ఆర్‌ఎస్‌ ప్రవీణ్ భద్రత తగ్గించడం కక్షసాధింపే : కేటీఆర్

by Naga Rani Yarlagadda |

బీఆర్ఎస్ జనరల్ సెక్రటరీ, మాజీ సీనియర్ ఐపీఎస్ అధికారి ఆర్‌ఎస్‌ ప్రవీణ్ కుమార్‌కు ప్రభుత్వం భద్రతను తగ్గించడంపై బీఆర్‌ఎస్‌ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ‘ఎక్స్’లో తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఆర్‌ఎస్‌ ప్రవీణ్ భద్రత తగ్గించడం కక్షసాధింపే : కేటీఆర్
X

దిశ, తెలంగాణ బ్యూరో: బీఆర్ఎస్ జనరల్ సెక్రటరీ, మాజీ సీనియర్ ఐపీఎస్ అధికారి ఆర్‌ఎస్‌ ప్రవీణ్ కుమార్‌కు ప్రభుత్వం భద్రతను తగ్గించడంపై బీఆర్‌ఎస్‌ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ‘ఎక్స్’లో తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. 25 సంవత్సరాల పాటు ఐపిఎస్ అధికారిగా దేశానికి, సుమారు దశాబ్దం పాటు గురుకుల విద్యా సంస్థల ద్వారా పేద విద్యార్థులకు ఎన్నో సేవలందించిన ఆర్‌ఎస్‌ ప్రవీణ్ కుమార్‌కు భద్రత తగ్గించడం పూర్తిగా కక్షసాధింపు చర్యేనని ఆయన విమర్శించారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వ అవినీతి, వైఫల్యాలను ప్రజల్లో ఎప్పటికప్పుడు ఎండగడుతున్నందుకే ప్రభుత్వం ఈ చర్యకు పాల్పడిందన్నారు. ఇప్పటికే పలుమార్లు ఆర్‌ఎస్‌ ప్రవీణ్ కుమార్‌పై హత్యాయత్నాలు జరిగాయని, తన ప్రాణాలకు ముప్పు ఉందని ఆయన స్వయంగా వెల్లడించినప్పటికీ కావాలనే భద్రతను తగ్గించడం వెనుక కుట్ర దాగి ఉందని కేటీఆర్ ఆరోపించారు. గురుకుల విద్యా వ్యవస్థలో జరుగుతున్న అక్రమాలను, ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను నిరంతరం ప్రశ్నించడం, అలాగే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మిత్రుడు, కేంద్రమంత్రి బండి సంజయ్ కుమారుడికి సంబంధించిన పోక్సో కేసులో ఆర్‌ఎస్‌ ప్రవీణ్ కుమార్ బలంగా స్పందించడం కూడా ఒక కక్షసాధింపు చర్యకు కారణమని కేటీఆర్ పేర్కొన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం కక్షసాధింపు రాజకీయాలను విరమించి, ఆర్‌ఎస్‌ ప్రవీణ్ కుమార్‌కు భద్రతను వెంటనే పునరుద్ధరించాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. ఆర్‌ఎస్‌ ప్రవీణ్ కుమార్‌కు ఎలాంటి అపాయం జరిగినా దానికి పూర్తి బాధ్యత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ ప్రభుత్వమే వహించాల్సి ఉంటుందని కేటీఆర్ హెచ్చరించారు.

Next Story