AP:ప్రజలకు దూరమవడం నా దురదృష్టం:ముద్రగడ

by Disha Web Desk 18 |
AP:ప్రజలకు దూరమవడం నా దురదృష్టం:ముద్రగడ
X

దిశ ప్రతినిధి,కాకినాడ: ప్రజలకు దూరమవడం నా దురదృష్టమని మాజీ మంత్రి,వైసీపీ నాయకులు ముద్రగడ పద్మనాభం పేర్కొన్నారు. ప్రత్తిపాడు నియోజకవర్గం ప్రజలకు జీవితాంతం రుణపడి ఉంటానన్నారు. నన్ను కన్నది నా తల్లిదండ్రులు అయితే నన్ను పెంచి పోషించింది ప్రత్తిపాడు నియోజకవర్గం ప్రజలేనన్నారు. రౌతులపూడి మండలం ములగపూడి, రాజవరం, గంగవరం, దిగువ శివాడ, ఎగువ శివాడ, రామకృష్ణాపురంకు చెందిన వైసీపీ నాయకులు, ముద్రగడ అనుచరులు సోమవారం ముద్రగడను కలిసి వైసీపీ విజయానికి కృషి చేస్తామని తెలిపారు.

ఈ సమావేశానికి ప్రత్తిపాడు ఎమ్మెల్యే అభ్యర్థి వరుపుల సుబ్బారావు హాజరయ్యారు. వారిని ఉద్దేశించి ముద్రగడ మాట్లాడుతూ నేను 20 ఏళ్ళు రాజకీయంగా పదవులు లేనప్పటికీ నా మీద చూపిస్తున్న అభిమానానికి ధన్యవాదాలు తెలిపారు. నన్ను, నా తండ్రిని ఎమ్మెల్యేగా, ఎంపీగా గెలిపించడం వల్లే నేను ఈ స్థాయిలో ఉన్నానన్నారు. రాష్ట్రంలో ప్రతి ఒక్కరూ వైసీపీ విజయానికి కృషి చేయాలని పిలుపునిచ్చారు. నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్న వరుపుల సుబ్బారావును, ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న చలమలశెట్టి సునీల్‌ను అత్యధిక మెజార్టీతో గెలిపించాలన్నారు.

ఈ కార్యక్రమంలో పాల్గొన్న వరుపుల సుబ్బారావు మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్ చేసిన అభివృద్ధిని చూసి వైసీపీకి ఓట్లు వేయాలన్నారు. పత్తిపాడు నియోజకవర్గానికి ముద్రగడ చేసిన సేవలు ఇప్పటికీ నియోజకవర్గంలో చిరస్థాయిగా నిలిచి పోయాయన్నారు. ముద్రగడ పోటీ చేసినప్పుడు కూడా ఎన్నికల్లో ఓట్లు వేయాలని ఎప్పుడూ కూడా ఎవరి మీద ఒత్తిడి లేకుండా ఎన్నికల్లో పోటీ చేసేవారన్నారు. ఈ ఎన్నికల్లో స్వయంగా తను ఆసక్తి చూపించి కాకినాడ పార్లమెంట్ లోనే కాకుండా రాష్ట్రవ్యాప్తంగా వైసీపీ విజయానికి కృషి చేస్తున్నందుకు ధన్యవాదాలు తెలిపారు.

Next Story

Most Viewed