- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Gautam Adani: అదానీ కేసులో కొత్త మలుపు
ప్రస్తుతం సమర్పించిన వివరణ చాలా సంక్షిప్తంగా ఉందని, దాని ఆధారంగా కేసు కొట్టివేయడానికి న్యాయపరమైన నిర్ణయం తీసుకోలేమని జిల్లా జడ్జి నికోలస్ గరాఫిజ్ వ్యాఖ్యానించారు.

దిశ, బిజినెస్ బ్యూరో: దేశీయ బిలియనీర్, అదానీ గ్రూప్ ఛైర్మన్ గౌతమ్ అదానీ, ఆయన మేనల్లుడు సాగర్ అదానీపై అమెరికాలో నమోదైన కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. కేసును ఉపసంహరించుకోవాలన్న అమెరికా న్యాయ శాఖ అభ్యర్థనను న్యూయార్క్ డిస్ట్రిక్ట్ కోర్టు వెంటనే అంగీకరించలేదు. కేసును ఎందుకు కొట్టివేయాలనుకుంటున్నారో స్పష్టమైన కారణాలు, వాస్తవ ఆధారాలతో వివరించాలని అమెరికా ప్రభుత్వాన్ని ఆదేశించింది. ప్రస్తుతం సమర్పించిన వివరణ చాలా సంక్షిప్తంగా ఉందని, దాని ఆధారంగా కేసు కొట్టివేయడానికి న్యాయపరమైన నిర్ణయం తీసుకోలేమని జిల్లా జడ్జి నికోలస్ గరాఫిజ్ వ్యాఖ్యానించారు. ఈ అంశంపై పూర్తి వివరణను జూలై 13లోగా సమర్పించాలని కోర్టు ఆదేశించింది. 2024 నవంబర్‌లో అమెరికన్ పెట్టుబడిదారులకు సంబంధించి లంచాలు, తప్పుడు సమాచారం ఇచ్చారనే ఆరోపణలతో గౌతమ్ అదానీ, సాగర్ అదానీతో పాటు అదానీ గ్రూప్ అధికారులపై క్రిమినల్ కేసు నమోదైంది. అనంతరం అమెరికా న్యాయ శాఖ ఆ కేసును ఉపసంహరించుకునే దిశగా రాజీ ప్రయత్నాలు ప్రారంభించగా, సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ కమిషన్ (ఎస్ఈసీ) కూడా సివిల్ కేసులో ఒప్పందానికి సిద్ధమైంది. అయినప్పటికీ, ఆ నిర్ణయానికి తగిన న్యాయపరమైన కారణాలు లేవని భావించిన కోర్టు విచారణను కొనసాగించాలని నిర్ణయించింది. దీంతో అమెరికాలో అదానీ గ్రూప్‌నకు సంబంధించిన న్యాయపరమైన అనిశ్చితి ఇంకా కొనసాగుతోంది. ఇదే సమయంలో ఇటీవల జరిగిన వార్షిక సర్వసభ్య సమావేశంలో గౌతమ్ అదానీ, క్లిష్టమైన ఇన్విస్టిగేషన్ మధ్య కూడా తమ గ్రూప్ తలొగ్గలేదని చెప్పడం గమనార్హం.






