పోలీస్ రిక్రూట్‌మెంట్ ప్రక్రియ పారదర్శకంగా కొనసాగించాలి : డీజీపీ సీవీ ఆనంద్

by Naga Rani Yarlagadda |

దేశవ్యాప్తంగా పోటీ పరీక్షల ప్రశ్నాపత్రాల లీకేజీలు కలకలం రేపుతున్న ప్రస్తుత తరుణంలో.. తెలంగాణ పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డు లీకేజీకి కూడా తావివ్వకుండా పక్కాగా నియామకాలు చేపడుతోందని రాష్ట్ర డీజీపీ సి.వి. ఆనంద్ ప్రశంసించారు.

పోలీస్ రిక్రూట్‌మెంట్ ప్రక్రియ పారదర్శకంగా కొనసాగించాలి : డీజీపీ సీవీ ఆనంద్
X

దిశ, తెలంగాణ బ్యూరో: దేశవ్యాప్తంగా పోటీ పరీక్షల ప్రశ్నాపత్రాల లీకేజీలు కలకలం రేపుతున్న ప్రస్తుత తరుణంలో.. తెలంగాణ పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డు లీకేజీకి కూడా తావివ్వకుండా పక్కాగా నియామకాలు చేపడుతోందని రాష్ట్ర డీజీపీ సి.వి. ఆనంద్ ప్రశంసించారు. పోలీస్ కొలువుల భర్తీలో పారదర్శకతకు తెలంగాణ రాష్ట్రం దేశానికే ఆదర్శంగా నిలిచిందని ఆయన అన్నారు. పోలీస్ శాఖలోని వివిధ విభాగాల పనితీరుపై నిర్వహిస్తున్న సమీక్షల్లో భాగంగా శనివారం పోలీస్ రిక్రూట్‌మెంట్‌ బోర్డు, పోలీస్ ట్రైనింగ్, పోలీస్ కంప్యూటర్ సర్వీసెస్ విభాగాలపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా నూతన పోలీస్ కమ్యూనికేషన్ సెట్స్‌ను డీజీపీ ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా డీజీపీ మాట్లాడుతూ.. రిక్రూట్‌మెంట్ ప్రక్రియను నిష్పాక్షికంగా కొనసాగించాలని సాంకేతికతను వినియోగించుకుంటూ గతంలో ఉన్న పాత విధానాలకు స్వస్తి పలికి, నేడు పూర్తి స్థాయి సాంకేతిక పరిజ్ఞానంతో నియామకాలు చేపట్టడం హర్షణీయమన్నారు. త్వరలో చేపట్టనున్న నియామక ప్రక్రియను కూడా ఇదే స్థాయిలో విజయవంతంగా పూర్తి చేయాలని స్పష్టం చేశారు. సమావేశంలో బోర్డు చైర్మన్ వి.వి. శ్రీనివాసరావు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా రిక్రూట్‌మెంట్ వివరించారు. 2015 నుంచి 2023 వరకు చేపట్టిన నియామకాలను డీజీపీ దృష్టికి తీసుకెళ్లారు. ముఖ్యంగా 2022 23లో రిక్రూట్‌మెంట్ డ్రైవ్ ద్వారా 16,654 పోస్టులను భర్తీ చేసినట్లు వెల్లడించారు. ఇప్పటివరకు జరిగిన భర్తీలో 95 శాతం కానిస్టేబుళ్లు, 5 శాతం ఎస్సై పోస్టులు ఉన్నాయన్నారు. ఇక 2025కు సంబంధించి 118 అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ పోస్టులు, 1743 డ్రైవర్ ఆపరేటర్లు, ఆర్టీసీకి చెందిన 198 సూపర్‌వైజర్ పోస్టుల భర్తీ ప్రక్రియ కొనసాగుతోందని చైర్మన్ వివరించారు. తొలిసారిగా చేపట్టిన ఫింగర్ ప్రింట్ విభాగంలో 60 పోస్టులకు గాను 57 మంది ఎంపికైనట్లు తెలిపారు. ఆర్‌ఎస్‌ఐ నుంచి సివిల్ ఎస్సైగా, పీసీ నుంచి టీజీఎస్‌పీకి కన్వర్షన్ విధానాలను సమావేశంలో చర్చించారు.

పోలీస్ నియామకాల్లో పారదర్శకత, అభ్యర్థుల సౌలభ్యం కోసం బోర్డు తీసుకొచ్చిన సంస్కరణలను అధికారులు వివరించారు. మహిళలకు 33 1/2 శాతం రిజర్వేషన్ అమలు, శారీరక దారుఢ్య పరీక్షల్లో 5 కి.మీ పరుగును 2.5 కి.మీకు కుదించడం, ఆన్‌లైన్ దరఖాస్తులు, బయోమెట్రిక్ వెరిఫికేషన్, ఆర్ఎఫ్‌ఐడీ టెక్నాలజీ, వన్ ఫోర్త్ నెగెటివ్ మార్కింగ్ వంటి సంస్కరణలు సత్ఫలితాలనిచ్చాయని తెలిపారు. పోలీస్ ట్రైనింగ్, కంప్యూటర్ సర్వీసెస్ విభాగాల పనితీరును సమీక్షించిన డీజీపీ.. వ్యవస్థను మరింత బలోపేతం చేసే దిశగా శిక్షణా ప్రమాణాలను పెంచాలని ఆదేశించారు. ఈ సమావేశంలో సీఐడీ డీజీ చారుసిన్హా, ఐజీ గజరావు భూపాల్, కమ్యూనికేషన్స్ డీఐజీ కిరణ్ కుమారి, ఎస్పీలు రూపేష్, శ్రీనివాస్, పలు పోలీస్ ట్రైనింగ్ కళాశాలల ప్రిన్సిపాల్స్, డీఎస్పీలు పాల్గొన్నారు.

Next Story