- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
విజయసాయిరెడ్డి ఇంట్లో ముగిసిన ఈడీ సోదాలు.. పొలిటికల్ రీ ఎంట్రీపై కీలక వ్యాఖ్యలు
మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి ఇంట్లో ఈడీ సోదాలు ముగిశాయి. ఈ సందర్భంగా ఆయన పొలిటికల్ రీ ఎంట్రీ, కొత్తపార్టీపై కీలక వ్యాఖ్యలు చేశారు.

దిశ, వెబ్ డెస్క్: ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణం (Liquor Scam Case) కేసు విచారణలో భాగంగా వైకాపా మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి (Vijayasai Reddy) నివాసంలో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) అధికారులు నిర్వహించిన సోదాలు ముగిశాయి. హైదరాబాద్‌లోని ఆయన నివాసంలో సుమారు 13 గంటల పాటు ఈ సోదాలు సుదీర్ఘంగా కొనసాగాయి. సోదాల అనంతరం ఆయన మీడియా ముందుకు వచ్చి పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తన నివాసంలో జరిగిన సోదాల్లో ఈడీ అధికారులకు ఏమీ లభించలేదని విజయసాయిరెడ్డి స్పష్టం చేశారు. అధికారులు అడిగిన ప్రశ్నలన్నింటికీ తాను సమాధానం ఇచ్చానని, విచారణకు పూర్తిస్థాయిలో సహకరించానని ఆయన తెలిపారు. అయితే.. ఈ తనిఖీలకు సంబంధించి అధికారులు ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటన విడుదల చేయలేదు.
వైకాపాపై విమర్శలు - జగన్‌కు చురకలు
ఈ సందర్భంగా విజయసాయిరెడ్డి వైసీపీ తీరుపై తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో వైఎస్ జగన్ నేతృత్వంలోని పార్టీకి ప్రజలు సరైన బుద్ధి చెప్పారని ఆయన వ్యాఖ్యానించారు. ఆ పార్టీ నేతలు ఇప్పటికైనా వాస్తవాలను గ్రహించి బుద్ధి తెచ్చుకోవాలని ఘాటుగా విమర్శించారు. ఇకనైనా నాయకులు అహంకారాన్ని వీడి, ప్రజా సమస్యల పరిష్కారంపై దృష్టి పెట్టాలని సూచించారు.
రాజకీయాల్లోకి రీ ఎంట్రీ: కొత్త పార్టీ?
తన రాజకీయ భవిష్యత్తుపై ఆయన క్లారిటీ ఇస్తూ.. జులై నెలలో మళ్లీ క్రియాశీల రాజకీయాల్లోకి వస్తానని ప్రకటించారు. ముఖ్యంగా ఏపీ రాజకీయాల్లో మరో కొత్త రాజకీయ పార్టీ ఆవిర్భవించాల్సిన అవసరం ఉందంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో పెద్ద చర్చకు దారితీశాయి. ఇది ఆయన సొంత పార్టీ పెట్టబోతున్నారనే సంకేతమా? అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. రాజకీయాలతో పాటు త్వరలోనే తాను మీడియా రంగంలోకి కూడా అడుగుపెడుతున్నట్లు విజయసాయిరెడ్డి వెల్లడించారు. రాజకీయాల్లోకి వచ్చాక చంద్రబాబు అవినీతి బాగోతాన్ని ఎండగడుతానని, మళ్లీ అధికారంలోకి వచ్చాక చంద్రబాబు చేసి దుష్టరాజకీయాల అంతు చూస్తామని హెచ్చరించారు. మొత్తానికి.. ఒకవైపు ఈడీ విచారణ ఎదుర్కొంటూనే, మరోవైపు వైసీపీ అధినాయకత్వంపై విజయసాయిరెడ్డి తిరుగుబావుటా ఎగురవేయడం ఏపీ రాజకీయాల్లో చర్చకు దారితీసింది.






