ట్రంప్ కీలక నిర్ణయం... సీజ్ ఫైర్ పొడగింపు

by Muthe.Rajitha |   (  Updated:2026-04-22 04:24:36  IST  )

ఇరాన్‌తో నెలకొన్న ఉద్రిక్తతల నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఒక కీలకమైన నిర్ణయం తీసుకున్నారు.

ట్రంప్ కీలక నిర్ణయం... సీజ్ ఫైర్ పొడగింపు
X

దిశ, వెబ్ డెస్క్ : ఇరాన్‌తో నెలకొన్న ఉద్రిక్తతల నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఒక కీలకమైన నిర్ణయం తీసుకున్నారు. ఏప్రిల్ 8న ప్రారంభమైన సీజ్ ఫైర్ (Ceasefire) ఏప్రిల్ 22 సాయంత్రంతో ముగియాల్సి ఉండగా.. దానిని మరింత కాలం పొడిగిస్తూ ట్రంప్ ప్రకటన చేసారు. ఇరాన్ ప్రభుత్వం నుండి ఒక స్పష్టమైన ప్రతిపాదన వచ్చే వరకు ఈ పొడిగింపు అమల్లో ఉంటుందని ఆయన స్పష్టం చేశారు. వాస్తవానికి ఈ గడువు పొడిగించే ప్రసక్తే లేదని ట్రంప్ గతంలో హెచ్చరించినప్పటికీ, పాకిస్తాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్, ఆ దేశ ఆర్మీ చీఫ్ జనరల్ అసిమ్ మునీర్ చేసిన మధ్యవర్తిత్వ విజ్ఞప్తి మేరకు ఆయన చివరి నిమిషంలో ఈ నిర్ణయం తీసుకోవడం గమనార్హం.

ట్రంప్ తన 'ట్రూత్ సోషల్' వేదికగా స్పందిస్తూ.. ఇరాన్ పాలక వర్గంలో తీవ్ర విభజనలు ఉన్నాయని విమర్శించారు. పొరుగు దేశాల అభ్యర్థనను గౌరవిస్తూ ప్రస్తుతానికి దాడులను నిలిపివేస్తున్నామని, అయితే హార్మూజ్ జలసంధి వద్ద నావల్ బ్లాకేడ్ మాత్రం యథాతథంగా కొనసాగుతుందని ఆయన హెచ్చరించారు. ఏప్రిల్ 11-12 తేదీల్లో ఇస్లామాబాద్‌లో జరిగిన మొదటి రౌండ్ చర్చలు ఇప్పటికే విఫలం కావడం, రెండో రౌండ్ చర్చలకు ఇరాన్ ఇంకా సమ్మతించకపోవడంతో గల్ఫ్ ప్రాంతంలో పరిస్థితి ఇప్పటికీ ఆందోళనకరంగానే ఉంది. అమెరికా సైన్యం పూర్తి సన్నద్ధతతో ఉందని ట్రంప్ ప్రకటించిన నేపథ్యంలో, ఇరాన్ తీసుకునే నిర్ణయం మీదనే యుద్ధం సంభవిస్తుందా లేదా శాంతి నెలకొంటుందా అనేది ఆధారపడి ఉంది.

డొనాల్డ్ ట్రంప్ వైఖరి ప్రపంచానికి ఇచ్చే హెచ్చరిక

Next Story