కోవిడ్-19 పుట్టింది చైనా ల్యాబ్‌లో కాదు.. ఇక్క‌డేన‌న్న‌ రెండు కొత్త స్ట‌డీలు

by Disha Web Desk 20 |
కోవిడ్-19 పుట్టింది చైనా ల్యాబ్‌లో కాదు.. ఇక్క‌డేన‌న్న‌ రెండు కొత్త స్ట‌డీలు
X

దిశ‌, వెబ్‌డెస్క్ః క‌రోనా ప్ర‌పంచాన్ని ఎంత‌గా వణికించిందో ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌వ‌స‌రం లేదు. అయితే, అత్యంత ప్ర‌మాద‌కారిగా మారిన‌ ఈ వైర‌స్ మ‌నుషులు సృష్టించిందా, లేదా స‌హ‌జంగా ఏర్ప‌డి, వ్యాప్తి చెందిందా అనే విష‌యంపై ప‌లు అనుమానాలు ఇంకా ఉన్నాయి. అంత‌ర్జాతీయంగా దాదాపు అందురూ న‌మ్ముతున్న‌ది ఈ వైర‌స్‌ను చైనా ల్యాబ్‌లో త‌యారుచేయ‌గా, పొర‌పాటున బ‌య‌టకి లీక్ అయ్యింది అని. మ‌రో వాద‌న‌లో ఇది చైనా ప్ర‌యోగించిన జీవాయుధం అని. క‌రోనా మ‌హ‌మ్మారి వెనుక ఎన్ని కుట్ర సిద్ధాంతాలు ఉన్న‌ప్ప‌టికీ, తాజాగా ప్ర‌చురించిన రెండు అధ్య‌య‌నాలు మాత్రం అది చైనా ల్యాబ్‌లో నుండి వ‌చ్చింది కాద‌ని అభిప్రాయం వ్య‌క్తం చేశాయి. COVID-19 వైరస్ వ్యాప్తికి మూలాలు ఖచ్చితంగా చైనాలో ఉన్న‌ వుహాన్‌లోని హువానాన్ సీఫుడ్ మార్కెట్‌తోనే అని, మార్కెట్లో విక్రయించే జంతువుల నుండి వైరస్ ఉద్భవించిందని, ల్యాబ్ సృష్టి కాదని సూచిస్తున్నాయి.

CNN ప్రకారం, స‌ద‌రు అధ్యయనాలు ఫిబ్రవరిలో ప్రిప్రింట్‌లుగా ఆన్‌లైన్‌లో పోస్ట్ చేయ‌గా, మంగళవారం సైన్స్ జర్నల్‌లో ప్రచురించారు. ఈ రెండు అధ్యయనాలు వేర్వేరు మార్గాల్లో అధ్య‌య‌నం నిర్వ‌హించిన‌ప్ప‌టికీ, రెండూ ఒకే నిర్ణయానికి వచ్చిన‌ట్లు తెలుస్తుంది. వీటిని బ‌ట్టి వుహాన్‌లోని జంతు మార్కెట్ కోవిడ్‌కు కేంద్రంగా ఉంది. ఇక‌, ఈ అధ్య‌య‌నాల్లోని మొదటి దాని ప్ర‌కారం, చైనీస్ శాస్త్రవేత్తలు, పరిణామాత్మక జీవశాస్త్రవేత్త మైఖేల్ వోరోబే, అరిజోనా విశ్వవిద్యాలయానికి చెందిన ఆయ‌న‌ సహచరులు ప్రాదేశిక, పర్యావరణ విశ్లేషణను పూర్తిచేయ‌డానికి మ్యాపింగ్ సాధనాలు, సోషల్ మీడియా యాప్‌ను ఉపయోగించి డేటాను క్రోడీకరించారు. దీని ప్ర‌కారం, 2019 చివరిలో మార్కెట్లో విక్రయించిన ప్రత్యక్ష జంతువుల్లో కరోనావైరస్ ఉండొచ్చని పేర్కొన్నారు. అయితే "ఖచ్చితమైన పరిస్థితులు మాత్రం అస్పష్టంగానే ఉన్నాయి" అని అన్నారు. "మార్కెట్‌లో పనిచేసే వ్యక్తుల్లో వైరస్ వ్యాప్తి చెంద‌గా, అది స్థానిక సమాజంలోకి వ్యాపించడం ప్రారంభించింది" అని వోరోబీ విలేకరుల సమావేశంలో అన్నారు.

మ‌రో అధ్యయనం ప్ర‌కారం, డిసెంబరు 2019లో మొద‌టి నమూనాలోని జన్యువులతో ప్రారంభించి, 2020 ఫిబ్రవరి మధ్యకాలం వరకు జంతువుల నుండి మానవులకు మొదటి కరోనా వైరస్ సంక్రమణ ఎప్పుడు జ‌రిగిందో తెలుసుకోవడానికి సూక్ష్మ విశ్లేషణలో వివ‌రించారు. ఈ పరిశోధన ప్రకారం, కరోనావైరస్ తొలి వెర్షన్ బహుశా రెండు జ‌న‌రేష‌న్ల‌ను కలిగి ఉంది. వీటిని శాస్త్రవేత్తలు A, B అని పిలిచారు. ఈ వంశాలు మానవుల్లోకి కనీసం రెండు క్రాస్-జాతులుగా మారి, వ్యాప్తి చెందిన‌ట్లు తెలిపారు. మొదటి జంతువు-నుండి-మానవ ప్రసారం కాగా, అది బహుశా B వంశం నుండి వచ్చిందని ఈ ప‌రిణామం నవంబర్ 18, 2019 నాటికి జరిగిందని అధ్యయనం పేర్కొంది. ఎందుకంటే, జంతువుల మార్కెట్‌తో ప్రత్యక్ష సంబంధం ఉన్న వ్యక్తుల్లో వీళ్లు B రకాన్ని కనుగొన్నారు. ఇక‌, B నుండి సంక్రమించిన త‌ర్వార కొన్ని వారాల్లో లేదా రోజుల్లో, జంతువు నుండి A మానవులకు వ్యాప్తి చెందింద‌ని సూచించారు. ఇది మార్కెట్‌కు దగ్గరగా నివసించిన, లేదంటే అక్క‌డ‌ బస చేసిన వ్య‌క్తుల‌ నమూనాల్లో కనుగొనబడిన‌ట్లు తెలిపారు.


Next Story

Most Viewed