ఇసుక మాఫియా..రాత్రి, పగలు అడ్డు అదుపు లేకుండా రవాణా..

by Disha Web Desk 23 |
ఇసుక మాఫియా..రాత్రి, పగలు అడ్డు అదుపు లేకుండా రవాణా..
X

దిశ, కమలాపూర్: మండలంలో ఇసుక మాఫియా రెచ్చిపోతున్నారు. రాత్రి పగలు తేడా లేకుండా ఇసుకాసురులు ఇసుకను ఎవరికి తోచినంత వారు తోడేసి పట్టణాలకు, జిల్లా కేంద్రాలకు రవాణా చేస్తూ లక్షల్లో వ్యాపారం చేసి కాసులు దండుకుంటున్నారు. ఇంత జరుగుతున్న సంబంధిత అధికారుల తీరుపై చలనం లేకపోవడంపై పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

హనుమకొండ జిల్లా కమలాపూర్ మండలంలోని మర్రిపల్లిగూడెం, శనిగరం వాగులలో ఉన్న ఇసుకను, ఇసుక మాఫియా రాత్రి పగలు తేడా లేకుండా రోజు పదుల సంఖ్యలలో ట్రాక్టర్లతో ఇటు హనుమకొండ , వరంగల్ జిల్లాలతో పాటు కమలాపూర్ చుట్టుపక్కల ఉన్న గ్రామాలకు రవాణా చేయడమే కాకుండా, రహస్య డంపులను ఏర్పాటు చేసుకొని ఇసుకను డంపు చేసి రాత్రికి రాత్రి జిల్లా కేంద్రాలకు తరలిస్తూ లక్షల్లో వ్యాపారం సాగిస్తున్నారు.ఒక్కో ట్రాక్టరు సుమారు రోజుకు 4 నుండి 5 ట్రిప్పుల వరకు రవాణా చేస్తూ ఒక్కో ట్రాక్టర్ కు 3500 నుంచి 5500 వరకు వసూలు చేస్తూ కాసులు పోగేసుకుంటున్నారు.

యూనియన్లను ఏర్పాటు చేసుకొని యూనియన్ల ద్వారా అధికారులకు ముడుపులు ముడుతున్నాయనే విమర్శలు కూడా వినబడుతున్నాయి.ఇంత జరుగుతున్నా అధికారుల చర్యలు ఏవంటూ చూసిన వాళ్లంతా ముక్కున వేలేసుకుంటున్నారు. ఒకవేళ అధికారులు ట్రాక్టర్లను పట్టుకున్న రాజకీయ పలుకుబడితో మళ్లీ తిరిగి ట్రాక్టర్లు పొంది యదావిధిగా వ్యాపారం కొనసాగిస్తున్నారని, పలువురు అధికారుల తీరుపై విమర్శలు చేస్తున్నారు. ఈ ఇసుకాసురులపై ఉన్నతాధికారులు కఠిన చర్యలు తీసుకుని కట్టడి చేయాలని పలువురు అధికారులకు విజ్ఞప్తి చేస్తున్నారు. ఇప్పటికే పంటలకు నీళ్లు అందక పంటలు ఎండిపోతున్నాయని, ఇసుక మాఫియా ఇలానే కొనసాగితే చుట్టుపక్కల ఉన్న బావులలో భూగర్భ జలాలు ఎండిపోయి పంటలకు తీవ్ర నష్టం వాటిల్లుతుందని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

Next Story