ఉద్యోగుల ఉసురు పోసుకున్న పాపాత్ములు

by Sridhar Babu |
ఉద్యోగుల ఉసురు పోసుకున్న పాపాత్ములు
X

దిశ,తుంగతుర్తి : ఉద్యోగుల ఉసురు పోసుకున్న పాపాత్ముడు కేసీఆర్ అని కాంగ్రెస్ పార్టీ బలపరిచిన వరంగల్, ఖమ్మం, నల్లగొండ జిల్లాల పట్టభద్రుల అభ్యర్థి తీన్మార్ మల్లన్న ఆరోపించారు. 317 జీవోతో భర్త ఒకచోట, భార్య మరొక చోట ఉద్యోగులయ్యారని పేర్కొన్నారు. 46 జీవోతో విద్యార్థుల నోట్లో మట్టి కొట్టారని మండిపడ్డారు. సూర్యాపేట జిల్లా తిరుమలగిరి మండల కేంద్రంలో బుధవారం జరిగిన తుంగతుర్తి నియోజకవర్గ స్థాయి కాంగ్రెస్ పార్టీ సమావేశంలో పాల్గొని ప్రసంగించారు. 46 జీవోను రద్దు చేయగా 315 జీవో పై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారించి న్యాయం చేకూర్చే దిశలో ఉందని అన్నారు. నెలల తరబడి వేతనాలు అందక ఇబ్బందులు పడుతున్న కాంట్రాక్టు, ఔట్సోర్సింగ్ ఉద్యోగుల సమస్య కూడా పరిష్కారం కాబోతోందని అన్నారు. డీఏలు, బదిలీలు తదితర ఉద్యోగులకు సంబంధించిన అంశాలపై సమీక్ష జరిగిందని తెలిపారు.

ముఖ్యంగా తన పోటీ బీఆర్ఎస్ నేత కేటీఆర్ వెన్నులో వణుకు పుట్టిస్తోందని, ఎవరు గెలిచినా పర్వాలేదు కానీ తాను గెలవద్దనే విధానం ఆయనలో ఉందని అన్నారు. ముఖ్యంగా ప్రభుత్వానికి ఆస్తులు రాసిచ్చి రాజకీయాల్లోకి వచ్చిన నాయకులు ఎవరైనా ఉన్నారా..? నేను తప్ప..? అంటూ ప్రశ్నించారు. అధికారంలో లేకపోయినప్పటికీ పేదల పక్షాన నిలిచానని వివరించారు. కేసీఆర్ పై కొట్లాడిన ఫలితంగా తనపై వందల కేసులు నమోదయ్యాయని వివరించారు. పట్టభద్రుల ఎన్నికల్లో ఓట్ల కోసం వస్తున్న బీఆర్ఎస్ వారిని నమ్మొద్దని విజ్ఞప్తి చేశారు.

ఇదిలా ఉంటే తనను గెలిపించి అసెంబ్లీకి పంపిస్తారో...? లేక శ్మశానానికి పంపిస్తారో....? మీ ఇష్టం అంటూ ప్రశ్నించారు. అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికల్లో ఉన్న బ్యాలెట్ పేపర్లో మాదిరిగా చేయి గుర్తు ఉండదని పేర్కొంటూ పట్టభద్రుల ఎన్నికల్లో ఓటు వేసే విధానాన్ని వివరించారు. శాసనసభ్యులు మందుల సామెల్, జిల్లా కాంగ్రెస్ పార్టీ, మహిళ కమిటీ అధ్యక్షులు చెవిటి వెంకన్న, అనురాధ కిషన్ రావు, ఎంపీ అభ్యర్థి చామల కిరణ్ కుమార్ రెడ్డి, టీపీసీసీ ప్రధాన కార్యదర్శి బాలలక్ష్మి, నాయకులు రాజయ్య, వై.నరేష్, జుమ్మిలాల్, సుంకర జనార్ధన్, అంబేద్కర్ తదితర నాయకులు పాల్గొన్నారు.

Next Story

Most Viewed