రాజకీయాల్లోకి విజయసాయి రెడ్డి రీ ఎంట్రీ!

by Muthe.Rajitha |   (  Updated:2026-04-25 09:10:04  IST  )

మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి మళ్లీ రాజకీయాల్లోకి రీ-ఎంట్రీ ఇస్తున్నట్లు ప్రకటించడం ఏపీ రాజకీయాల్లో పెద్ద చర్చకు దారితీసింది.

రాజకీయాల్లోకి విజయసాయి రెడ్డి రీ ఎంట్రీ!
X

దిశ, వెబ్ డెస్క్ : వైస్సార్సీపీ(YSRCP) స్థాపనలో, ఆ పార్టీ ఎదుగుదలలో అత్యంత కీలక పాత్ర పోషించిన రాజ్యసభ మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి, దాదాపు ఏడాదిన్నర కాలం పాటు రాజకీయాలకు దూరంగా ఉన్న సంగతి తెలిసిందే. తాజాగా ఆయన మళ్లీ రాజకీయాల్లోకి రీ-ఎంట్రీ ఇస్తున్నట్లు ప్రకటించడం ఏపీ రాజకీయాల్లో పెద్ద చర్చకు దారితీసింది. 2025 జనవరిలో తన పదవికి, వైస్సార్సీపీ పార్టీకి రాజీనామా చేయగా.. ఇక ఆయన రాజకీయ సన్యాసం తీసుకుంటున్నట్లు అంతా భావించారు. అయితే అనూహ్యంగా ఆయన 2026 జూలై నుండి మళ్లీ యాక్టివ్ పాలిటిక్స్‌లోకి వస్తానని స్పష్టం చేయడంతో... పొలిటికల్ హీట్ రాజుకుంది. జగన్ మోహన్ రెడ్డికి అత్యంత ఆప్తుడిగా, పార్టీకి వెన్నెముకగా నిలిచిన ఆయన, 2024 ఎన్నికల తర్వాత తలెత్తిన విభేదాల కారణంగా పార్టీకి దూరం కావడం, ఇప్పుడు సొంతంగా ఒక రాజకీయ ఉనికిని చాటుకోవాలని చూడటం ఏపీ రాజకీయ సమీకరణాలను మార్చే అవకాశం ఉంది. తన నివాసంలో ఇటీవల జరిగిన ఈడీ సోదాల అనంతరం ఆయన చేసిన వ్యాఖ్యలు, ప్రత్యర్థి పార్టీలతో పాటు సొంత పాత పార్టీ నాయకుల్లోనూ గుబులు రేపుతున్నాయి.

కొత్త పార్టీకి ప్లాన్!

విజయసాయి రెడ్డి కేవలం రాజకీయాల్లోకి రావడం మాత్రమే కాకుండా, ఒక భారీ మీడియా సామ్రాజ్యాన్ని కూడా స్థాపించబోతున్నట్లు ప్రకటించడం విశేషం. తెలుగు, హిందీ, ఇంగ్లీష్ భాషల్లో డిజిటల్, శాటిలైట్ న్యూస్ ఛానెళ్లను ప్రారంభించి, ప్రజలకు వాస్తవాలను చేరవేస్తానని ఆయన పేర్కొన్నారు. సాధారణంగా రాజకీయ నాయకులు తమ సొంత గొంతుకను వినిపించడానికి మీడియాను ఆశ్రయిస్తారు. అలాగే విజయసాయి రెడ్డి కూడా తన తదుపరి రాజకీయ అడుగులకు ఈ మీడియా ప్లాట్‌ఫామ్‌ను పునాదిగా వాడుకోబోతున్నారని విశ్లేషకులు భావిస్తున్నారు. ముఖ్యంగా ఏపీలో ప్రస్తుతమున్న రాజకీయ శూన్యతను భర్తీ చేయడానికి ఒక కొత్త రాజకీయ శక్తి అవసరమని ఆయన వ్యాఖ్యానించడం చూస్తుంటే, ఆయన కొత్త పార్టీ పెట్టే ఆలోచనలో ఉన్నట్లు స్పష్టమవుతోంది. గతంలో ఆయన బీజేపీలోకి వెళ్తారనే ప్రచారం జరిగినప్పటికీ, చంద్రబాబు నాయుడు అడ్డుకున్నారనే వార్తలు రావడంతో, ఇప్పుడు ఆయన స్వతంత్రంగా ఎదగాలని నిర్ణయించుకున్నట్లు కనిపిస్తోంది.

YSRCP కి భారీ దెబ్బ!

విజయసాయి రెడ్డి రీ-ఎంట్రీ ఇస్తే అది ప్రధానంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పెద్ద దెబ్బ అయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే ఆ పార్టీ సంస్థాగత నిర్మాణం, ఆర్థిక వ్యవహారాలపై ఆయనకు పూర్తి పట్టు ఉంది. ఆయన గనుక కొత్త పార్టీ పెడితే వైసీపీలోని అసమ్మతి నేతలు ఆయన వైపు వెళ్లే అవకాశం లేకపోలేదు. మరోవైపు, అధికార కూటమిలోని లోపాలను ఎండగడతానని ఆయన చేసిన హెచ్చరికలు తెలుగుదేశం, జనసేన పార్టీలకు కూడా సవాలుగా మారవచ్చు. ఏదేమైనా, 2026 జూలైలో కొత్త పార్టీ ప్రకటన, ప్రారంభించబోయే మీడియా ఛానెల్ ఏపీ రాజకీయాల్లో కొత్త అధ్యాయానికి తెరలేపనున్నాయి. జైలు జీవితం నుండి అధికార పీఠం వరకు జగన్ పక్కనే ఉన్న విజయసాయి రెడ్డి, ఇప్పుడు అదే జగన్‌కు ప్రత్యర్థిగా మారుతారా లేక మరేదైనా కొత్త మలుపు తీసుకుంటారా అన్నది వేచి చూడాలి.

విజయసాయిరెడ్డి ఇంట్లో ముగిసిన ఈడీ సోదాలు.. పొలిటికల్ రీ ఎంట్రీపై కీలక వ్యాఖ్యలు

Next Story