- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
రెండు వారాల్లో 426 డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు : పోలీస్ కమిషనర్
నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో గత రెండు వారాలుగా నిర్వహించిన ప్రత్యేక డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీల్లో 426 కేసులు నమోదు చేసినట్లు పోలీస్ కమిషనర్ పోతరాజు సాయి చైతన్య తెలిపారు.

దిశ ప్రతినిధి, నిజామాబాద్ : నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో గత రెండు వారాలుగా నిర్వహించిన ప్రత్యేక డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీల్లో 426 కేసులు నమోదు చేసినట్లు పోలీస్ కమిషనర్ పోతరాజు సాయి చైతన్య తెలిపారు. ఈ కేసుల్లో నిందితులను నిజామాబాద్, బోధన్, ఆర్మూర్ కోర్టుల్లో హాజరుపరచగా, 10 మందికి వారం రోజుల జైలు శిక్ష విధించారు. మిగిలిన వారికి మొత్తం రూ. 41.60 లక్షల జరిమానా విధించినట్లు సీపీ వెల్లడించారు. కమిషనరేట్ పరిధిలోని నిజామాబాద్, ఆర్మూర్, బోధన్ డివిజన్లు, ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ల పరిధిలో జూన్ 15 నుంచి 27 వరకు విస్తృతంగా వాహన తనిఖీలు నిర్వహించగా, మద్యం సేవించి వాహనాలు నడుపుతున్న 426 మంది పోలీసులకు చిక్కినట్లు ఆయన తెలిపారు. మద్యం సేవించి వాహనాలు నడపరాదని, వాహనాలకు సంబంధించిన అన్ని పత్రాలను వెంట ఉంచుకోవాలని ఈ సందర్భంగా పోలీస్ కమిషనర్ ప్రజలకు సూచించారు. డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో పట్టుబడిన వారి డ్రైవింగ్ లైసెన్స్‌ను ఆరు నెలల పాటు సస్పెండ్ చేస్తామని కూడా హెచ్చరించారు. మద్యం సేవించి వాహనం నడుపుతూ ప్రమాదానికి కారణమైతే బీమా (ఇన్సూరెన్స్) వర్తించదని తెలిపారు.
మైనర్లు మద్యం సేవించి వాహనం నడుపుతూ పట్టుబడితే, మైనర్‌తో పాటు వాహన యజమానిపై కూడా కేసు నమోదు చేసి చార్జ్‌షీట్ దాఖలు చేస్తామని అన్నారు. అలాంటి కేసుల్లో జైలు శిక్ష విధించే అవకాశం కూడా ఉంటుందని సీపీ పేర్కొన్నారు. ఒకటి కంటే ఎక్కువసార్లు డ్రంక్ అండ్ డ్రైవ్‌లో పట్టుబడితే జైలు శిక్ష తప్పదని సీరియస్‌గా హెచ్చరించారు. మోటార్ వెహికల్స్ చట్టం–1988 (2019 సవరణ) ప్రకారం మొదటిసారి పట్టుబడిన వారికి రూ.10 వేల జరిమానా లేదా ఆరు నెలల జైలు శిక్ష విధించబడుతుందన్నారు. అవసరమైతే ఈ రెండూ కూడా విధించే అవకాశం ఉందని తెలిపారు. రెండోసారి పట్టుబడితే రూ.15 వేల జరిమానా, జైలు శిక్ష లేదా రెండూ విధించబడతాయని పోలీస్ కమిషనర్ వెల్లడించారు.






