింది.

ఎంపికల షెడ్యూల్ ప్రకారం..

జూలై 20న హైదరాబాద్ ఉస్మానియా వర్సిటీ సైక్లింగ్ వెలోడ్రోమ్‌లో బాలురకు సైక్లింగ్, రెజ్లింగ్ ఎంపికలు, సరూర్‌నగర్ అకాడమీలో బాలబాలికలకు వాలీబాల్ ఎంపికలు జరుగుతాయి. జూలై 20, 21 తేదీల్లో గచ్చిబౌలి స్పోర్ట్స్ కాంప్లెక్స్‌లో హాకీ బాలబాలికలు, ఎల్బీ స్టేడియంలో అథ్లెటిక్స్ బాలబాలికలు, హ్యాండ్‌బాల్ బాలురు, ఫుట్‌బాల్ బాలురు పోటీలు నిర్వహిస్తారు. జూలై 21న ఖమ్మం సర్దార్ పటేల్ స్టేడియంలో అథ్లెటిక్స్ బాలురు, జూలై 22, 23 తేదీల్లో సిద్దిపేటలో వాలీబాల్ బాలబాలికలు, జూలై 25, 26 తేదీల్లో మహబూబ్‌నగర్ ప్రధాన మైదానంలో వాలీబాల్ బాలబాలికలు, కబడ్డీ బాలురు ఎంపికలు ఉంటాయి. జూలై 27, 28 తేదీల్లో హనుమకొండ జేఎన్ స్టేడియంలో ప్రాంతీయ వసతి గృహం కోసం జిమ్నాస్టిక్స్ బాలబాలికలు, స్విమ్మింగ్ బాలురు, అథ్లెటిక్స్ బాలబాలికలు, హ్యాండ్‌బాల్, రెజ్లింగ్ బాలురు విభాగాలకు ట్రయల్స్ నిర్వహిస్తారు.

క్రీడాంశాల వారీగా వయోపరిమితులను శాట్ స్పష్టంగా నిర్దేశించింది. జిమ్నాస్టిక్స్, స్విమ్మింగ్ విభాగాలకు అండర్-10 నుంచి అండర్-12 లోపు వయసు 01-07-2014 నుంచి 30-06-2016 మధ్య జన్మించిన వారు ఉండాలి. అథ్లెటిక్స్, వాలీబాల్, హాకీ, హ్యాండ్‌బాల్, ఫుట్‌బాల్, సైక్లింగ్, రెజ్లింగ్, కబడ్డీ క్రీడలకు అండర్-14 నుంచి అండర్-16 లోపు 01-07-2010 నుంచి 30-06-2012 మధ్య జన్మించిన వారు అర్హులు. సరూర్‌నగర్ వాలీబాల్ అకాడమీలో మాత్రమే అండర్-16 నుంచి అండర్-18 01-07-2008 నుంచి 30-06-2010 మధ్య జననం బాలబాలికలకు ఎంపికలు నిర్వహిస్తారు.

ఈ ఎంపిక ప్రక్రియలో ఎలాంటి అవకతవకలకు తావులేకుండా అత్యంత పారదర్శకంగా నిర్వహించేందుకు శాట్ ప్రత్యేక చర్యలు తీసుకుంది. శాట్ ఉప సంచాలకులు, జిల్లా యువజన క్రీడాధికారులు, కోచ్‌లు, సంబంధిత క్రీడా సంఘాల ప్రతినిధులు, అంతర్జాతీయ క్రీడాకారులతో ప్రత్యేక ఎంపిక కమిటీలను ఏర్పాటు చేసింది. ఎంపిక పోటీలు ముగిసిన వెంటనే ఎంపికైన క్రీడాకారులు, అలాగే వెయిటింగ్ జాబితాను తక్షణమే సమర్పించాలని కన్వీనర్లకు సంస్థ స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది.

Next Story