IMF: ఏఐ వల్ల మరో సైడ్ ఎఫెక్ట్

by S Gopi |

ఏఐ పెట్టుబడులతో టెక్నాలజీ కంపెనీల విలువలు భారీగా పెరగడం వల్ల పెట్టుబడిదారుల సంపద కూడా పెరుగుతోంది.

IMF: ఏఐ వల్ల మరో సైడ్ ఎఫెక్ట్
X

దిశ, బిజినెస్ బ్యూరో: కృత్రిమ మేధ (ఏఐ) ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు వృద్ధి అవకాశాలు తీసుకొస్తున్నప్పటికీ, అదే సమయంలో ద్రవ్యోల్బణాన్ని కూడా పెంచే ప్రమాదం ఉందని అంతర్జాతీయ ద్రవ్య నిధి (ఐఎంఎఫ్) ప్రధాన ఆర్థికవేత్త పియిర్ ఒలివె గురన్‌షా హెచ్చరించారు. ఏఐ ప్రభావం కేవలం చిప్‌లు, హార్డ్‌వేర్ వంటి సాంకేతిక ఉత్పత్తుల ధరలు పెరగడానికే పరిమితం కాదు. ఏఐ పెట్టుబడులతో టెక్నాలజీ కంపెనీల విలువలు భారీగా పెరగడం వల్ల పెట్టుబడిదారుల సంపద కూడా పెరుగుతోంది. దీంతో వినియోగదారులు ఎక్కువ ఖర్చు చేసేందుకు ముందుకు వస్తారు. ఈ అదనపు డిమాండ్ మార్కెట్‌లో ధరలపై కొత్త ఒత్తిడిని సృష్టించే అవకాశం ఉందని ఆయన వివరించారు. అంటే, ఏఐ సరఫరా వైపు మాత్రమే కాకుండా, డిమాండ్ వైపు నుంచి కూడా ద్రవ్యోల్బణాన్ని పెంచే శక్తిగా మారవచ్చని ఐఎంఎఫ్ అంచనా వేస్తోంది.

ఈ ప్రభావం ఇప్పటికే మార్కెట్‌లో కనిపిస్తోందని గురన్‌షా తెలిపారు. డేటా సెంటర్ల అవసరాలు పెరగడంతో మెమరీ, స్టోరేజ్ చిప్‌ల ధరలు పెరిగాయని, అదే కారణంగా ఇటీవల కొన్ని ఎలక్ట్రానిక్ ఉత్పత్తుల ధరలను కంపెనీలు పెంచాయని ఆయన గుర్తుచేశారు. అయితే ఏఐ ఒక్కటే ఆందోళన కాదని, ఇరాన్‌కు సంబంధించిన భౌగోళిక ఉద్రిక్తతల కారణంగా ఇంధన సరఫరాపై కొనసాగుతున్న అనిశ్చితి, అలాగే అధిక రుణభారం, మందగించిన ఆర్థిక వృద్ధి, పెరిగిన రుణ వ్యయాల వల్ల కూడా ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు పెద్ద సవాళ్లుగా మారాయని పేర్కొన్నారు. కరోనా తర్వాత వచ్చిన భారీ ద్రవ్యోల్బణాన్ని ప్రజలు ఇంకా మర్చిపోలేదని, అందుకే ధరల పెరుగుదలపై ప్రభుత్వాలు, కేంద్ర బ్యాంకులు మరింత అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందని ఆయన సూచించారు.

Next Story