ప్రతి ఉద్యమకారుడికి గుర్తింపు పత్రం అందిస్తాం : ఎమ్మెల్సీ కోదండరాం

by Batti.Sumithra |

అన్ని వర్గాల ప్రజల పోరాట ఫలితంగానే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందని, రాష్ట్రం ఏర్పడి 12 ఏళ్లు గడిచినా ఉద్యమకారులకు తగిన గుర్తింపు లభించలేదని తెలంగాణ ఉద్యమకారుల గుర్తింపు కమిటీ సభ్యుడు, ఎమ్మెల్సీ ప్రొఫెసర్ కోదండరాం అన్నారు.

ప్రతి ఉద్యమకారుడికి గుర్తింపు పత్రం అందిస్తాం : ఎమ్మెల్సీ కోదండరాం
X

దిశ ప్రతినిధి, నిజామాబాద్ : అన్ని వర్గాల ప్రజల పోరాట ఫలితంగానే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందని, రాష్ట్రం ఏర్పడి 12 ఏళ్లు గడిచినా ఉద్యమకారులకు తగిన గుర్తింపు లభించలేదని తెలంగాణ ఉద్యమకారుల గుర్తింపు కమిటీ సభ్యుడు, ఎమ్మెల్సీ ప్రొఫెసర్ కోదండరాం అన్నారు. శనివారం నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని న్యూ అంబేద్కర్ భవన్‌లో తెలంగాణ ఉద్యమకారుల ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. తెలంగాణ ఉద్యమకారుల జేఏసీ జిల్లా చైర్మన్ గోపాల్ శర్మ, కన్వీనర్ గైనీ గంగారాం ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి ఎమ్మెల్సీ ప్రొఫెసర్ కోదండరాం, ప్రభుత్వ విప్ ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్, ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహెర్ బిన్ హందాన్, మాజీ జడ్పీ చైర్మన్ దాదన్నగారి విఠల్‌రావు, ప్రభాకర్ తదితరులు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.

ఈ సందర్భంగా కోదండరాం మాట్లాడుతూ, తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న ప్రతి ఉద్యమకారుడికి గుర్తింపు పొందడం హక్కు అని అన్నారు. ఉద్యమంలో పాల్గొన్న వారందరికీ గుర్తింపు పత్రాలు అందజేస్తామని తెలిపారు. ఉద్యమకారులతో సంప్రదింపులు జరపకుండా ఎలాంటి నిర్ణయాలు తీసుకోబోమని, వారి అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకుని కమిటీ ముందుకు సాగుతుందని చెప్పారు. ఉద్యమకారుల సంక్షేమమే కమిటీ ప్రధాన లక్ష్యమని పేర్కొన్న ఆయన, ప్రజల పోరాటాల ద్వారానే తెలంగాణ సాధ్యమైందన్నారు. ప్రభుత్వం జారీ చేసిన జీవో నెం. 679 ద్వారా ఈ కమిటీని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. 1956 నుంచి తెలంగాణ రాష్ట్రం ఏర్పడే వరకు వివిధ దశల్లో ఉద్యమాల్లో పాల్గొన్న వారందరినీ గుర్తించి, వారి సంక్షేమానికి చర్యలు తీసుకోవడమే కమిటీ ఉద్దేశమని వివరించారు. ఉద్యమకారుల సంక్షేమానికి అవసరమైన సూచనలు సేకరించి ప్రభుత్వానికి అందజేస్తామని, ఉద్యమంలో సేవలందించిన ప్రతి ఉద్యమకారుడిని గుర్తించి న్యాయం చేసే వరకు కమిటీ తన బాధ్యతను కొనసాగిస్తుందని కోదండరాం స్పష్టం చేశారు.

నిజమైన ఉద్యమకారులకే గుర్తింపు: అద్దంకి దయాకర్

ప్రభుత్వ విప్, ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ మాట్లాడుతూ, తెలంగాణకు ప్రత్యేకమైన చరిత్ర ఉందని, ఆ చరిత్రను సృష్టించిన ఘనత ఉద్యమకారులదేనని అన్నారు. నిజమైన ఉద్యమకారులను గుర్తించడమే కమిటీ ప్రధాన లక్ష్యమని చెప్పారు. తెలంగాణ రాష్ట్రం ఇతర రాష్ట్రాల మాదిరిగా ఏర్పడలేదని, ప్రత్యేక అస్తిత్వం కోసం సాగిన ఉద్యమం, త్యాగాల ఫలితంగానే తెలంగాణ సాధ్యమైందన్నారు. త్వరలో తెలంగాణ ఉద్యమ చరిత్రను సమగ్రంగా నమోదు చేస్తామని, నిజామాబాద్ ఉద్యమాల గడ్డగా చరిత్రలో నిలిచిపోయిందని పేర్కొన్నారు. ఉద్యమకారులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, తమ వివరాలను నమోదు చేసుకోవాలని సూచించారు. నమోదు ప్రక్రియ కోసం ఆన్‌లైన్ వెబ్‌సైట్‌ను కూడా ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. ఏ రాజకీయ పార్టీకి చెందిన వారైనా సరే, నిజమైన ఉద్యమకారులను గుర్తించడం మాత్రమే కమిటీ లక్ష్యమని చెప్పారు. చివరి ఉద్యమకారుడి పేరు నమోదు అయ్యే వరకు ప్రక్రియ కొనసాగుతుందని, జిల్లా కలెక్టర్ నేతృత్వంలో ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేయాలనే ప్రతిపాదన కూడా ఉందన్నారు.

ఉద్యమ కళాకారులను ఆదుకోవాలి

తెలంగాణ ఉద్యమకారుల జేఏసీ జిల్లా కన్వీనర్ గైనీ గంగారాం మాట్లాడుతూ, ఉద్యమంలో సేవలందించిన ప్రతి ఉద్యమకారుడికి తగిన లబ్ధి చేకూరేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు. ఉద్యమంలో కవులు, కళాకారుల పాత్ర అమూల్యమైందని, ఆటా–పాటల ద్వారా ఉద్యమ స్ఫూర్తిని ప్రజల్లోకి తీసుకెళ్లారని అన్నారు. జిల్లాలో వందకు పైగా ఉద్యమ కళాకారులు ఉన్నారని, వారికి ఇండ్ల స్థలాలు, ఉద్యోగాలు కల్పించి ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు.

ఆటా–పాటలతో అలరించిన కళాకారులు

తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న కళాకారులు ఆలపించిన ఉద్యమ గీతాలు సభలో పాల్గొన్న వారిని ఆనాటి ఉద్యమ రోజుల్ని గుర్తు చేశాయి. ఈ కార్యక్రమంలో సూరి, తెలంగాణ శంకర్, పులగం మోహన్, హుస్సేన్, ఆదే ప్రవీణ్, చింత మహేష్, శ్రీకాంత్, తోట రాజశేఖర్‌తో పాటు పలువురు తెలంగాణ ఉద్యమకారులు పాల్గొన్నారు.

Next Story